
- రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ
- వికారాబాద్‌లో ఆకస్మిక తనిఖీలు
వికారాబాద్, వెలుగు: విద్యా వ్యవస్థను ఉన్నతంగా తీర్చిదిద్దడం, సమూల మార్పుల కోసం అధ్యయనం చేస్తున్నామని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళీ తెలిపారు. వికారాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, డైట్ కాలేజీలను కమిషన్ సభ్యులు పీఎల్ విశ్వేశ్వరరావు, డాక్టర్ చారుకొండ వెంకటేశ్, జ్యోత్స్నాశివారెడ్డితో కలిసి సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మౌలిక సదుపాయాలు, బోధన సిబ్బంది, విద్యార్థుల సంఖ్యపై ఆరా తీశారు. అధ్యాపకులు, విద్యార్థుల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు చెప్పారు.
డైట్ విద్యార్థులు ఇంగ్లీషు, ఉర్దూ పాఠ్యపుస్తకాలు, వసతి సౌకర్యాల కొరతను లేవనెత్తగా.. వీటిని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని మురళీ హామీ ఇచ్చారు. గెస్ట్ ఫ్యాకల్టీ సమస్యలు కూడా తమ దృష్టికి వచ్చాయని, వీటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. డైట్ వసతి గృహంలో మరమ్మతులు చేపట్టి, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్వహణకు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో విద్యాబోధన విధానాలపై చర్చించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులను స్పీకర్ సత్కరించారు. పర్యటనలో జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి శంకర్ నాయక్, డీఈవో రేణుకా దేవి, ప్రిన్సిపాళ్లుగీతా లక్ష్మీ పట్నాయక్, రామాచారి పాల్గొన్నారు.