జమ్మూలోని ‘కాశ్మీర్ టైమ్స్’ ఆఫీస్లో ఏకే 47 బుల్లెట్లు

జమ్మూలోని  ‘కాశ్మీర్ టైమ్స్’ ఆఫీస్లో ఏకే 47 బుల్లెట్లు
  • ఆ పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్  అనురాధా భాసిన్ పై ఎఫ్ఐఆర్

శ్రీనగర్: జమ్మూలోని కాశ్మీర్ టైమ్స్ మీడియా సంస్థ కార్యాలయంలో ఏకే 47 బుల్లెట్లు లభ్యమయ్యాయి. దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై జమ్మూ కాశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎస్ఐఏ) గురువారం ఉదయం కాశ్మీర్ టైమ్స్ కార్యాలయంలో రెయిడ్స్​ ప్రారంభించింది. వార్తాపత్రిక కంప్యూటర్లతో పాటు ఆఫీసు ప్రాంగణంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. 

ఈ  సోదాల్లో ఏకే-47 కార్ర్టిడ్జులు, పిస్టల్ రౌండ్లు, మూడు గ్రెనేడ్ లివర్లు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. దేశంతో పాటు జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా, వేర్పాటువాదానికి అనుకూలంగా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలపై  కాశ్మీర్ టైమ్స్‌‌‌‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే, ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధా భాసిన్ పేరును కూడా ఎఫ్ఐఆర్‌‌‌‌లో చేర్చారు. 

దేశ సార్వభౌమత్వానికి ముప్పుగా ఉన్న ఈ వార్తాపత్రిక సంబంధాలు, కార్యకలాపాలను పరిశీలించడమే ఈ దర్యాప్తు లక్ష్యమని పోలీసువర్గాలు తెలిపాయి. కాశ్మీర్ టైమ్స్.. జమ్మూ కాశ్మీర్‌‌‌‌లోని అత్యంత పురాతనమైన, ప్రముఖ వార్తాపత్రికల్లో ఒకటి. దీనిని వేద్ భాసిన్ 1954లో వారపత్రికగా స్థాపించారు. 1964లో దినపత్రికగా మార్చారు. కాగా, ఈ దాడులను కాశ్మీర్ టైమ్స్ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. 

తమ గళాన్ని అణచివేసేందుకే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నామంటూ ఆరోపణలు చేస్తున్నారని పత్రిక ఎడిటర్లు ప్రబోధ్ జామ్వాల్, అనురాధ భాసిన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. “మా కార్యాలయంపై దాడులు, రాష్ట్ర వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలు, మా నోరు మూయించే ప్రయత్నం” అని విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే రాష్ట్ర వ్యతిరేకం కాదని, ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి బలమైన, ప్రశ్నించే మీడియా అవసరమని పేర్కొన్నారు.