ప్రజల కోసమే రాహుల్ పాదయాత్ర చేస్తుండు: వేణుగోపాల్

 ప్రజల కోసమే రాహుల్ పాదయాత్ర చేస్తుండు: వేణుగోపాల్
  • రాహుల్ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తారు
  • రోజూ 25కిలోమీటర్లు నడుస్తున్నారు
  • ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్

హైదరాబాద్: దేశంలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వారి కోసమే రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఈ నెల 23న రాహుల్ యాత్ర తెలంగాణలో ప్రవేశిస్తున్న సందర్భంగా గాంధీ భవన్ లో రాహుల్ యాత్ర రూట్ మ్యాప్ ను కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మొత్తం 3,560 కిలో మీటర్ల మేర రాహుల్  పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఇంత వరకు ఏ నాయకుడు చేయని సాహసాన్ని రాహుల్ చేశారని చెప్పారు. పాదయాత్రలో భాగంగా ఉదయం 4 గంటలకే రాహుల్ నిద్ర లేస్తారని, రోజుకు 25 కిలో మీటర్ల మేర నడుస్తారని వివరించారు. ఎల్లుండితో రాహుల్ పాదయాత్ర 1000 కిలోమీటర్ల మైలురాయిని దాటుతుందని కేసీ వేణుగోపాల్ చెప్పారు. రాహుల్ యాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని పేర్కొన్నారు. 

రాహుల్ యాత్రకు అన్ని ఏర్పాట్లు చేయండి

రాష్ట్రంలో రాహుల్ యాత్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని కేసీ వేణుగోపాల్ రాష్ట్ర కాంగ్రెస్ నేతలను ఆదేశించారు. భారత్ జోడో యాత్రపై గ్రామాల్లో, పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. రైతులు, ఆశా వర్కర్లు, వివిధ వర్గాలతో రాహుల్ ఇంటరాక్ట్ అయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. దీనికోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటుచేసుకోవాలని చెప్పారు. జన సమీకరణ కోసం చర్యలు తీసుకోవాలని, కళాకారులచేత ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు  ఐక్యంగా ఉన్నారని ఈ యాత్ర ద్వారా చాటిచెప్పాలని వేణుగోపాల్ పిలుపునిచ్చారు. 

రాహుల్ యాత్రపై బీజేపీ దుష్ప్రచారం చేస్తోంది

రాహుల్ యాత్రపై బీజేపీ, సంఘ్ పరివార్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ జోడో యాత్రకు వస్తున్న స్పందనను చూసి వారిలో భయం మొదలైందన్నారు. అందుకే రాహుల్ కు వ్యతిరేకంగా రకరకాల పేర్లతో యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా రాహుల్ గాంధీ తన పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేస్తారని, ఈ పాదయాత్రతో ఆయన తిరుగులేని నేతగా అవతరిస్తారని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు.