ఎన్​ఈపీ--2020 మన బడుల్లో  అమలయ్యేదెన్నడు?

ఎన్​ఈపీ--2020 మన బడుల్లో  అమలయ్యేదెన్నడు?

నేషనల్ ఎడ్యుకేషనల్​ పాలసీ(ఎన్ఈపీ)-2020ని కేంద్ర కేబినెట్ 2020 జులైలోనే ఆమోదించినా.. దాని అమలులో మాత్రం తీవ్ర జాప్యం జరుగుతోంది. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నందు వల్ల, ఎన్ఈపీ-2020 అమలులో రాష్ట్ర ప్రభుత్వాల చొరవ కీలకం కానుంది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ఈపీ-2020ని అమలు చేస్తే ఎదురయ్యే సమస్యలను అధ్యయనం చేయడానికి కమిటీలు వేయగా.. మరికొన్ని రాష్ట్రాలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. ఎన్ఈపీ-2020 సిఫార్సులకు అనుగుణంగా విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులుచేర్పులు అవసరమనే అంశంపై వివిధ కమిటీలను నియమిస్తే, ఈపాటికి అవి నివేదికలను కూడా సమర్పించేవి. దాని అమలులో ముందున్న కర్నాటక, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల సరసన తెలంగాణకు కూడా చోటు దక్కేది.

కరోనా మహమ్మారి కారణంగా మొత్తం విద్యా వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. కోట్ల మంది చిన్నారులు చదువుకు దూరమయ్యారు. మరోవైపు బ్రిటిష్​ నాటి బట్టీ విధానమే దేశంలో ఇప్పటికీ కొనసాగుతోంది. దీని వల్ల స్టూడెంట్ల వాస్తవ సామర్థ్యం బయటికి రావడం లేదు. పైగా మార్కుల కోసం వారిపై నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఎడ్యుకేషన్​ సిస్టంలో మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్​ ఎడ్యుకేషన్ పాలసీ–2020ని తీసుకొచ్చింది. ఈ పాలసీ అమలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగ్గా వ్యవహరిస్తోంది. విద్యా వ్యవస్థలో మార్పు చేర్పులపై సరైన అధ్యయనం చేయడం లేదు. దీంతో మన బడుల్లో కొత్త ఎడ్యుకేషన్​ పాలసీ ఎప్పుడు అమలు అవుతుందో అని స్టూడెంట్లు, తల్లిదండ్రులు, ఎడ్యుకేషనల్​ ఎక్స్​పర్ట్స్ ఆందోళన చెందుతున్నారు.

ఎడ్యుకేషన్​ పాలసీ చేసిన సిఫార్సులేమిటి?

ప్రస్తుత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయాలని ఎన్ఈపీ-2020 సిఫార్సుచేసింది. స్కూల్​ విద్యను 5+3+3+4 మోడల్​లో రూపకల్పన చేయాలని, తదనుగుణంగా పాఠ్యప్రణాళిక, బోధన పద్ధతులను మార్చాలని సూచించింది. ఈ నూతన విద్యా విధానం స్కూల్​ ఎడ్యుకేషన్​ను నాలుగు దశలుగా విభజించింది. ఇందులో మొదటిది 5 సంవత్సరాల ఫౌండేషనల్ స్టేజ్(ప్రీ-ప్రైమరీ, గ్రేడ్ 1,2), ఇక రెండోది 3 సంవత్సరాల ప్రిపరేటరీ స్టేజ్(గ్రేడ్ 3,4,5), మూడోది 3 సంవత్సరాల మిడిల్ స్టేజ్(గ్రేడ్ 6,7,8), ఇక నాలుగోది 4 సంవత్సరాల సెకండరీ స్టేజ్(గ్రేడ్ 9,10,11,12). ఈ విధానంలో పిల్లలను 3 ఏండ్ల వయసు వచ్చే నాటికి బడుల్లో చేర్చవచ్చు. వారికి 18 ఏండ్లు వచ్చే నాటికి స్కూల్​ ఎడ్యుకేషన్​ పూర్తికావాలి. అయితే, తెలంగాణ రాష్ట్రంలో నూతన విద్యా విధానం ప్రకారం స్కూల్​ ఎడ్యుకేషన్​ను పూర్తి స్థాయిలో మార్చాలి.

ప్రీ-ప్రైమరీ ఎలా ఉండాలి?

