- సర్కారుకు అఖిలపక్షం, బీసీ సంఘాల హెచ్చరిక
- బడ్జెట్‌లో నిధులు కేటాయించకుంటే అసెంబ్లీ ముట్టడిస్తామని వెల్లడి
ముషీరాబాద్, వెలుగు: విద్యార్థుల పెండింగ్ఫీజురీయింబర్స్మెంట్ చెల్లించకపోతే రేవంత్‌రెడ్డిని గద్దె దింపుతామని అఖిలపక్ష నేతలు, బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. ఆదివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీసీ సంక్షేమ సంఘం, బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ‘ఫీజు పోరు దీక్ష’ పేరుతో మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ విద్యార్థుల శక్తిని రేవంత్ రెడ్డి తక్కువ అంచనా వేస్తున్నారని, విద్యార్థులు తలుచుకుంటే ఏ ప్రభుత్వమైనా కూలిపోవాల్సిందేనని హెచ్చరించారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఫీజులు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యాలను రేవంత్‌రెడ్డి బెదిరించడం చూస్తుంటే ఎంత దివాలా కోరు ప్రభుత్వమో అర్థమవుతుందన్నారు.
చదువులు కొనసాగించలేక కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విద్యాభరోసా కార్డు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రెండున్నర ఏండ్లు గడిచినా పెండింగ్ఫీజులు చెల్లించలేదన్నారు. ‘ఐదు వేల కోట్లు పెట్టి గాంధీ విగ్రహం పెడతరు గానీ.. విద్యార్థుల ఫీజులు చెల్లించారా.. అని ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్లకు 70 వేల కోట్లు బిల్లులు చెల్లించిన సర్కారు.. బకాయి ఫీజులను ఇవ్వడం లేదన్నారు. ఫీజులు ఇవ్వకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని హెచ్చరించారు.
బీఆర్ఎస్సంపూర్ణ మద్దతు..
బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ గౌడ్, మధుసూదనాచారి మాట్లాడుతూ.. ‘ఫీజు పోరు దీక్ష’కు బీఆర్ఎస్సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. కాంగ్రెస్ చెప్పిన 'కామారెడ్డి డిక్లరేషన్' ఒక దొంగ నాటకమని తేలిపోయిందన్నారు. బడ్జెట్‌లో ఫీజుల కోసం 10 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్‌చేశారు. ఎమ్మెల్సీ లు సిరికొండ మధుసూదనాచారి, ఎల్.రమణ, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి మాట్లాడుతూ పేద విద్యార్థుల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని, ఇది రేవంత్‌కు ఎంత మాత్రం మంచిది కాదని సూచించారు. గొడుగు మహేశ్‌యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ నేత జి.నరసింహ, టీజేఎస్ ఉపాధ్యక్షుడు నిజ్జన రమేశ్, సినీ దర్శకులు ఎన్.శంకర్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ పాల్గొన్నారు.
