- 25వ తేదీ వరకు.. వారం రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా మెగా సర్వే
- 3,053 అటవీ ప్రాంతాలు, రిజర్వ్ ఫారెస్టుల్లో జంతు గణన
- రంగంలోకి అటవీ సిబ్బంది, 1,559 మంది వలంటీర్లు, ఎన్జీవో సభ్యులు
- పులి అడుగులు, చెట్లకు గోకుడు గుర్తులు, మలం ఆధారంగా ఆచూకీ
- సేకరించిన డేటాతో కెమెరా ట్రాప్స్.. ఆపైనే కచ్చితమైన సంఖ్య గుర్తింపు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పులుల లెక్కను పక్కాగా తేల్చేందుకు అటవీశాఖ సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ప్రతీ నాలుగేండ్లకోసారి పులుల గణన జరుగుతున్నది. ఇందులో భాగంగా ‘ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ (ఏఐటీఈ)–2026’ పేరిట సోమవారం నుంచి రాష్ట్రంలో పులులు, వాటి ఆహారమైన శాఖాహార జంతువులను లెక్కించనున్నారు.
ఈ నెల 25వ తేదీ వరకు (వారం రోజులు) చేపట్టనున్న ఈ సర్వేలో అటవీ సిబ్బందితోపాటు 1,559 మంది వలంటీర్లు, ఎన్జీవో సభ్యులు పాలుపంచుకోనున్నారు. పులి అడుగులు, గోకుడు గుర్తులు, మలం ఆధారంగా వాటి ఆచూకీని కనిపెడతారు. ఇందుకు టెక్నాలజీనీ వాడుకోనున్నారు. ఇన్నాళ్లు రాష్ట్రంలోని పులుల సంఖ్యపై కచ్చితమైన సమాచారం లేక వాటి సంరక్షణ చర్యల్లో ఇబ్బందులు ఎదురయ్యేవి. తాజా పులుల గణనతో ఆ సమస్య తీరనుంది.
3,053 బీట్లలో లెక్కింపు..
రాష్ట్రంలోని రెండు ప్రధాన టైగర్ రిజర్వులైన అమ్రాబాద్, కవ్వాల్‌తోపాటు అన్ని వన్యప్రాణి అభయారణ్యాలు, రిజర్వ్ ఫారెస్టుల్లో ఈ సర్వే నిర్వహించనున్నారు. రాష్ట్రంలో సుమారు 26 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల 3,053 ఫారెస్ట్ బీట్లలో సిబ్బంది, వలంటీర్లు కాలినడకన తిరుగుతూ ఫీల్డ్ డేటా సేకరించనున్నారు. ప్రధానంగా పులుల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, వాటికి ఆహారంగా ఉండే ఇతర జంతువులు నివసించే ప్రదేశాలపై ఫోకస్ పెడతారు.
ఈసారి పులుల గణనలో ప్రజలు కూడా భాగస్వాములు కానున్నారు. ఈ మెగా సర్వేలో పాల్గొనేందుకు 1,129 మంది వలంటీర్లు ముందుకొచ్చారు. వీరితోపాటు డబ్ల్యూడబ్ల్యూఎఫ్, హైసింత్, యానిమల్ వారియర్స్, డెక్కన్ బర్డర్స్, ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ వంటి ప్రముఖ ఎన్జీవోల నుంచి మరో 430 మంది శిక్షణ పొందిన సభ్యులు అటవీశాఖకు సహకరిస్తున్నారు. వీరిని జిల్లాలవారీగా ఆయా అటవీ డివిజన్ల అవసరాలకు అనుగుణంగా కేటాయించారు.
అటవీ సిబ్బంది పర్యవేక్షణలో వీరంతా డేటా సేకరణలో పాల్గొంటారు. వలంటీర్లు ఉదయం సమయంలో అడవికి వెళ్లి జంతువుల సంఖ్యను లెక్కించనున్నారు. ప్రతిరోజూ అటవీ సిబ్బందితో కలిసి 10 నుంచి 15 కిలోమీటర్ల మేర అటవీలో ట్రాన్సెక్ట్ అండ్ ట్రయల్ వాక్ చేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో పులులు, చిరుత పులులతో పాటు వాటి ఆహారమైన జింకలు, కనుజులు, సాంబర్ల వంటి శాకాహార జంతువుల జాడలను నమోదు చేయాలి. మాంసాహార, శాఖాహార జంతువుల వివరాలను వేర్వేరుగా నమోదు చేయనున్నారు.
