పెండింగ్‌లో బిల్లులు.. అప్పుల్లో సర్పంచులు

పెండింగ్‌లో బిల్లులు.. అప్పుల్లో సర్పంచులు
  • పల్లెప్రగతి పనుల పైసలియ్యని సర్కారు
  • అప్పులు తెచ్చి, ఆస్తులు కుదువపెట్టి పనులు చేశామని సర్పంచ్​ల ఆవేదన
  • మిత్తీలు కట్టలేక కూలి పనులకు పోతున్నం
  • ఉరికించి మరీ పనులు చేయించుకొని ఇప్పుడు డబ్బులు ఇయ్యరా
  • బిల్లులు ఇప్పించాలంటూ ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేల నిలదీత
  • సర్కారు స్పందించకపోతే రోడ్డెక్కుతామని హెచ్చరిక

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్పంచ్‌లు అప్పుల్లో కూరుకుపోయారు. సర్కారు ఒత్తిడి చేయడంతో మిత్తికి తెచ్చి మరీ పల్లె ప్రగతి పనులు చేసి ఆగమైపోయారు. చేసిన పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో వడ్డీ కట్టలేక సతమతమవుతున్నారు. పైసల్లేక కూలి పనికి పోతున్నామని కొందరు చెప్తుంటే.. జీవితంలో మళ్లోసారి సర్పంచ్‌ కామంటూ మరికొందరు అంటున్నారు. అప్పులోళ్ల బాధ భరించలేక కొందరు ఆత్మహత్య చేసుకున్నరు. టార్గెట్లు పెట్టి, సస్పెషన్లతో భయపెట్టి ఉరికించి పనులు చేయించుకున్న సర్కారు.. ఇప్పుడు బిల్లులియ్యనీకి ఎందుకింత లేట్‌ చేస్తోందని సర్పంచ్‌లు నిలదీస్తున్నరు. వెంటనే పైసలు రిలీజ్‌ చేయకపోతే రోడ్డెక్కుతమని, ఆందోళనలు చేస్తమని హెచ్చరిస్తున్నరు.

టార్గెట్లు పెట్టి మరీ పని చేయించిన్రు
పల్లెప్రగతిలో భాగంగా ప్రభుత్వం ఊరూరా శ్మశాన వాటిక, డంపింగ్‌ యార్డు, విలేజ్​పార్కు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో శ్మశాన వాటికకు రూ.12 లక్షలు, డంపింగ్ యార్డుకు రూ. 2.5 లక్షలు, పల్లె ప్రకృతి వనానికి రూ. 5.7 లక్షల చొప్పున మంజూరు చేస్తామంది. ఇవిగాక రాష్ట్రవ్యాప్తంగా ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ చొప్పున 2,604 క్లస్టర్ల పరిధిలో రైతు వేదికలను నిర్మించాలని నిర్ణయించింది. ప్రతి క్లస్టర్‌కు రూ. 22 లక్షలు మంజూరు చేస్తామని చెప్పింది.  పంచాయతీరాజ్, డీఆర్డీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పనులను ఇచ్చిన టైమ్‌లోగా పూర్తి చేయాలని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఫీల్డ్‌ లెవల్‌లో గవర్నమెంట్ భూములు లేకపోవడం, అసైన్డ్ భూములు కేటాయించిన దగ్గర జనం అడ్డుకోవడం లాంటి సమస్యలున్నా పట్టించుకోలేదు. గడువులోగా పనులు పూర్తవకుంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఆఫీసర్లు బెదిరించారు. అంతటితో ఆగకుండా కొందరు సర్పంచ్‌‌‌‌లు, కార్యదర్శులకు నోటీసులిచ్చి సస్పెండ్ చేశారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక సర్పంచ్‌‌‌‌లు బయట మిత్తికి తెచ్చి పనులు చేశారు. తీరా పనులైపోయాక బిల్లులు శాంక్షన్ చేయండని అడిగితే అధికారులు లేట్‌‌‌‌ చేస్తున్నారు. 

