న్యూఢిల్లీ: గాయాలతో బాధపడుతున్న పేసర్లు ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా.. త్వరలో జరగనున్న అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ పర్యటనకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిద్దరు మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాల్సి ఉందని బీసీసీఐ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. బ్యాక్ ఇంజ్యురీ నుంచి కోలుకుంటున్న ఆకాశ్ ప్రస్తుతం రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు.
టీ20 వరల్డ్ కప్‌కు ముందు లిగమెంట్లు చిరిగిపోవడంతో హర్షిత్ మోకాలికి సర్జరీ జరిగింది. దాంతో అప్పట్నించి హర్షిత్ ఆటకు దూరంగా ఉన్నాడు. ఈ గాయాల వల్లే ఈ ఇద్దరు ఐపీఎల్‌లో ఆడటం లేదు. ఫిట్‌నెస్ కోసం రన్నింగ్స్, స్ప్రింట్స్ చేస్తున్న ఈ ఇద్దరు చివరగా రిటర్న్ టు ప్లే ప్రోటోకాల్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉన్నందున ఆగస్ట్‌లో జరిగే దులీప్ ట్రోఫీతో వీళ్లు కాంపిటీటివ్ క్రికెట్‌లో అడుగు పెట్టే అవకాశం ఉంది. ఆకాశ్ దీప్‌ను టెస్ట్‌లకు, హర్షిత్ రాణాను వన్డే, టీ20 ఫార్మాట్‌లో ఆడించాలని సెలెక్టర్లు భావిస్తున్నారు.
