హైదరాబాద్ లో సంబురంగా అలయ్ బలయ్.. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు వివేక్, వెంకట్‌‌‌‌రెడ్డి, పొన్నం

హైదరాబాద్ లో సంబురంగా అలయ్ బలయ్..   కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు వివేక్, వెంకట్‌‌‌‌రెడ్డి, పొన్నం
  • హర్యానా మాజీ గవర్నర్‌‌‌‌‌‌‌‌ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహణ
  • ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌‌‌‌‌‌‌‌ జిష్ణుదేవ్‌‌‌‌ వర్మ
  •  మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఆర్మీ జనరల్ అజయ్ మిశ్రా కూడా హాజరు

హైదరాబాద్, వెలుగు: దసరాను పురస్కరించుకొని ఏటా నిర్వహిస్తున్న అలయ్‌‌‌‌ బలయ్‌‌‌‌ కార్యక్రమం సంబురంగా సాగింది. శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌‌‌‌లో హర్యానా మాజీ గవర్నర్‌‌‌‌ బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ‘అలయ్‌‌‌‌ బలయ్‌‌‌‌’ నిర్వహించారు. గవర్నర్​ జిష్ణుదేవ్‌‌‌‌ వర్మ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

ఇందులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,  మంత్రులు వివేక్‌‌‌‌ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌,  పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. దత్తాత్రేయ వారికి కండువాలు కప్పి, స్వాగతం పలికారు. గవర్నర్‌‌‌‌‌‌‌‌ జిష్ణుదేవ్​ వర్మ మాట్లాడుతూ.. దేశంలో భిన్న సంస్కృతులు, సంప్రదాయాలున్నా.. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేదే అన్ని పండుగల అభిప్రాయం అని పేర్కొన్నారు. సామాజిక సమైక్యతకు పండుగలు దోహదం చేస్తాయని, అలయ్ బలయ్ ఇందులో భాగమేనని చెప్పారు. 

దేశంలో కులం, మతం, వర్గం ప్రాంతం పేరుతో చీల్చే ప్రయత్నం జరుగుతున్నదని  మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. వేషం, భాష వేరైనా మనమంతా ఒక్కటేనని, దేశాన్ని కులం, మతం పేరుతో చీల్చాలనుకునే వారి కుట్రలు సాగవని స్పష్టం చేశారు. అలయ్ బలయ్ అంటే అందరూ కలసి మెలిసి ఉండాలని సూచించే కార్యక్రమమని చెప్పారు. 

దత్తాత్రేయ తెలుగు రాష్ట్రాలే కాదు, దేశ రాజకీయాల్లోనే అజాత శత్రువని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి అన్నారు. ఆయన సమాజ ఐక్యత కోసం చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో రాజకీయ పార్టీలకతీతంగా అందరం ఐక్యంగా పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ చెప్పారు.   

ఆపరేషన్ సింధు కీలక ఘట్టం:  అజయ్‌‌ మిశ్రా

ఇండియన్ మిలిటరీ హిస్టరీలోనే ఆపరేషన్ సిందూర్‌‌‌‌ కీలకమైన ఘట్టమని ఆర్మీ జనరల్ అజయ్ మిశ్రా అన్నారు. ఆపరేషన్ సిందూర్‌‌‌‌ను ప్లానింగ్‌‌తోపాటు కచ్చితత్వంతో అమలు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రజల రక్షణే లక్ష్యంగా దీన్ని చేపట్టినట్టు వివరించారు. దత్తాత్రేయను చూస్తే రాజకీయాలు మర్చిపోతామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌‌‌‌గౌడ్ తెలిపారు. 

 అన్ని పార్టీలకు దత్తాత్రేయ ఆత్మీయుడని కొనియాడారు. దత్తాత్రేయ అంటే బీజేపీ నాయకుడిగానో, గవర్నర్‌‌‌‌గానో మనకు గుర్తుకు రారని, దత్తన్న అంటే పదిమందిని కలుపుకొని పోయే తెలంగాణ వ్యక్తిత్వం కలిగిన వారిగానే గుర్తుకు వస్తారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సుప్రీంకోర్టు రిటైర్డ్ సీజే ఎన్వీ రమణ, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్‌‌‌‌రావు, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి,  ఎంపీ కొండా విశ్వేశ్వర్‌‌‌‌రెడ్డి, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ నాయకుడు కే నారాయణ, ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, సినీనటులు నాగార్జున, బ్రహ్మానందం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు,  తదితరులు పాల్గొన్నారు. 

