రాష్ట్రంలో గర్భిణులకు రక్తం దొరకట్లే: అజయ్ కుమార్ ఘోష్​

రాష్ట్రంలో గర్భిణులకు రక్తం దొరకట్లే: అజయ్ కుమార్ ఘోష్​

హైదరాబాద్, వెలుగు: సారు.. కారు మళ్లీరారు అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమ్యూనికేషన్స్ ఇన్​చార్జ్ అజయ్ కుమార్ ఘోష్ అన్నారు. తాము కేసీఆర్​ వైఫల్యాల కారును ప్రదర్శిస్తే.. పోలీసులు తీసుకెళ్లిపోయి వాటిని లేకుండా చేశారన్నారు. ఆదివారం గాంధీభవన్​లో పీసీసీ సీనియర్ వైస్​ ప్రెసిడెంట్ మల్లు రవితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా కేసీఆర్ అవినీతి, ఆస్తులపై వీడియోను ప్రదర్శించారు. రాష్ట్రంలో వైద్యరంగం చాలా దారుణంగా ఉందని అజయ్ విమర్శించారు. గర్భిణులకు రక్తం సరిగ్గా దొరకడం లేదన్నారు. ఎక్కువ మంది ప్రజలకు పోషకాహారం అందడం లేదని చెప్పారు. ఆరోగ్య రంగం మౌలిక వసతుల్లో తెలంగాణ 14వ స్థానంలో ఉందని చెప్పారు. దేశంలోనే తెలంగాణలో ప్రైవేట్ వైద్యం ఎక్కువగా జరుగుతున్నదని మండిపడ్డారు. 70 శాతం మంది పిల్లలకు సరైన వైద్యం అందడం లేదని విమర్శించారు.

మాటల గారడీ ప్రభుత్వం: మల్లు రవి

మండల కేంద్రాల్లో 30 బెడ్ల ఆస్పత్రి, నియోజకవర్గ కేంద్రాల్లో 100 పడకల ఆస్పత్రి, జిల్లాకో సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రులు కట్టిస్తామన్న సీఎం కేసీఆర్.. వాటిని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమయ్యారని మల్లు రవి విమర్శించారు. రెండు సార్లు సీఎంగా ఉన్న ఆయన.. ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రజలకు అడిగే స్వేచ్ఛ కూడా లేదని చెప్పారు. 

రాష్ట్రంలో నిర్బంధం కొనసాగుతున్నదని చెప్పారు. వైద్యారోగ్య శాఖలో 12,735 ఖాళీలున్నాయన్నారు. డాక్టర్ పోస్టులు 2,659, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు 1,183 ఉన్నాయని తెలిపారు. పదేండ్లుగా మాటల గారడీతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు.