రహానె తప్పులను అర్థం చేసుకోవాలి

రహానె తప్పులను అర్థం చేసుకోవాలి

సౌతాంప్టన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌షిప్ ఫైనల్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌‌లో న్యూజిలాండ్ బౌలర్లు విజృంభించడంతో టీమిండియా 217 రన్స్‌కే పరిమితమైంది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఈ విషయాన్ని పక్కనబెడితే భారత్ ఇన్నింగ్స్‌లో వైస్ కెప్టెన్ అజింక్యా రహానె (49) ఆకట్టుకున్నాడు. కానీ కీలక సమయంలో అతడు క్రీజును వీడటం భారత్‌ను దెబ్బతీసింది. షార్ట్‌‌పిచ్ బంతికి అనుభవజ్ఞుడైన రహానె ఔటవ్వడంపై వెటరన్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ నిరాశను వ్యక్తం చేశాడు. రహానేకు లక్ష్మణ్ పలు సూచనలు చేశాడు. కొన్ని విషయాల్లో అతడు చాలా మెరుగవ్వాలన్నాడు. 

‘తొలి ఇన్నింగ్స్‌లో రహానె బాగా ఆడాడు. క్రీజులో అతడు కదులుతున్న తీరు ఆకట్టుకుంది. బ్యాటింగ్‌లో ఎలాంటి బెరుకు లేకుండా ఆడాడు. కానీ రహానె ఔటైన తీరు నాకు నచ్చేలేదు. క్రైస్ట్‌‌చర్చ్‌లో ఎలాంటి గేమ్‌‌ప్లాన్ అమలు చేశారో అదే ప్లాన్‌తో కివీస్ రహానేను కట్టడి చేసింది. దీన్ని అతడు అర్థం చేసుకోవాలి. షార్ట్‌‌బాల్స్‌ను ఎదుర్కోవడానికి అతడో మార్గాన్ని కనుకకోవాలి. నా కెరీర్ ఆరంభంలో సచిన్ ఇచ్చిన సూచననే రహానేకు ఇస్తున్నా.. బ్యాట్స్‌‌మన్‌కు తన ఆఫ్‌ స్టంప్ ఎక్కడుందో తెలియాలి. ఆడకూడని బాల్‌ను ఎలా ఆడాలో బ్యాట్స్‌‌మన్‌కు తెలియాలి. అదే సమయంలో బౌన్సర్లను ఢిఫెన్స్ చేయడం, వదిలేయడం కూడా నేర్చుకోవాలి. మన బలహీనతలు ప్రత్యర్థులకు తెలిస్తే.. వాళ్లు బౌన్సర్లతో దాడి చేయడం ఖాయం’ అని లక్ష్మణ్ పేర్కొన్నాడు.