వెలుగు ఓపెన్ పేజీ: క్లైమేట్ చేంజ్ ను ఉపేక్షిస్తే... వ్యవసాయం అతలాకుతలం!

వెలుగు ఓపెన్ పేజీ:  క్లైమేట్ చేంజ్ ను ఉపేక్షిస్తే... వ్యవసాయం అతలాకుతలం!

 వాతావరణ మార్పులు  దేశంలో  వ్యవసాయ, ఆహారోత్పత్తి రంగాలపై ఎంతగానో ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం పెరుగుతోంది.  ఉమ్మడి కృషితో  దీన్ని నిలువరించాలి.  ఉపేక్షిస్తే  వ్యవసాయ ప్రధాన దేశమైన  భారత్ తీవ్ర  ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.  వాతావరణ  కాలుష్యాల వల్ల,  ముఖ్యంగా  వాయు కాలుష్యాలతో  భూగ్రహం వేడెక్కుతున్నతీరు  ఆందోళన  కలిగిస్తోంది.  అసాధారణ భూతాపోన్నతి వల్ల అనేక అరిష్టాలు చోటుచేసుకుంటున్నాయి.  రుతువులే  మారిపోతున్నాయి.  రుతుపవనాలు క్షీణిస్తున్నాయి.  అతివృష్టి,  అనావృష్టి  వ్యవసాయ రంగాన్ని  అతలాకుతలం  చేస్తోంది.   మన దేశ వాతావరణశాఖ  2025లో  ‘భారత్  వాతావరణ పరిస్థితుల’పై  చేసిన  ప్రకటన ఒక హెచ్చరికలాంటిదే!  స్థిరంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు,  అడ్డదిడ్డంగా  కురుస్తున్న వర్షాలు.  పెరిగిన వాతావరణ  తీవ్రతలు ఒక గట్టి  ప్రమాద  సంకేతంగా  గ్రహించాలని అందులో పేర్కొంది.  

2025 అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా  రికార్డులకెక్కింది. దీర్ఘకాలిక సగటు కన్నా  ప్రస్తుత సగటు ఉష్ణాగ్రత వృద్ధి  రెట్టింపు ఉంది.  వంద సంవత్సరాల (1901 నుంచి)  సగటు ఉష్ణోగ్రత వృద్ధి  0.68 డిగ్రీల సెల్సియస్ ఉంటే, 2025  ఫిబ్రవరిలో  సగటు డీవియేషన్ 1.36 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.  అందుకే  2025  అతి  ఉష్ణోగ్రత  సంవత్సరంగా  రికార్డుకెక్కింది.  ఈ సంవత్సరం కూడా ఇప్పటికే  ఎండల ప్రభావం జోరుగా కనిపిస్తోంది.  మార్చి ప్రారంభంలోనే చాలాచోట్ల 40 డిగ్రీలను  చేరుతోంది. తెలంగాణలోని  పది జిల్లాల్లో  ‘ఎల్లో అలర్ట్‌’  ప్రకటించారు.
 
సాగర జలాలు వేడెక్కి..

మూడు దిక్కులా  సముద్ర  సరిహద్దులున్న  ద్వీపకల్పం  భారత్‌పై  వాతావరణ మార్పుల  ప్రతికూల  ప్రభావమెక్కువని  ఐక్యరాజ్యసమితి ఏర్పరచిన అంతర్ ప్రభుత్వాల అధ్యయన బృందం (ఐపీసీసీ) తాజా నివేదిక చెబుతోంది.  వాతావరణ మార్పులపై  ప్రపంచంలోని  నిష్ణాతులైన శాస్త్రవేత్తలు,  నిపుణులతో  ఏర్పడ్డ  ఐపీసీసీ  ఇప్పటికే  పలు నివేదికలిచ్చింది.  ఎప్పటికప్పుడు  ప్రభుత్వాలను,  కంపెనీలు, - కార్పొరేట్లను అది అప్రమత్తం చేస్తూనే ఉంది.  ఈ మార్పులు  వ్యవసాయాన్ని దెబ్బతీసి, ముఖ్యంగా ఆహారోత్పత్తిని  దెబ్బతీస్తాయని  అభిప్రాయపడింది.   వేర్వేరు  ప్రత్యేక  పరిస్థితుల్లో  భారత ఉపఖండంలో  ఆహారోత్పత్తి 21శాతం వరకు  పడిపోయే  ఆస్కారాన్ని ఇది అంచనా వేసింది.   

