హైదరాబాద్, వెలుగు: ‘ఆరోగ్యశ్రీ’ పథకం నిధుల్లో అధికంగా కిడ్నీ (నెఫ్రాలజీ), క్యాన్సర్ (ఆంకాలజీ), ఎముకల వ్యాధులు (ఆర్థోపెడిక్), గుండె (కార్డియాలజీ) జబ్బులకే ఖర్చవుతున్నాయి. 80 శాతానికిపైగా రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తుండగా ఏటా సుమారు రూ.1,200 కోట్ల బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ భారీ వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వ దవాఖానల్లో ఈ వ్యాధులకు సంబంధించిన డిపార్ట్మెంట్లను డెవలప్ చేసేందుకు వైద్యారోగ్యశాఖ కసరత్తు చేస్తోంది.
‘టిమ్స్’ ను డెవలప్చేయనున్న సర్కార్..
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే సూపర్ స్పెషాలిటీ సేవలను కార్పొరేట్ స్థాయిలో అందించాలని సర్కారు నిర్ణయించింది. స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను బలోపేతం చేసేందుకు టిమ్స్ హాస్పిటల్స్ ను ప్రత్యేక విభాగాలకు హబ్‌లుగా మారుస్తోంది. సనత్‌నగర్ టిమ్స్‌ను కార్డియాక్ కేర్ (గుండె సంబంధిత) హబ్‌గా, అల్వాల్ టిమ్స్‌ను న్యూరో సైన్సెస్ హబ్ గా, కొత్తపేట టిమ్స్‌ను గ్యాస్ట్రో సైన్సెస్ హబ్ గా అభివృద్ధి చేస్తోంది.
కేవలం భవనాలు నిర్మించడమే కాకుండా, నిపుణులైన డాక్టర్ల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం ‘యూ కోట్ - వీ పే’ పద్ధతిలో స్పెషలిస్టులను నియమించుకోవాలని భావిస్తోంది. ఆపరేషన్ థియేటర్ల ఆధునీకరణ, మెరుగైన వసతుల కల్పనపై సర్కార్ దృష్టి సారించింది. ప్రభుత్వ హాస్పిటల్స్ లో వసతులున్నా కొన్నిచోట్ల డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు మెరుగైన వైద్యం అందడం లేదు. పారిశుధ్యం, భద్రతా లోపాలు ఇబ్బందిగా మారుతున్నాయి. వీటన్నిటీని సరిచేసి కార్పొరేట్ కు దీటుగా వైద్యం అందిస్తేనే ఆరోగ్యశ్రీ నిధులు సద్వినియోగం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
80 శాతం వాటా ఆ నాలుగు డిపార్ట్మెంట్లదే..
గడిచిన ఐదేళ్లలో (2020---2025) ఆరోగ్యశ్రీ లెక్కల ప్రకారం.. కిడ్నీ, క్యాన్సర్, ఆర్థోపెడిక్, కార్డియాలజీకి సంబంధించి రోగులు మొత్తం 12.59 లక్షల మంది చికిత్స పొందగా, అందులో 10 లక్షల మందికి పైగా ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్స పొందారు. సాధారణ జ్వరాలు, చిన్న చిన్న సర్జరీల కోసం ప్రభుత్వ హాస్పిటల్స్ ను ఆశ్రయిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స కోసం ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.
చికిత్స పొందిన వారి వివరాలు
- విభాగం 5 ఏండ్లలో పేషెంట్లు
- నెఫ్రాలజీ (కిడ్నీ) 3.63 లక్షలు
- ఆంకాలజీ (క్యాన్సర్) 3.06 లక్షలు
- ఆర్థోపెడిక్ (ఎముకలు) 1.91 లక్షలు
- కార్డియాలజీ (గుండె) 1.45 లక్షలు
