రాజీవ్​ స్వగృహతో సర్కారు రియల్​ దందా

రాజీవ్​ స్వగృహతో సర్కారు రియల్​ దందా
  • కలెక్టర్లే ప్రమోటర్లు.. నెల రోజుల నుంచి వెంచర్లలోనే అధికారుల తిష్ట
  • ప్రైవేటుకు దీటుగా గేటెడ్​ తరహాలో వెంచర్లు
  • ఫ్లాట్లు, ఓపెన్​ ప్లాట్లు అమ్మి 5 వేల కోట్లకుపైగా రాబట్టుకునేలా ప్రభుత్వం ప్లాన్​

వెలుగు నెట్​వర్క్​: రాజీవ్​ స్వగృహ ఫ్లాట్లు, ఓపెన్​ ప్లాట్లతో రాష్ట్ర సర్కారు పక్కా రియల్​ ఎస్టేట్​ బిజినెస్​ స్టార్ట్​చేసింది. పదిహేనేండ్ల కింద సేకరించిన ఈ భూములను, కట్టిన ఇండ్లను  అమ్మేసి రూ. 5 వేల కోట్లకు పైగా రాబట్టుకోవాలని టార్గెట్  పెట్టుకున్నది. అందుకోసం ప్రైవేట్​రియల్టర్లను మించిన ప్లాన్లతో ముందుకుపోతున్నది. ఈ పని కోసం హైదరాబాద్​సహా అన్ని జిల్లాల్లో మొత్తం అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దింపింది. సర్కారు ఆదేశాలతో ఫీల్డ్​లో దిగిన కలెక్టర్లు, ఇతర ఆఫీసర్లు నెల రోజులుగా రాజీవ్​స్వగృహ ఆస్తులను గేటెడ్​ కమ్యూనిటీ తరహాలో వెంచర్లుగా డెవలప్​చేయడంలో బిజీ అయ్యారు. పొద్దున లేచింది మొదలు అక్కడే కుర్చీలు, టేబుళ్లు వేసుకొని స్టాఫ్​కు, కూలీలకు పనులు అప్పగిస్తున్నారు. 

అటు వైపు పోతే చాలు.. ఉరికొచ్చి వివరిస్తరు..!

రోడ్ల వెంట ఆకట్టుకునే ఆర్చీలు, హంగూఆర్భాటాలు, హడావుడి చూసి అక్కడ ఆగడమే ఆలస్యం, వెంటనే హెల్ప్​ డెస్క్ ల దగ్గరి రిసెప్షనిస్టులు పరుగెత్తుకొచ్చి చుట్టుముడుతున్నరు. ‘‘సార్​.. ఓపెన్​ ప్లాటు కావాలా? కొత్త ఫ్లాట్​ కావాలా? ఎటువైపు కావాలి? ఏ రేటులో కావాలి?’’ ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తున్నారు. కలర్​ఫుల్ ​బ్రోచర్లు చేతిలో పెట్టి కేటగిరీల వారీగా ఓపెన్​ ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల గురించి వివరిస్తున్నారు. 15 ఏండ్ల కిందటి రాజీవ్​ స్వగృహ ఆస్తులను డిపాజిటర్ల నుంచి స్వాధీనం చేసుకొని సర్కారే డెవలప్​ చేసి అమ్ముతున్న  వెంచర్ల వద్ద తాజాగా కనిపిస్తున్న దృశ్యాలివి. జిల్లా కలెక్టర్లే దగ్గరుండి మరీ వెంచర్​ పనులను పర్యవేక్షిస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆఫీసర్లు కూడా రంగంలోకి దిగి ప్రైవేట్​ వెంచర్లకు దీటుగా గేటెడ్​ తరహా సౌకర్యాలను కల్పించడంలో బిజీ అయ్యారు.

ఖాళీ జాగాల్లో పిచ్చిచెట్లు, ముళ్లపొదలు తొలగించి  సాఫ్​చేయిస్తూ, లేఅవుట్లు వేయిస్తున్నారు.  వెంచర్ల చుట్టూ గోడలు కట్టించి, గేట్లు పెట్టించి, ఆకట్టుకునే ఆర్చీలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. పనిలో పనిగా వెంచర్ల దగ్గరికి వచ్చే కొనుగోలుదారులకు కావాల్సిన సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా హెల్ప్​ డెస్కులు పెడుతున్నారు. ఫ్లాట్లు, ఓపెన్​ ప్లాట్ల అమ్మకానికి సర్కారు నుంచి నోటిఫికేషన్​ రాగానే, ఈ-–వేలం ద్వారా అమ్మేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్లు చెప్తున్నారు.