మధ్య-తూర్పు ఉష్ణ మండల  పసిఫిక్  సముద్ర ఉపరితల జలాలు వేడెక్కడం వల్ల  తలెత్తే   ‘ఎల్​నినో’  ప్రభావంతో  భారత్,  ఆగ్నేయాసియా దేశాలు,  ఆస్ట్రేలియాల  వాతావరణంలో  విపరీత  పరిణామాలుంటాయని సదరు  నివేదికలు  చెబుతున్నాయి.  దేశంలోని  అత్యధిక  వ్యవసాయ మండళ్లలో  రుతుపవనాలు బలహీనపడటం,   లోటు వర్షపాతాలు నమోదవడం,  పొడి వాతావరణంతో  వడగాలి దినాలు పెరగటం వంటివి చోటుచేసుకుంటాయి.  ఎల్​నినో  ప్రభావం వల్ల అతి వర్షాలు  -అసాధారణ వరదలు ఒకవైపు,   మరోపక్క  డ్రైస్పెల్స్ పెరిగి కరువు,  వడగాల్పుల ప్రభావం తీవ్రమౌతోంది.  ఇది వ్యవసాయాన్ని  బాగా  దెబ్బతీస్తోంది.   ఈ  వాతావరణ  మార్పులు  అతి ప్రభావం  చూపకుండా  నిలువరించే  చర్యల్ని  దేశవ్యాప్తంగా  కేంద్ర, -  రాష్ట్ర ప్రభుత్వాలు  సత్వరం  చేపట్టాలి.  స్థానిక సంస్థలు  ఏమేం చేయాలో  నిర్దిష్ట  కార్యాచరణను కేంద్రంలోని  ‘నీతి ఆయోగ్‌’  రాష్ట్ర ‘ప్రణాళికా మండలి’ వంటివి  రూపొందించి ఇవ్వాలి. 

ప్రాణనష్టమూ అపారమే!

వాతావరణ మార్పుల  ప్రతికూల  ప్రభావంతో  నష్టపోకుండా రక్షణ,  తగు భద్రత కోరే హక్కు  దేశపౌరులకు ఉంది.  ఇది  రాజ్యాంగం  కల్పించిన హక్కు.   దాదాపు  రెండేళ్ల కింద  మార్చి 2024లో  సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.  వాతావరణ  మార్పుల  ప్రతికూల ప్రభావంతో పెద్ద సంఖ్యలో  మరణాలు చోటు చేసుకొని,  తీవ్రంగా నష్టపోయిన  రాష్ట్రాలు, - కేంద్రపాలిత  ప్రాంతాల  జాబితాను  కేంద్ర వాతావరణశాఖ  వెల్లడించింది.  విపరీత వాతావరణ పరిస్థితుల వల్ల 2025 ఒక్క ఏడాదిలోనే  2,763 మంది మరణించారు.  భారీ వర్షాలు- వరదల వల్ల  2024లో  దేశవ్యాప్తంగా 1,282 మంది  మరణిస్తే, 2025లో  అది 1,372కి  పెరిగింది.   వర్షాల సంగతి అలా ఉంటే  ఎండల తీవ్రత  ఏయేడుకాయేడు  పెరుగుతూనే ఉంది.  ఈ సంవత్సరం  కూడా  అప్పుడే  మొదలైంది. 

క్లైమేట్ చేంజ్ వల్ల  ప్రపంచవ్యాప్తంగా కూడా అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కెనెడాలో ఎప్పుడూ లేనంత అధిక ఉష్ణోగ్రతలు,  జర్మనీలో  వరదలు,   చైనాలో అసాధారణ వర్షాలు.. ఇవన్నీ వాతావరణ మార్పు తీవ్రతకు నిదర్శనాలే!  ఐక్యరాజ్యసమితి  చొరవతో  ఏటా ‘కాప్‌’  భాగస్వామ్య పక్షాలైన దాదాపు 200  దేశాలు  పాల్గొని చర్చలు  జరుపుతున్నా, పునర్వినియోగ ఇంధనాల వైపు మళ్లాలని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా ఫలితాలు గొప్పగా ఉండటం లేదు. 

అందరూ ప్రభావితులే!