139 మంది సర్పంచ్‌‌‌‌లు సస్పెండ్‌‌‌‌
పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం చేస్తున్న నేతలు, అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రాంచంద్రన్‌‌‌‌ను సీఎం కేసీఆర్ ఇటీవలే బదిలీ చేశారు. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. 2019 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 2,145 మంది సర్పంచ్‌‌‌‌లు, ఉప సర్పంచ్‌‌‌‌లకు షోకాజ్ నోటీసులిచ్చింది. 139 మందిని సస్పెండ్ చేసింది. ఐదుగురిని తొలగించింది. అలాగే 2,047 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులిచ్చారు. 159 మందిని సస్పెండ్ చేశారు. 236 మంది ఎంపీడీవోలకు నోటీసులిచ్చారు. 

కేంద్రం నిధులు వేరే పనులకు..
ఊర్లల్లో శ్మశానవాటికలు, డంపింగ్‌‌‌‌ యార్డులు, విలేజ్ పార్కులు, రైతు వేదిక నిర్మాణానికి కేంద్రం ఇచ్చే ఉపాధి హామీ (ఈజీఎస్‌‌‌‌) నిధులే వాడుకుంటున్నారు. ఫీల్డ్​ లెవల్‌‌‌‌లో పనుల ప్రోగ్రెస్ ఆధారంగా ఈ ఫండ్స్  దశలవారీగా రిలీజ్ అవుతాయని ఆఫీసర్లు మొదట్లో చెప్పారు. కానీ గత జులై నుంచి చేసిన పనులకూ ఫండ్స్ రావడం లేదని సర్పంచ్‌‌‌‌లు అంటున్నారు. కొన్నిచోట్ల మెజర్‌‌‌‌మెంట్‌‌‌‌ బుక్స్‌‌‌‌ రికార్డు చేయడంలో స్టాఫ్ నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాము ఆ రికార్డులను ఎప్పటికప్పుడు పైకి పంపుతున్నామని.. పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌‌‌‌మెంట్ డిపార్టమెంట్లలోనే బిల్లులు ఆగిపోతున్నాయని జిల్లాల్లో ఆఫీసర్లు చెబుతున్నారు. వర్క్స్ ప్రోగ్రెస్ ఆధారంగా కేంద్రం రిలీజ్ చేసే ఈజీఎస్ ఫండ్స్‌‌‌‌ను రాష్ట్ర సర్కారు వేరే అవసరాలకు మళ్లించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. 

ఊరిడిచి పోతున్నరు
ఊర్లల్లో డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ పనులను అప్పు చేసి మరీ చేశామని సర్పంచ్‌‌‌‌లు చెబుతున్నారు. పనులు చేయకుంటే సస్పెండ్​ చేస్తారనే భయంతో కొందరు సర్పంచ్‌‌‌‌లు ఇండ్లు, భూములు, ఇంట్లో ఉన్న బంగారం కుదవపెట్టి మరీ లోన్లు తెచ్చారని చెబుతున్నారు. ఇంత చేసినా కొన్నిచోట్ల శ్మశానవాటికలకు 40 శాతం, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలకు 30 శాతమే బిల్లులు వచ్చాయని, ఇంకొన్నిచోట్ల అవీ రాలేదని వాపోతున్నారు. రాష్ట్రంలో ఒక్కొక్కరికీ కనీసం రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు బిల్లులు రావాల్సి ఉందంటున్నారు.మొదట్లో ఉరికురికి పని చేయించుకున్న ఆఫీసర్లు ఇప్పుడు తమకేం సంబంధం లేదన్నట్టు తప్పించుకు తిరుగుతున్నారని మండిపడుతున్నారు. అప్పుల వాళ్లు వేధిస్తుండటంతో తట్టుకోలేక కొందరు ఊరొదిలి వెళ్లిపోతున్నారని చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలానికి చెందిన ఓ సర్పంచ్ అప్పుల బాధ భరించలేక కుటుంబంతో సహా ఊరు విడిచి వెళ్లారని, హైదరాబాద్‌లో ఉంటున్నారని అన్నారు. సర్కారు నిధులు విడుదల చేయకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.