అత్యాధునిక టెక్నాలజీ వాడకం
పులుల లెక్కింపు కోసం అటవీశాఖ ఆధునిక టెక్నాలజీని వాడుతున్నది. అటవీ విస్తీర్ణం, భూభాగం, నీటి వనరులు, మానవ ఆక్రమణల అధ్యయనానికి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఉపగ్రహ -సహాయక మ్యాపింగ్ తో పులుల కదలికలు ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించి కెమెరాల ప్లేస్‌మెంట్‌కు మార్కింగ్ చేస్తారు.
భూమిపై తీసే డేటా, ఉపగ్రహ డేటాతో కలిపి విశ్లేషించి 40 వేలకు పైగా కెమెరా ట్రాప్‌లను వినియోగించనున్నారు. ఇక ప్రత్యేకంగా రూపొందించిన ‘మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ -ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకోలాజికల్ స్టేటస్’(ఎం-ఎస్‌టీఆర్‌ఎల్‌పీఈఎస్) అనే మొబైల్ యాప్‌ను వినియోగించనున్నారు. గతంలో మాదిరిగా కాగితాలపై కాకుండా వలంటీర్లు, సిబ్బంది తమ పరిశీలనను నేరుగా ఈ యాప్‌లో నమోదు చేయనున్నారు.
పులుల పాదముద్రలు, రెట్టలు, గోర్ల గుర్తులు, ప్రత్యక్షంగా కనిపించిన జంతువుల వివరాలను జియో- ట్యాగింగ్‌తో సహా యాప్‌లో పొందుపరుస్తారు. దీనిద్వారా మానవ తప్పిదాలకు ఆస్కారం ఉండదని, కచ్చితమైన సమాచారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ యాప్ వినియోగంపై ఇప్పటికే ఫారెస్ట్ ఆఫీసర్లు డెహ్రడూన్‌లోని వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) ఆధ్వర్యంలో శిక్షణ పొందారు. అనంతరం వారు రాష్ట్రంలో ఎంపిక చేసిన వలంటీర్లకు శిక్షణ ఇచ్చారు.
అడవీలో ట్రాన్సెక్ట్ లైన్లు ఏర్పాటు
అడవిలో పులిని నేరుగా లెక్కించడం సాధ్యం కాదు కాబట్టి పరోక్ష పద్ధతుల్లో వాటి ఉనికిని గుర్తించనున్నారు. ఇందుకోసం అటవీ సిబ్బంది, వలంటీర్లు అడవిలో ప్రత్యేకంగా ట్రాన్సెక్ట్ లైన్లు (నిర్దేశిత దారులు) ఏర్పాటు చేసుకుంటారు. పులి పాదముద్రలు (పగ్ మార్క్స్), అవి విసర్జించిన మలం (స్కాట్), చెట్లపై చేసిన గోకుడు గుర్తులు (స్క్రాచ్ మార్క్స్) నమోదు చేస్తారు. పులులకు ఆహారమైన జింకలు, అడవి పందులు వంటి శాకాహార జంతువుల సాంద్రతను అంచనా వేస్తారు.
అడవిలో మనుషుల సంచారం, పశువుల మేత వంటి అంశాలను కూడా మొబైల్ యాప్‌ల ద్వారా రికార్డు చేస్తారు. ప్రస్తుతం వారంపాటు క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారం ప్రాథమిక దశ మాత్రమే. ఈ డేటా ఆధారంగా పులులు ఎక్కువగా సంచరించే మార్గాలను గుర్తిస్తారు. ఆయా ప్రాంతాల్లో అత్యాధునిక కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేస్తారు. వాటిలో రికార్డయిన ఫొటోలను వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు పంపి, శాస్త్రీయ విశ్లేషణ తర్వాతే పులుల సంఖ్యతోపాటు ఇతర వన్యప్రాణుల స్థితిగతులపై సమగ్ర నివేదికను సిద్ధం చేయనున్నారు.
