సుందర్ పిచాయ్కి మూడేండ్ల శాలరీ రూ.5 వేల 800 కోట్లు

సుందర్ పిచాయ్కి మూడేండ్ల శాలరీ రూ.5 వేల 800 కోట్లు

వాషింగ్టన్: గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ తన సీఈవో సుందర్ పిచాయ్ కు సరికొత్త వేతన ఒప్పందాన్ని ఖరారు చేసింది. తాజాగా వెలువడిన అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. రాబోయే మూడేండ్ల కాలానికి సుందర్​పిచాయ్ మొత్తం ప్యాకేజీ సుమారు 692 మిలియన్ల డాలర్లకు చేరే అవకాశం ఉంది.

భారతీయ కరెన్సీలో దీని విలువ దాదాపు రూ.5,800 కోట్లు. ఈ ప్యాకేజీలో ప్రధాన భాగం షేర్ల రూపంలోనే ఉంటుంది. ఒకవేళ కంపెనీ లక్ష్యాలను మించి రాణిస్తే, ఈ మొత్తం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది.

సుందర్ పిచాయ్ వార్షిక ప్రాథమిక వేతనం 2 మిలియన్ డాలర్లుగా (సుమారు రూ.17 కోట్లు) కొనసాగుతోంది. గూగుల్‌కు చెందిన స్వయంప్రతిపత్తి కలిగిన వాహన సంస్థ 'వేమో', డ్రోన్ డెలివరీ సంస్థ 'వింగ్'లో కూడా పిచాయ్‌కు భారీగా స్టాక్ ఆఫర్లు లభించాయి. వీటి విలువ దాదాపు 350 మిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని సమాచారం.

కొంతకాలంగా ఏఐ రంగంలో గూగుల్ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ సమయంలో పిచాయ్ నాయకత్వంపై నమ్మకంతో సంస్థ ఈ భారీ ప్యాకేజీని ఆమోదించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వేతనాల కంటే ఎక్కువని విశ్లేషకులు చెబుతున్నారు.