పిల్లలకు ఆరేండ్ల వయసు వచ్చే వరకే వారి మెదడు సుమారు 85 శాతం అభివృద్ధి చెందుతుంది. వారికి ఎంత మంచి సంరక్షణ- ప్రేరణ ఉంటే వారి మెదడు అంత ఎక్కువగా అభివృద్ధి చెంది చురుకుగా తయారవుతుంది. అందువల్ల ప్రతి శిశువుకూ నాణ్యమైన సంరక్షణతో పాటు విద్య అందుబాటులో ఉండాలి. కానీ చాలా మంది పిల్లలకు అటు సంరక్షణ గానీ, ఇటు విద్య గానీ అందడం లేదు. అందువల్ల ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ బలోపేతానికి అధిక బడ్జెట్ కేటాయించి ప్రతి శిశువు అభివృద్ధి చెందడానికి బాటలు వేయాలని ఎన్ఈపీ-2020 సూచించింది. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లో పిల్లలకు నేర్పించే వర్ణమాల, భాషలు, సంఖ్యలు, లెక్కించడం, రంగులు, ఆకారాలు, డ్రాయింగ్, పెయింటింగ్, డ్రామా, సంగీతం, పాటలు, పద్యాలు, నీతి కథలు, ఆలోచన పెంపొందించే పొడుపు కథలు, మెదడుకు మేత వేసే పజిల్స్, ఇంటా–బయటా ఆడే ఆటలు వంటివన్నీ ప్లేవే మెథడ్, యాక్టివిటీ బేస్డ్, డిస్కవరీ బేస్డ్ తదితర పద్ధతుల ద్వారా బోధించాలి. ఇవేకాకుండా, వివిధ సామాజిక సామర్థ్యాలు, సత్ప్రవర్తన, మర్యాద, నీతి, పరిశుభ్రత, టీమ్ వర్క్, సహకారం పెంపొందించేలా పాఠ్యాంశాల రూపకల్పన జరగాలి. 


స్కూల్​ ఎడ్యుకేషన్​లోకి ప్రీప్రైమరీ

మూడేండ్లలోపు పిల్లలకు, 3 నుంచి 8 ఏండ్ల పిల్లలకు వేర్వేరుగా పాఠ్యాంశాలు రూపొందించి, వాటిని బోధించే పద్ధతులు తల్లిదండ్రులకు, టీచర్లకు సులువుగా అర్థమయ్యేలా అభివృద్ధి చేయాలని ఎన్‌‌సీ‌‌ఈ‌‌ఆర్‌‌టీకి ఎన్ఈపీ-2020 సూచించింది. అలాగే ప్రస్తుతం పనిచేస్తున్న అంగన్​వాడీ టీచర్లకు వారి విద్యార్హతలను బట్టి బోధన పద్ధతులపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఫ్రేమ్ వర్క్ రూపకల్పన చేసే బాధ్యతను కూడా ఎన్‌‌సీ‌‌ఈ‌‌ఆర్‌‌టీకే అప్పగించింది. ఈ పాలసీ ప్రకారం, 2020 నాటికే దేశవ్యాప్తంగా ప్రీ ప్రైమరీని స్కూల్​ ఎడ్యుకేషన్​లో విలీనం చేయాలని ఉన్నా, ఆ దిశగా కేంద్రం ఇంకా అడుగులు వేయడంలేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు తీసుకుందీ లేదు. అందువల్ల ప్రీ ప్రైమరీని స్కూల్​ ఎడ్యుకేషన్​లో విలీనం చేసేందుకు అవసరమైన విధివిధానాల రూపకల్పన కోసం ఒక కమిటీని వేసి.. సాధ్యమైనంత త్వరగా నివేదిక వచ్చేలా చొరవ తీసుకోవాలి.


ఎన్ఈపీ-2020 సిఫార్సుల ప్రకారం, స్కూల్స్ ఎన్ని రకాలుగా ఉండాలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. నాలుగు దశలుగా విభజిస్తారా? లేక మూడుగానా? లేక రెండు భాగాలుగా చేస్తారా? లేక నాలుగింటిని కలిపి ఒకేఒక్కటిగా చేస్తారా? అనే దానిపై క్లారిటీ రావాలి. అప్పుడే స్టూడెంట్ల సంఖ్యను బట్టి అక్కడి ప్రభుత్వ/ప్రైవేట్ స్కూల్స్ ఎలా అప్​గ్రేడ్/కన్వర్ట్ అవ్వాలో అర్థమవుతుంది. అన్నింటి కంటే ముఖ్యమైంది ఇప్పుడున్న ప్రభుత్వ/ప్రైవేట్ హైస్కూళ్లను 12వ తరగతి వరకు విస్తరిస్తారా? ప్రభుత్వ/ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో 9,10 తరగతులను కలుపుతారా? లేక కింది దశల్లో ఏదో ఒక దశ వరకు కలుపుతారా? లేక ప్రీప్రైమరీ దశ వరకు మొత్తం స్కూల్​ స్థాయిలోని 12 తరగతులను కలిపి ఉంచుతారా? అనేది స్పష్టం కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే ప్రైవేట్ యాజమాన్యాలు వారి స్కూళ్లు/జూనియర్ కాలేజీల విషయంలో ఎలా ముందుకెళ్లాలో తేల్చుకునే అవకాశం ఉంటుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం.. మోడల్/గురుకుల/నవోదయ/కేంద్రీయ పాఠశాలలు లేదా సీబీ‌‌ఎస్‌‌ఈ నుంచి ఏదో ఒక పద్ధతిని అనుసరించవచ్చు. ఇంటర్​ను స్కూల్​ ఎడ్యుకేషన్​లో విలీనం చేయడానికి లేదా స్కూల్​ ఎడ్యుకేషన్​ను 12వ తరగతి వరకు విస్తరించడానికి విధివిధానాలు రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి.

