పోలింగ్ కు సర్వం సిద్ధం..కొత్తగూడెం కార్పొరేషన్ లోపాటు 7 మున్సిపాలిటీల్లో నేడు (ఫిబ్రవరి 11) పోలింగ్

పోలింగ్ కు సర్వం సిద్ధం..కొత్తగూడెం కార్పొరేషన్ లోపాటు 7 మున్సిపాలిటీల్లో నేడు (ఫిబ్రవరి 11) పోలింగ్
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న 3,28,668 మంది
  • సిబ్బందికి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసిన అధికారులు
  • ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్​​ ప్రారంభం

ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, వెలుగు:  మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్ధమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్​, అశ్వారావుపేట, ఇల్లెందు, వైరా, కల్లూరు, సత్తుపల్లి, మధిర, ఏదులాపురం మున్సిపాలిటీల్లో గురువారం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.

మంగళవారం ఆయా డిస్ట్రిబ్యూషన్​ సెంటర్ల నుంచి బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు సహా పోలింగ్ సామగ్రిని తీసుకుని బస్సుల్లో తరలివెళ్లారు. సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత పోలీస్​ బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులను తిరిగి అదే రిసెప్షన్​ కేంద్రాలకు ప్రత్యేక బస్సుల్లో తరలించనున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం కార్పొరేషన్​లోపాటు 7 మున్సిపాలిటీల్లో మొతం3,28,668 మంది తమ- ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బందోబస్తు కోసం 1100 మంది పోలీసులకు విధులు కేటాయించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 1200 మంది పోలీసులు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు.  

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో..

జిల్లాలో మున్సిపల్​ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో పాల్వంచలోని అనుబోస్​కాలేజీ, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ కేంద్రాలకు అధికారులు, సిబ్బంది తరలివెళ్లారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్​ఆఫీసర్​తోపాటు మొత్తం ఐదుగురు విధులు నిర్వహించనున్నారు.

కొత్తగూడెం మున్సిపల్​కార్పొరేషన్​లో 60 డివిజన్లకు 354 మంది, ఇల్లెందు మున్సిపాలిటీలో 24 వార్డులకు108 మంది, అశ్వారావుపేటలో 22 వార్డులకు 78 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్​లో 60 డివిజన్లకు 201 పోలింగ్​ కేంద్రాల్లో 1,34,775 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇల్లెందు మున్సిపాలిటీలో 24 వార్డులకు సంబంధించి 52 పోలింగ్​ కేంద్రాల్లో 33,723 మంది ఓటర్లు ఉన్నారు.

అశ్వారావుపేట మున్సిపాలిటీలో 22 వార్డులకు 35 పోలింగ్ కేంద్రాల్లో 16,850 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. జిల్లా వ్యాప్తంగా 288 పోలింగ్​కేంద్రాల్లో 345 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు, 864 మంది ఓపీవోలు విధులు నిర్వహించనున్నారు.  జిల్లాలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్​లో 94 సెన్సిటీవ్, ఇల్లెందులో 15 సెన్సిటీవ్, 19 క్రిటికల్, అశ్వారావుపేటలో 12 సెన్సిటీవ్ పోలింగ్ కేంద్రాలను పోలీసులు గుర్తించారు. 

ఖమం జిల్లాలో ఓటర్ల వివరాలివే..!

ఖమ్మం జిల్లాలోని మధిర, వైరా, సత్తుపల్లి, కల్లూరు, ఏదులాపురం మున్సిపాలిటీల్లో 117 వార్డులున్నాయి. వీటిలో ఏదులాపురంలో ఒక వార్డులో ఒకే అభ్యర్థి ఉండడంతో ఎన్నిక ఏకగ్రీవం కాగా, మిగిలిన 116 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. వీటిలో 415 మంది పోటీపడుతున్నారు. ఏదులాపురంలో 32, వైరా, కల్లూరులో 20, సత్తుపల్లిలో 23, మధిరలో 22 వార్డులున్నాయి.

ఈ ఐదు మున్సిపాలిటీల్లో కలిపి 1,43,320 మంది ఓటర్లున్నారు. వీటిలో 74906 మంది మహిళలు, 68390 మంది పురుషులు, 24 మంది ఇతరులున్నారు. వీటిలో అత్యధికంగా ఏదులాపురంలో 45256, సత్తుపల్లిలో 28830, మధిరలో 25679, వైరాలో 24689, కల్లూరులో 18866 మంది ఓటర్లున్నారు.