ప్రాజెక్టులన్నీ ఆంధ్రా కాంట్రాక్టర్లకే

ప్రాజెక్టులన్నీ ఆంధ్రా కాంట్రాక్టర్లకే
  • ఉద్యమంలో తిట్టినోళ్లకే వేల కోట్ల రూపాయల పనులు
  • ఉమ్మడి రాష్ట్రంలో దోచుకున్నోళ్లకే ప్రత్యేక రాష్ట్రంలో ప్రాధాన్యం
  • సీఎం సన్నిహితులకు కాంట్రాక్టుల్లో ప్రయారిటీ
  • సొంత రాష్ట్రం వచ్చినా తెలంగాణ వాళ్లకు సబ్‌‌ కాంట్రాక్టులే

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ కాంట్రాక్టర్లకు దక్కాల్సిన పనులన్నీ దోచుకుంటున్నారంటూ.. ఉద్యమ టైమ్​లో తిట్టిన ఆంధ్రా కాంట్రాక్టర్లకే ప్రత్యేక రాష్ట్రంలో కూడా కీలక ప్రాజెక్టులన్నీ కట్టబెట్టారు. గతంలో కేసీఆర్‌‌ ఏయే కాంట్రాక్టు సంస్థలపై దుమ్మెత్తి పోశారో.. ఇప్పుడు అవే ఆయనకు సన్నిహిత సంస్థలయ్యాయి. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు, ఎస్సారెస్పీ పునరుజ్జీవం, భక్తరామదాసు, తుమ్మిళ్ల సహా అనేక ప్రాజెక్టులు ఆంధ్రా సంస్థలైన మేఘా, నవయుగ ఇంజనీరింగ్​లకు కట్టబెట్టారు. కాళేశ్వరం అడిషనల్‌‌ టీఎంసీ పనులను నామినేటెడ్‌‌ పద్ధతిలో మేఘాకు అప్పగించారు. స్వరాష్ట్రంలో ఇక్కడి కాంట్రాక్టర్లు ఆంధ్రా కాంట్రాక్టర్లు ఇచ్చే సబ్‌‌ కాంట్రాక్టులు చేసుకోవాల్సి వస్తోంది. అవీ సీఎంకు సన్నిహితంగా ఉండే స్థానిక వర్క్‌‌ ఏజెన్సీలకే దక్కుతున్నాయి.

మేఘా తర్వాత నవయుగ ఇంజనీరింగ్‌‌ కంపెనీకి పెద్ద ఎత్తున పనులు కట్టబెట్టారు. పాలమూరు–రంగారెడ్డిలో నవయుగకు దక్కిన పనులను తర్వాత మేఘాకు బదలాయించారు. కేవలం ఏడాదిలోనే అంచనా వ్యయం రెట్టింపైన ఎస్సారెస్పీ పునరుజ్జీవం పనులను నవయుగే దక్కించుకుంది. ఇవి ఈపీసీ విధానంలోనే టెండర్లు పొందాయని అధికారులు చెప్తున్నా, వాటికి అనుకూలంగా రూల్స్​ రూపొందించారని తెలంగాణ కాంట్రాక్టర్లు చెప్తున్నారు. కీలక పనులన్నీ ఆంధ్రా కాంట్రాక్టు సంస్థలు చేస్తుండగా, అవి ఇచ్చే చిన్నపాటి పనులనే తెలంగాణ కాంట్రాక్టర్లు చేయాల్సి వస్తోంది. మరోవైపు సరిగా పేమెంట్లు ఇవ్వక మన కాంట్రాక్టర్లను ఆంధ్రా కంపెనీలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సీఎంకు సన్నిహితంగా ఉండే ప్రతిమ, కేఎన్‌‌ఆర్‌‌ లాంటి స్థానిక వర్క్‌‌ ఏజెన్సీలకు కాంట్రాక్టుల్లో ప్రాధాన్యత దక్కుతోంది.

‘మేఘా’కే రూ.90 వేల కోట్లు  
సమైక్యాంధ్ర పేరుతో సీమాంధ్ర ప్రాంతంలో చేసిన కృత్రిమ ఉద్యమానికి ఫండింగ్‌‌ చేశారంటూ కేసీఆర్‌‌ ఆరోపించిన మేఘా ఇంజనీరింగ్‌‌ సంస్థకు మన రాష్ట్రంలో టాప్‌‌ ప్రయారిటీ దక్కుతోంది. కీలక ప్రాజెక్టులన్నీ మేఘాకే దక్కాయి. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, దేవాదుల లిఫ్ట్‌‌ స్కీముల్లో కీలక పనులన్నీ మేఘానే వరించాయి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే మేఘా కంపెనీకి రూ.65 వేల కోట్ల పనులు అప్పగించగా, మిషన్‌‌ భగీరథ, మిగతా ప్రాజెక్టులన్నీ కలుపుకుంటే రూ.90 వేల కోట్ల పనులు ఈ సంస్థకు దక్కాయి. రోడ్లు, ఎలక్ట్రిక్‌‌ బస్సులు, ఇతరత్రా పనులన్నీ కలుపుకుంటే మేఘా షేర్‌‌ రూ.లక్ష కోట్లకు పైమాటే.