అమలు చేయక తప్పదు

ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్లు/కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారమయం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లు/కాలేజీల్లో ఫీజుల నియంత్రణకై కేబినెట్ సబ్ కమిటీని నియమించడం స్వాగతించాల్సిన విషయం. ఏ రాష్ట్రమైనా, ముందుగానో ఆలస్యంగానో ఎన్ఈపీ-2020ను అమలు చేయకతప్పదు. ఎందుకంటే స్వాతంత్ర్యం తర్వాత దేశవ్యాప్తంగా ఒకే విద్యా విధానం చెలామణిలో ఉంటుంది. ఉదాహరణకు ప్రస్తుతం 10+2+3 విధానం అమలులో ఉంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడానికి కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. లోతుగా చూస్తే ఎన్ఈపీ, ప్రీ-ప్రైమరీలో చాలా సంస్కరణలు చేసి స్కూల్​ ఎడ్యుకేషన్​లో విలీనం చేయాలని సూచించింది. అంటే ఈ సంస్కరణలు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రభావంతంగా ప్రవేశపెట్టడానికి సహాయపడతాయన్న మాట. తెలంగాణ ప్రభుత్వం వివిధ స్థాయిల్లో ఎన్ఈపీ అమలుపై దృష్టిసారిస్తే, రాష్ట్ర స్టూడెంట్లు తెలంగాణ కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తారని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఎంత క్లిష్ట సమస్యలకైనా కమిటీల ద్వారానే పరిష్కార మార్గాలు లభిస్తాయి. ముందుగా ఆయా అంశాలపై శాస్త్రీయ అధ్యయనానికి కమిటీలు వేసి వాటి నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది.

చాలా మార్పులు అవసరం

స్కూళ్లలో ఇంటర్ విలీనం చేస్తే.. కామర్స్, సోషియాలజీ, సైకాలజీ, జాగ్రఫీ వంటి సబ్జెక్ట్ లను 9,10 స్టూడెంట్లకు అందించాల్సి ఉంటుంది. వాటిలో అదనపు స్థలం, క్లాస్​రూమ్స్, లైబ్రరీ, సైన్స్ లాబ్స్ ఏర్పాటు చేయాలి. బోధన, బోధనేతర సిబ్బందిని పెంచుకోవాలి. అలాగే టీచర్ల నియామక విధానంతోపాటు వారికి ఉండాల్సిన కనీస విద్యార్హతలు, వారి హోదాలు(టీజీటీ/పీజీటీ) కూడా మారతాయి. స్టూడెంట్–టీచర్ రేషియో 30:1 (వెనుకబడిన ప్రాంతాల్లో 25:1) పాటిస్తూ, ప్రతి క్లాస్ కు ఒక టీచర్ ఉండేలా ఎప్పటికప్పుడు నియామకాలు చేయాలని ఎన్ఈపీ పేర్కొంది. ఇంకా, బోర్డు పరీక్షలు 9,10,11,12 క్లాసుల చివరిలో గానీ లేదా 11,12 క్లాసుల చివరిలోగానీ నిర్వహించాలి. బోర్డు పరీక్షల(12వ తరగతి) తర్వాత, స్టూడెంట్లు వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకై ఎంట్రన్స్ ఎగ్జామ్(స్టేట్ లెవెల్ అగ్రి/ఇంజనీరింగ్ సెట్, నేషనల్ లెవెల్ ఐ‌‌ఐ‌‌టీ/నీట్)లు రాయవలసి ఉంటుంది. 9,10,11,12 క్లాసులకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించే సిలబస్, ఆల్ ఇండియా లెవెల్ లో పరీక్ష రాసే వారికి కూడా ప్రయోజనం చేకూర్చేలా ఉండాలి. అలాగే స్టేట్/నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్​లో ఇచ్చే ప్రశ్నలు 9 నుంచి 12 క్లాసుల సిలబస్ నుంచి ఇస్తారా లేక 11 నుంచి 12 క్లాసుల సిలబస్ నుంచి ఇస్తారో స్పష్టత ఇవ్వాలి. అందువల్ల ఎన్ఈపీ ప్రకారం, కొత్త సిలబస్ కూర్పు అంత సులువు కాదు. జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా, ప్రీ-ప్రైమరీ నుంచి హైస్కూల్ వరకు విషయ పరిజ్ఞానాన్ని కొద్దికొద్దిగా అందిస్తూ, 12వ తరగతిలో అధిక మోతాదులో అందించాలి. కొత్త పుస్తకాలను ముద్రించడమే కాకుండా, వాటి సాఫ్ట్ కాపీలను వెబ్ సైట్​లో ఉంచాలి.