అప్పట్ల పబ్లిక్​ కోసం.. ఇప్పుడు పైసల కోసం..

2006లో ఉమ్మడి ఏపీలో అప్పటి కాంగ్రెస్ ​సర్కారు ప్రభుత్వ ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజల సొంతింటి కల నేర్చేందుకు ‘రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్​’ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలకు దగ్గరగా ఉన్న ప్రభుత్వ స్థలాలు సేకరించి 3 బీహెచ్​కే, 2.5 బీహెచ్​కే, 2 బీహెచ్​కే, 1 బీహెచ్​కే ఫ్లాట్లు ఉండేలా అపార్ట్​మెంట్లు కట్టి, నామినల్​రేట్లకు అమ్మాలనుకుంది. ఈక్రమంలో హైదరాబాద్​సహా జిల్లాల్లో ఇండ్లు కావాలనుకున్నవాళ్ల నుంచి రూ. 3 వేలు, రూ. 5వేల చొప్పున ప్రాసెసింగ్​ఫీజు​కట్టించుకొని అప్లికేషన్లు తీసుకుంది. పైలట్​ ప్రాజెక్టుగా హైదరాబాద్​లోని చాందానగర్​, నాగోల్ బండ్లగూడ, పోచారం, జవహర్​నగర్, గాజుల రామారంతో పాటు ఖమ్మం జిల్లా పోలేపల్లిలో 9 వేలకు పైగా 3 బీహెచ్​కే, 2 బీహెచ్​కే, సింగిల్​బెడ్​రూం ప్లాట్ల నిర్మాణం చేపట్టారు. సుమారు 1,700  ఇండ్లు పూర్తిచేసి పోచారంలో 180 ఫ్లాట్లను, బండ్లగూడలో 500 ఫ్లాట్లను అమ్మారు.  మరో వెయ్యి ఫ్లాట్ల వరకు అలాగే ఉండిపోగా, ఒక్క ఖమ్మంలోనే 576 ఫ్లాట్లు కట్టి ఖాళీగా పెట్టారు. కరీంనగర్​, రామగుండం, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్​, మహబూబ్​నగర్,  నల్గొండ లాంటి కొన్నిచోట్ల నిర్మాణాలు మొదలుపెట్టినా అసంపూర్తిగా మిగిలిపోయాయి. కొన్ని పిల్లర్ల దశకే పరిమితమయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చాక రాజీవ్​స్వగృహను పూర్తిగా పక్కనపెట్టింది. తాము 15 ఏండ్ల కిందే అడ్వాన్స్​చెల్లించినందున ప్రస్తుత మార్కెట్​రేటుకు అటుఇటుగా తమకే అమ్మాలని డిపాజిట్​దార్లు ఎన్నిసార్లు రిక్వెస్ట్​చేసినా, ఆందోళనలు చేపట్టినా సర్కారు స్పందించలేదు. ఈలోగా హైదరాబాద్​ సహా అన్ని జిల్లాల్లోనూ రాజీవ్ ​స్వగృహ భూముల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. అసలే అప్పుల్లో ఉన్న ప్రభుత్వం, వీటిని తానే డెవలప్​చేసి అమ్మితే వేల కోట్లు సంపాదించవచ్చని భావించింది. ఎప్పటి నుంచో ఉన్న ఈ ఆలోచనను  సర్కారు ఇటీవలే ఆచరణలో పెట్టింది. సర్కారు ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆఫీసర్లు అప్పట్లో డిపాజిట్లు కట్టినవాళ్లందరికీ అడ్వాన్స్​తిరిగి​ఇస్తామని సమాచారం ఇచ్చారు. ఉదాహణకు కామారెడ్డిలో  543 ఫ్లాట్లకుగాను 580 మంది డిపాజిట్​ చెల్లించారు. ఇందుకు సంబంధించి కలెక్టరేట్​నుంచి పాత రశీదులు సేకరించిన ఆఫీసర్లు, డిపాజిట్​దారుల ప్రస్తుత బ్యాంక్ అకౌంట్ నంబర్లు తీసుకుంటున్నారు. త్వరలోనే వారి అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని చెప్తున్నారు. 

ప్రైవేటుకు దీటుగా..!

