కొత్తపల్లి, వెలుగు: రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలకు కొత్తపల్లి పట్టణంలోని అల్ఫోర్స్ ఈ టెక్నో స్కూల్ విద్యార్థులు ఎంపికైనట్లు స్కూల్ చైర్మన్ వి.నరేందర్రెడ్డి తెలిపారు. ఆర్చరీ క్రీడకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, ఈ క్రీడతో విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని చెప్పారు.
ఆర్చరీ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో డి.సుదీక్ష, కె.లిశిత, అక్షయ, జి.శ్రీహరినాథ్, డి.శ్రీనిత్య అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. తమ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనూ ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని ఆకాంక్షించారు.
నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి
కరీంనగర్ టౌన్, వెలుగు: విద్యార్థులు చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని సిద్దార్థ స్కూల్స్ చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి సూచించారు. కౌమారదశలో జరిగే పరిమాణాలు, నాయకత్వ లక్షణాల పెంపుపై శిక్షణ పొందిన విద్యార్థులకు మంకమ్మతోటలోని స్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. కౌమర దశలో విద్యార్థులు మనసును కేంద్రీకృతం చేసుకుని, మంచి చెడులు తెలుసుకుని ముందుకెళ్లాలని సూచించారు. లయన్ బుర్ర మధుసూధన్ రెడ్డి, డిస్ట్రిక్ట్ గవర్నర్ సింహరాజు కోదండరాం, శివ ప్రసాద్, రాజిరెడ్డి, వాసుదేవ రెడ్డి పాల్గొన్నారు.
రైస్ మిల్లర్ భార్య ఆత్మహత్య
శంకరపట్నం, వెలుగు: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామానికి చెందిన రైస్ మిల్లర్ భార్య ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగట్టు గ్రామానికి చెందిన తణుకు సురేశ్ మొలంగూర్ గ్రామ శివారులో రెండు రైస్ మిల్లులు నడుపుతున్నాడు. బ్యాంకులో తీసుకున్న అప్పుల కిస్తీలు చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు రైస్ మిల్లులను సీజ్ చేశారు.
సీఎంఆర్ అప్పగించకపోవడంతో బకాయిలు పేరుకుపోయి ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో మనస్తాపానికి గురై శుక్రవారం సురేశ్ భార్య సప్న(42) ఇంట్లో ఉరేసుకుంది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు.
