త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు..ఇయ్యాల్నే పోలింగ్​

త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు..ఇయ్యాల్నే పోలింగ్​

అగర్తల: త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) గిట్టే కిరణ్​కుమార్ దినకర్​రావు తెలిపారు. 60 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో గురువారం ఎన్నికలు నిర్వహిస్తున్నామని ప్రకటించారు. టైట్ సెక్యూరిటీ మధ్య ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ ఉంటుందని వివరించారు. మొత్తం 3,337 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 1,100 సెన్సిటివ్, 28 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించామని తెలిపారు. 31వేల మంది ఉద్యోగులు ఎన్నికల డ్యూటీలో ఉంటారన్నారు. కేంద్రం నుంచి 25వేల మంది, రాష్ట్రం నుంచి 31వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని వివరించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల దాకా ఆంక్షలు అమల్లో ఉంటాయని స్టేట్ పోలీస్ చీఫ్​ ప్రకటించారు.

28.13 లక్షల ఓటర్లు

రాష్ట్రంలో మొత్తం 28.13 లక్షల ఓటర్లు ఉండగా.. వారిలో 13.53 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 60 అసెంబ్లీ స్థానాలకు 259 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీజేపీ, ఐపీఎఫ్​టీ కలిసి పోటీ చేస్తుండగా, సీపీఎం, కాంగ్రెస్​ కూటమిగా ఏర్పడి బరిలో దిగాయి. ఈశాన్య రాష్ట్రాల రాజకుటుంబం తిప్ర మోత పేరుతో  ప్రాంతీయ పార్టీని ఏర్పాటుచేసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నది. బీజేపీ తరఫున సీఎం మాణిక్ సాహా బర్డోవాలీ సెగ్మెంట్​ నుంచి,  ప్రతిమ భౌమిక్​ దానాపూర్ నుంచి బరిలో ఉన్నారు. సీపీఎం నేత జితేంద్ర చౌదరీ లెఫ్ట్, కాంగ్రెస్ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా సబ్రూమ్​ నుంచి పోటీ చేస్తున్నారు. తిప్రా మోత సుప్రీం ప్రద్యోత్​ దెబ్బర్మ మాత్రం ఎన్నికలకు దూరంగా ఉన్నారు.


55 స్థానాల్లో బీజేపీ పోటీ

బీజేపీ 55 స్థానాల్లో, ఐపీఎఫ్​టీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తున్నది. ఇందులో ఒకచోట ఫ్రెండ్లీ ఫైట్​ ఉంటుందని చెప్పారు. సీపీఎం 47 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 13 సెగ్మెంట్స్​ నుంచి బరిలో దిగింది. ఇక తిప్రమోత పార్టీ 42 స్థానాల్లో బరిలో దిగింది. టీఎంసీ 28 స్థానాల్లో, 58 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీజేపీ తరఫున 12 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్​ నడ్డా తదితరులు పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. సీపీఎం తరఫున  సీతారాం ఏచూరి, సీనియర్ నేతలు కారత్ ప్రచారం చేశారు.