నేతలను నిలదీస్తున్నరు 
రాష్ట్రవ్యాప్తంగా పల్లె ప్రగతి గురువారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు జరగనుంది. ఇందులో భాగంగా గత 10 రోజుల నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు ఊర్లలో సన్నాహక మీటింగ్‌‌‌‌లు నిర్వహించగా బిల్లులు విడుదల చేయాలంటూ సర్పంచ్‌‌‌‌లు నిలదీశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌‌‌‌రావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌‌‌‌, పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డిని ప్రశ్నించారు. దీంతో బిల్లుల వ్యవహారం అధికార పార్టీ నేతలు పెద్ద సమస్యగా తయారైంది. 

గ్రామాల్లో అధికారుల తనిఖీలు
గత మూడు సార్లు జరిగిన పల్లె ప్రగతిలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సైతం గ్రామాల్లో పర్యటనలు చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు జిల్లాల పర్యటనలకు వెళ్లారు. కరోనా మన దగ్గరకు రాకముందు  అన్ని జిల్లాల్లో కొన్ని ఊర్లను తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని సీఎం ఆదేశించడంతో సుమారు 100 మంది ఐఏఏస్ , ఐపీఎస్ అధికారులు పర్యటించి రిపోర్టులు ఇచ్చారు. ఇపుడు పంచాయతీరాజ్‌‌‌‌, రూరల్‌‌‌‌ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ అధికారులు, డీపీవో అధికారులు పర్యటించనున్నారు

ఆఫీసర్లు అవమానిస్తున్నరు
సర్కారు చెప్పిన పనుల కోసం దొరికినకాడల్లా లక్షలకు లక్షలు అప్పులు జేసినం. ఇప్పటికీ సర్కారు బిల్లులిస్తలేదు. తెచ్చిన పైసలకు మిత్తి కట్టలేక ఇబ్బంది పడుతుంటే పనులు లేటయితన్నయని ఆఫీసర్లు షోకాజ్ నోటీసులిచ్చి, సస్పెన్షన్లతో అవమానిస్తున్నరు.  
- శారద, సర్పంచ్, అమ్రాబాద్, నాగర్​కర్నూల్ జిల్లా


మొహం చాటేస్తున్నరు
సెగ్రిగేషన్​షెడ్డు, విలేజ్ పార్కు, శ్మశానవాటిక కోసం రూ‌‌. 8 లక్షలు మిత్తికి తెచ్చి ఖర్చు చేసిన. ఇప్పటికి 8 నెలలైంది. సర్కారు నుంచి బిల్లులొస్తలేవు. అధికారులేమో మొహం చాటేస్తున్నరు.
- సరిన్, సర్పంచ్‌‌, నాలేశ్వర్ గ్రామం, నవీపేట మండలం, నిజామాబాద్ జిల్లా 

బిల్లులియ్యకుంటే మాకు చావే గతి..
రూ.15 లక్షలు అప్పు తెచ్చి ఊర్ల పనులు చేయించిన. ఇప్పటికీ ఒక్క పైసా రాలె. పనులు చేయలేదని మీటింగ్​లో అవమానిస్తున్నరు. దండం పెడుతున్న. ఇప్పటికైనా బిల్లులు ఇవ్వండి. లేదంటే మాకు చావే గతి. 
‑ భూక్య తులసి, సర్పంచ్‌, గార్లగడ్డ తండా, జనగామ జిల్లా

ఇంకుడు గుంతల పైసలూ ఇయ్యలె 
ఉపాధి హామీ పథకం కింద మా ఊర్లో ఇంటింటా ఇంకుడుగుంతలు తవ్వించాలని టార్గెట్ పెట్టిన్రు. సొంత పైసలు పెట్టి 136 గుంతలు తవ్వించినం. కూలీల పైసలు కొందరికి ఇచ్చి ఇంకా కొందరికి ఇయ్యలె. ఏడాదిన్నర అవుతున్నా మెటీరియల్ పేమెంట్ కాలె. మూడున్నర లక్షల దాకా పెండింగ్ ఉన్నయ్.
‑ పింగళి శ్రీలత, సర్పంచ్, ఎల్లారం, మంచిర్యాల జిల్లా