- ఏఐబీఎస్పీ జాతీయసమన్వయకర్త పూర్ణచంద్రరావు
ఎల్బీనగర్, వెలుగు: కుమ్మరులు సర్పంచ్‌లు, ఎంపీటీసీలకే పరిమితం కాకుండా చట్టసభల్లోనూ సత్తా చాటేందుకు రాజకీయ పోరాటం చేయాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ(ఏఐబీఎస్పీ) జాతీయ సమన్వయకర్త, మాజీ డీజీపీ డాక్టర్ జె.పూర్ణచంద్రరావు పిలుపునిచ్చారు. ఆదివారం నాగోల్‌లోని స్వాగత్ గ్రాండ్ హోటల్‌లో కుమ్మరి సర్పంచుల అభినందన సభ నిర్వహించారు. ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడిచినా కుమ్మరులు ఇప్పటివరకు చట్టసభల్లో అడుగుపెట్టలేదన్నారు. అసెంబ్లీలో అడుగుపెట్టేవరకు కుమ్మరులను కుండలు చేసే వారిగానే చూస్తారని అన్నారు. ఆధిపత్య కులాల పార్టీలకు ఊడిగం చేయకుండా, కుమ్మరులకు రాజ్యాధికారం అందించే రాజకీయ పార్టీలను ఎంచుకుని సమష్టిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దరం వీర్ ప్రజాపతి, రాజ్యసభ మాజీ సభ్యుడు దినేశ్బాయ్ అన్నావాడియా, గోవింద్ వల్లభాయ్ దాస్, శివకుమార్ చౌడిశెట్టి, నిదిగొంస నరేశ్, దాసారం రాజు తదితరులు
పాల్గొన్నారు.