అలయ్ బలయ్ తెలంగాణ ఆత్మ: దత్తాత్రేయ 

అలయ్ బలయ్ ఒక సాంప్రదాయ సమావేశం మాత్రమే కాదని,  తెలంగాణ ఆత్మ, జీవన విలువల ప్రతీక అని  బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు.  స్వదేశీ భావన మన భవిష్యత్తుకు​మార్గమని చెప్పారు.  గాంధీ మనకు స్వదేశీ తత్వాన్ని అందించారని గుర్తుచేశారు.  ప్రతి ఒక్కరూ స్థానిక ఉత్పత్తులను వాడి ఆత్మ నిర్భర్‌‌‌‌ భారత్ లక్ష్యసాధనకు తోడ్పడాలని సూచించారు. 

సేంద్రియ వ్యవసాయం భవిష్యత్ తరాలకు ఆరోగ్యమని, ప్రస్తుతం రసాయనాలతో మట్టి , నీళ్లు కలుషితం అవుతున్నాయని పేర్కొన్నారు. సాహిత్యమంటే సమాజానికి అద్దమని చెప్పారు. యువత  సమాజ మార్పు కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాజకీయాలకతీతంగా 20 ఏండ్లుగా అలయ్ బలయ్ కార్యక్రమం కొనసాగుతున్నదని కార్యక్రమ చైర్మన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. ఈ ఏడాది ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే సందేశంతో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించామని, ఈ సందర్భంగా సైనిక కుటుంబాలను సన్మానించుకుం టున్నామని చెప్పారు. పదేపదే ఉగ్రవాదులు ఇండియా జోలికి వస్తే ఇక అమ్మోరు జాతరేనని హెచ్చరించారు. అలయ్ బలయ్‌‌లో తెలంగాణ వంటకాల రుచులను చూపిస్తున్నట్టు వివరించారు. 

హిందూధర్మాన్ని రక్షించుకోవాలి: కిషన్ రెడ్డి 

హిందూధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హిందూధర్మం ఉన్నన్ని రోజులే దసరా పండుగలు, అలయ్ బలయ్​ ఉంటాయని చెప్పారు.  ప్రజల మధ్య విభేదాలు తెచ్చేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.  

దేశం విషయంలో అందరం అలయ్ బలయ్‌‌గా ఉండాలని పిలుపునిచ్చారు. పరిపాలన సౌలభ్యం కోసమే రాష్ట్రాల విభజన అని, తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రాంతాలకతీతంగా కలిసికట్టుగా ఉండాలన్నారు. మనకు దసరాతోపాటు జీఎస్టీ పండగ వచ్చిందని, 350 వస్తువులపై ధర తగ్గించి ప్రధాని మోదీ రికార్డు సృష్టించారని చెప్పారు.

‘అలయ్ బలయ్’ ప్రజల ఐక్యతకు నిదర్శనం: రాష్ట్రపతి 

న్యూఢిల్లీ, వెలుగు: ‘అలయ్ బలయ్’కార్యక్రమం తెలంగాణ ఆచారాలకు పునరుజ్జీవం పోస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. తెలంగాణ వారసత్వాన్ని నిలిపే సాంస్కృతిక ఉత్సవమని కితాబిచ్చారు. అలయ్ బలయ్ ప్రోగ్రాం తెలంగాణ రుచికరమైన వంటకాలకు ప్రసిద్ధి అని, బతుకమ్మ నృత్యాలు, జానపద కళలకు ప్రతీకగా నిలుస్తోందని చెప్పారు. 

 హైదరాబాద్‌‌‌‌లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమానికి అనివార్య కారణాల వల్ల రాలేకపోతున్నానని తెలిపారు. అందువల్ల తన సందేశాన్ని లేఖ రూపంలో పంపినట్లు వెల్లడించారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించిన అలయ్ బలయ్ ప్రోగ్రాం తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని ఆమె కొనియాడారు. తెలంగాణ ఆచారాలను పునరుజ్జీవింపజేయడానికి దత్తాత్రేయ కృషి చేస్తున్నారని ప్రశంసించారు.