రాజీవ్​ స్వగృహ కార్పొరేషన్​కింద సేకరించిన భూములు (ఇప్పటికే కట్టిన అపార్ట్​మెంట్లు, ఖాళీ జాగాలు కలిపి) 1,575 ఎకరాల వరకు ఉన్నట్టు ఆఫీసర్లు లెక్కతేల్చారు. జాగాలు, ఇండ్లు, వాటి మార్కెట్​ రేట్లపై  ఓ ప్రైవేట్ ఏజెన్సీ​ద్వారా సర్వే చేయించారు.  దాదాపు 150 ఎకరాలు లిటిగేషన్​లో ఉండగా, 19 చోట్ల  820 ఎకరాలు క్లియర్​గా ఉన్నట్టు ఈ సంస్థ రిపోర్ట్​ ఇచ్చింది. ఖాళీ జాగాలను ప్లాట్లు చేసి అమ్మడం ద్వారా రూ. 2,412 కోట్లు, ఇప్పటికే కట్టిన, అసంపూర్తిగా ఉన్న ఇండ్లు, అపార్ట్​మెంట్లను అమ్మడం ద్వారా రూ. 2,913 కోట్లు.. ఇట్లా మొత్తంగా రూ. 5,325 కోట్లు రాబట్టాలని సర్కారు టార్గెట్​పెట్టుకొంది. ఈ బాధ్యతను కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులపై పెట్టింది. అనుకున్న రేటు రావాలంటే  లే అవుట్లు ఆకట్టుకునేలా ఉండాలని భావించిన ఆఫీసర్లు  వారం, పది రోజులుగా రాష్ట్రంలోని అన్ని వెంచర్లలో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కంపచెట్లతో నిండిన ఏరియాలను క్లీన్​చేసి ఇంటర్నల్​ రోడ్లు వేస్తున్నారు. ప్లాట్లకు కొలతలు వేసి నంబర్లు కేటాయిస్తున్నారు. కంపౌండ్​ వాల్స్​​, ఆర్చీలు,  గేట్లు నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం పోల్స్​ వేసి ఎలక్ట్రిక్​ లైన్లు లాగుతున్నారు.  కలెక్టర్ల ఆధ్వర్యంలో రెవెన్యూ,  ఆర్అండ్​ బీ,  మున్సిపల్,  ఇండస్ట్రియల్ ఇన్​ఫ్రాస్ట్రక్చ్రర్​ డెవలప్​మెంట్, సర్వే ల్యాండ్ రికార్డు ఆఫీసర్లు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు.  వెంచర్ల దగ్గర హెల్ప్​ డెస్క్​లు పెట్టి.. స్టాఫ్​ను అందుబాటులో ఉంచారు. ఆసక్తి ఉన్నవాళ్లకు వెంచర్​ హైలెట్స్​ చెప్తూ వారి ఫోన్​నంబర్లు, వివరాలు నోట్​ చేసుకుంటున్నారు.  ఇండ్లు, ఫ్లాట్లు చూసుకోవచ్చని  చెప్తున్నారు. 

త్వరలో ఈ–వేలం

రాజీవ్​ స్వగృహ వెంచర్లలోని ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాలను ఈ‌‌‌‌–వేలం పద్ధతిలో అమ్మేందుకు రాష్ట్ర సర్కారు అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ ​ఇస్తామని కలెక్టర్లు చెప్తున్నారు. అన్ని వివరాలు ఎంఎస్​టీసీ వెబ్​సైట్​లో పెట్టామని చెప్తున్నారు. నోటిఫికేషన్ ​ఇవ్వగానే ఎంఎస్​టీసీ వెబ్​సైట్​లో రిజిస్ట్రేషన్​ చేసుకునే చాన్స్​ కల్పిస్తామని, వేలం ప్రక్రియ పారదర్శకంగా నిర్వహిస్తామని అంటున్నారు. కాగా, సర్కారు తీరుపై 15 ఏండ్ల కింద ఫ్లాట్ల కోసం అడ్వాన్స్​ కట్టిన డిపాజిట్​దారులు గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వం ఇండ్లు కట్టిస్తుందనే ఆశతో ఇన్నాళ్లూ ఎదురుచూశామని, ఇండ్లు కట్టివ్వకున్నా మార్కెట్​రేటుకు తమకే ఇస్తారని ఆశపడ్డామని, సర్కారే వేలం వేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.