ఇవాళ(సెప్టెంబర్ 1) గవర్నర్ దగ్గరకు అఖిలపక్షం

ఇవాళ(సెప్టెంబర్ 1)  గవర్నర్  దగ్గరకు  అఖిలపక్షం
  • పంచాయతీరాజ్​ చట్ట సవరణ బిల్లును ఆమోదించాలని వినతి
  • అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లు, ప్రెసిడెంట్లకు పొన్నం లేఖ
  • అసెంబ్లీలో కలిసి విజ్ఞప్తి చేసిన మంత్రి

హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ చట్టం– 2018 సవరణ బిల్లును ఆమోదించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరేందుకు ఆల్ పార్టీ లీడర్లతో  కలిసి వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం, సీపీఐ ఫ్లోర్ లీడర్లను మంత్రి పొన్నం ప్రభాకర్  కలిసి, సోమవారం రాజ్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌కు రావాలని విజ్ఞప్తి చేశారు. ఆయా పార్టీల్లోని ముఖ్యమైన నేతలకు ఆదివారమే లేఖలు రాశారు. అంతకుముందు  అసెంబ్లీ లాబీలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా చిట్‌‌‌‌‌‌‌‌చాట్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడారు.  బీసీ రిజర్వేషన్​ బిల్లును ఆమోదించాలని గతంలో ప్రధాని, రాష్ట్రపతి అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్ కోరితే.. ఇవ్వలేదని, తాజాగా అసెంబ్లీలో పాసైన పంచాయతీరాజ్​చట్టం సవరణ బిల్లును ఆమోదించాలని మరోసారి గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలుస్తామని చెప్పారు. ‘‘రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల నిర్వహణకు సెప్టెంబర్  30 వరకు హైకోర్టు గడువు విధించింది. 

కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చాం. స్థానికంగా జరిగే ఎన్నికలపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని  చెప్తాం. మా విధానం మేం వివరిస్తాం. నిర్ణయం గవర్నర్ ఇష్టం. అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నప్పుడు ఆమోదం తెలపడానికి ఆయనకు ఇబ్బంది ఏముంది? న్యాయపరంగా అన్ని విషయాలు తెలుసుకొని ఈ నిర్ణయానికి వచ్చాం. సభలో  ఏకాభిప్రాయం ఉన్న విషయాన్ని  గవర్నర్ పరిగణనలోకి తీసుకోవాలి.  ప్రజాస్వామ్యంలో చట్టసభలే ఫైనల్ కదా’’ అని వ్యాఖ్యానించారు. గవర్నర్ బిల్లులు ఆమోదించే అంశంపై గవర్నర్ వర్సెస్ తమిళనాడు కేసు సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణలో ఉందని, ఆ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యే అంశాన్ని కూడా పరిశీలిస్తామని మంత్రి పొన్నం చెప్పారు. రిజర్వేషన్ పరిమితిపై  అన్ని పార్టీల సభ్యులు ఏకాభిప్రాయంతో ఉంటే ముందుకు వెళ్లవచ్చని 2012లో  సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లో ఉందని వెల్లడించారు.