గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలి

గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలి
  • ఏఐఎస్​ఎఫ్, ఎస్ఎఫ్ఐ డిమాండ్​

హైదరాబాద్​/ఇబ్రహీంపట్నం, వెలుగు: వేల మంది స్టూడెంట్ల జీవితాలతో చెలగాటమాడుతున్న గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) డిమాండ్ చేసింది. స్టూడెంట్లను మోసం చేసిన గురునానక్​విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలంటూ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం చౌరస్తాలోని అంబేద్కర్​విగ్రహం ముందు నేతలు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యాసంస్థల దోపిడీఎక్కువైందని, ఎలాంటి అనుమతులు లేకుండానే గురునానక్ యూనివర్సిటీ అడ్మిషన్లను స్వీకరించిందన్నారు. 3,800 మంది స్టూడెంట్లను జాయిన్​చేసుకొని, రూ.180 కోట్ల ఫీజులను వసూలు చేసి, వారి జీవితాలతో చెలగాటం ఆడిన కాలేజీ నిర్వాహకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

గురునానక్, శ్రీనిధిలపై క్రిమినల్ ​కేసులు పెట్టాలె 

గురునానక్, శ్రీనిధి, ఎంఎన్ఆర్ విద్యాసంస్థల యాజమాన్యాలపై క్రిమినల్ ​కేసులు నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్ మూర్తి, కార్యదర్శి నాగరాజు బాధిత స్టూడెంట్లతో  కలిసి ఉన్నత విద్యామండలి  చైర్మన్​ ప్రొఫెసర్​ లింబాద్రికి వినతి పత్రం అందజేశారు.