
- సెక్రటేరియెట్ ముట్టడికి ఏఐఎస్ఎఫ్ యత్నం
- స్టేట్ ప్రెసిడెంట్పై చేయిచేసుకున్న డీసీపీ
- నేతలను కొట్టుకుంటూ, ఈడ్చుకుంటూ వ్యాన్లలోకి తోసేసిన పోలీసులు
హైదరాబాద్, వెలుగు: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, విద్యా సంస్థల్లోకి మీడియా, స్టూడెంట్ యూనియన్లను నిషేధించడాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ బుధవారం నిర్వహించిన సెక్రటేరియెట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. లిబర్టీ నుంచి ర్యాలీగా వచ్చిన విద్యార్థి నేతలు సెక్రటేరియేట్ ముందుకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడే వారంతా బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీ వెంకటేశ్వర్లు అత్యుత్యాహంతో స్టేట్ ప్రెసిడెంట్ పై చేయిచేసుకున్నారు. దీంతో పోలీసులు కూడా రెచ్చిపోయి నేతలను బలవంతంగా ఈడ్చుకుంటూ, కొట్టుకుంటూ పోలీసు వాహనాల్లోకి తోసేశారు.
ఈ క్రమంలో ఏఐఎస్ఎఫ్ నేతలు ప్రతిఘటించడంతో, పోలీసులకు వారికి తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో నేతలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
డీసీపీ తీరుపై సర్వత్రా విమర్శలు
నిరసన తెలుపుతున్న ఐఏఎస్ఎఫ్ నేతలపై డీసీపీ వెంకటేశ్వర్లు వ్యవహరించిన తీరుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒకే వ్యాన్లో వందలాది మందిని కుక్కి తీసుకుపోతుండటంపై ప్రశ్నించిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠపై డీసీపీ చేయిచేసుకున్నారు.