ప్రపంచవ్యాప్తంగా  అందరూ  వాతావరణ  మార్పుల  దుష్ప్రభావానికి  లోనవుతున్నవారే!  సీ- ఓటర్ సంస్థ ‘యాలె ప్రోగ్రామ్‌’లో  భాగంగా  నిర్వహించిన  దేశవ్యాప్త సర్వేలో ఆసక్తికర  విషయాలు వెల్లడయ్యాయి.  పదివేల మందికి పైగా  శాంపిల్‌తో వారు  నిర్వహించిన  ఈ సర్వేలో  అత్యధికులు  కనీసం  ఒక వాతావరణ  వైపరీత్యానికైనా తాము  గురైనట్టు  వెల్లడించారు.  అత్యధికులు  వడగాలి (71శాతం),  విద్యుత్ కోత (59 శాతం),  నీటి కాలుష్యం (55 శాతం),  వ్యవసాయ  పురుగుమందుల వల్ల వ్యాధిగ్రస్తం (53 శాతం) కరువు- నీటి ఎద్దడి (52 శాతం) ఆహార కొరత (51) ప్రభావితులైనట్టు సర్వే గణాంకాలు చెబుతున్నాయి.   దశాబ్దిపైన ఎండ వేడిమి పెరుగుదల కూడా అసాధారణంగానే ఉంది. కిందటి దశాబ్ది (2014- –2025) పైన 0.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద నమోదవుతోంది.  ఏడాదిలో వేడి దినాలు సగటున 5- –10 పెరుగుతున్నాయి. అయిదేసి సంవత్సరాల ఉష్ణోగ్రత వృద్ధిని గత వంద సంవత్సరాల్లో (1901-– 05 నుంచి 2025-–30) గమనించి చూస్తే ఈ వృద్ధి అసాధారణమని,  వ్యవసాయానికి, ఆహారోత్పత్తికి  ప్రమాదకరమని ఇట్టే బోధపడుతోంది. 

వాతావరణ మార్పులపై జాతీయ ప్రణాళిక

2021-– 25 పరిణామాలను గమనించి చూసినా తీవ్రమైన ఎండ,  వడగాలి  రోజులు సగటున 30 దాకా పెరిగినట్టు కేరళ, తమిళనాడు, కర్నాటక కాఫీతోటల్లోని సాగు-ఉత్పత్తి పరిస్థితి స్పష్టం చేస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి.  ఆనాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2008 లో ‘వాతావరణ మార్పులపై జాతీయ ప్రణాళిక’ను  ప్రకటించింది.  2030 వరకు లక్ష్యాలను నిర్దేశించుకొని 
8 అంశాలపై ప్రత్యేక శ్రద్ధ నిలిపింది.  సౌరవిద్యుత్తు,  విద్యుత్ సామర్థ్య నిర్వహణ,  సుస్థిర ఆవాసాలు,  నీరు,  హిమాలయ ఎకోసిస్టమ్,  గ్రీన్ ఇండియా, వ్యవసాయం,  వ్యూహాత్మక పరిజ్ఞానం  వంటి అంశాలపై దృష్టి నిలిపి  నిర్దేశించుకున్న లక్ష్యాలు  అందుకోవాలని  ఆ  ప్రణాళిక  చెప్పింది.  ప్రస్తుత కేంద్ర 
ప్రభుత్వం ‘నీతి ఆయోగ్‌’ ద్వారా  క్లైమెట్ యాక్షన్ కింద పలు కార్యక్రమాలు చేపడుతున్నా అవి అంత ప్రభావవంతంగా లేవు. 2070 నాటికి ‘నెట్ జీరో’ సాధన లక్ష్యం దిశగా వ్యూహాలు,  వికసిత్ భారత్ - 2047 పేరిట  దేశాభ్యున్నతి ప్రణాళికలు  ప్రకటించినంత  ఆర్భాటం  కార్యాచరణలో  కనిపించని  పరిస్థితులు  నెలకొన్నాయి.  మనదేశంలో  వ్యవసాయం ప్రధానమైనది  కనుక  వాతావరణ మార్పుల ప్రభావం  వ్యవసాయాన్ని కుంగదీయకుండా,  ఆహారోత్పత్తిని  భంగపరచకుండా నివారించే  సత్వర కార్యాచరణ  ఎంతో ముఖ్యం.  ఆ దిశలోనే అందరం కలిసి పనిచేయడం తక్షణ కర్తవ్యం.


- పొన్నం ప్రభాకర్, 
రాష్ట్ర రవాణా,  వెనకబడిన తరగతుల సంక్షేమశాఖల మంత్రి
ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ

openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.