తమిళనాట సంచలన విజయం సాధించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విజయ్ కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం ( మే 7 ) ఉదయం 11 గంటలకు విజయ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.చెన్నైలోని నెహ్రూ ఇన్ డోర్ స్టేడియంలో తమిళనాడు 14వ సీఎంగా ప్రమాణం చేయనున్నారు విజయ్. ఈ క్రమంలో రాహుల్ గాంధీ విజయ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారంటూ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.. ఈ కార్యక్రమంలో విజయ్ తో పాటు 21 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.
ప్రమాణ స్వీకారానికి రాహుల్, మల్లికార్జున ఖర్గే:
విజయ్ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరవుతారని టాక్ వినిపిస్తోంది. ఈమేరకు రాహుల్ గాంధీకి విజయ్ నుండి ప్రత్యేక ఆహ్వానం కూడా అందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి.
ఇదిలా ఉండగా...టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నామంటూ రాహుల్ గాంధీ ఇచ్చిన లేఖతో.. తమిళనాడు కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు టీవీకే పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. కాంగ్రెస్ నేతలను స్వయంగా ఆహ్వానించారు విజయ్. ఈ సందర్భంగా టీవీకే పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ తన లేఖను స్వయంగా విజయ్ కు అందజేశారు. ఆ లేఖను స్వయంగా అందుకున్న విజయ్.. కాంగ్రెస్ పార్టీకి థ్యాంక్స్ చెప్పారు.
ALSO READ : కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఖాయం
ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే పార్టీకి 118 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. టీవీకే పార్టీకి సొంతంగా 108 సీట్లు ఉన్నాయి. మిగతా 10 సీట్లను ఇతర పార్టీల నుంచి మద్దతు తీసుకుంటున్నారు విజయ్. అందులో భాగంగా ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. మద్దతు విషయంపై రాహుల్ గాంధీ, విజయ్ ఫోన్ లో స్వయంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత తమిళనాడు కాంగ్రెస్ శాఖ సైతం విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వాలనే డిమాండ్ వినిపించింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
