V6 News

వెలుగు ఓపెన్ పేజీ : కవిత పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందా?

 వెలుగు ఓపెన్ పేజీ : కవిత పార్టీ ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందా?

 మాజీ సీఎం కేసీఆర్ కూతురు,  తెలంగాణ  జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.  కవిత ఉదంతానికి  అత్యంత దగ్గరి ఉదాహరణగా దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి  కుమార్తె  షర్మిలను చెప్పుకోవచ్చు.  తన అన్న జగన్ మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్  సీఎంగా ఉన్న  సమయంలో  అతనితో  చోటుచేసుకున్న విభేదాలతోపాటు  రాజకీయంగా తన ప్రాధాన్యత తగ్గడం వల్ల ఆమె  తెలంగాణలో  వైఎస్సార్  తెలంగాణ పార్టీ  పేరుతో  సొంత పార్టీ  స్థాపించారు.  కానీ,  ఆమె తన పార్టీని  నిలబెట్టుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.  చివరకు తన పార్టీని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో విలీనం చేసి,  ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికై  తన  అన్నపైనే  పోరాడుతున్నారు.  ఆమె  సొంతపార్టీ పెట్టడానికి వారి కుటుంబంలో తలెత్తిన ఆస్తి తగాదాలే కారణమనేది  బహిరంగ  రహస్యమే.  అయినా..  ఆమె తీసుకున్న యూటర్న్ కారణంగా ఓ  జాతీయ పార్టీకి  రాష్ట్ర  అధ్యక్షురాలు  కావడమనేది  ఒకరకంగా ఆమె రాజకీయంగా ఒక మెట్టు ఎక్కినట్టుగానే చూడవచ్చు. 


తెలంగాణలో  కేసీఆర్ ఇమేజ్ చాలా పెద్దది.  ఆయనను కాదని బయటకు వచ్చిన  కవిత  రాజకీయాలపై  ప్రజలు ఎలా  రియాక్ట్  అవుతారనేది కీలకం.  కుటుంబ సభ్యుల వేధింపులు లేదా  కుటుంబంలో  ప్రాధాన్యత  తగ్గడం అనేది ప్రజల్లో  సానుభూతిని  కలిగిస్తుందా?  లేదా  ఆమె  పార్టీని  బలహీనపరుస్తుందా? అనేది ముఖ్యం.  చరిత్రను  గమనిస్తే..  సొంతపార్టీ  పెట్టినవారికంటే,  ఉన్న పార్టీని   చేజిక్కించుకున్నవారు  రాజకీయంగా  నిలదొక్కుకున్నారు. కొత్త పార్టీ పెట్టి  సక్సెస్  కావడమనేది  ప్రస్తుత  రాజకీయాల్లో  అత్యంత కఠినమైన సవాలు.  పైగా  తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై  కేసీఆర్ ముద్ర  అత్యంత బలమైనది. అటువంటి ఇమేజ్​ఉన్న తండ్రిని లేదా నాయకుడిని ఎదిరించి బయటకురావడం అనేది కత్తి మీద సాము వంటిదే.  కేసీఆర్​ను కాదని  బయటకు వచ్చినప్పుడు ప్రజల స్పందన  ప్రధానంగా  రెండు రకాలుగా ఉండే  అవకాశం ఉంది.   గ్రామీణ ప్రాంతాల్లో..  కేసీఆర్  గట్టి  మద్దతుదారులకు  కవిత  సొంత తండ్రిని  మోసం చేశారు అనే భావన కలిగే ప్రమాదం ఉంది. అలాగే,   కేసీఆర్  వైఖరిపై అసంతృప్తి ఉన్నవారికి కవితను  ఒక 'ప్రత్యామ్నాయ శక్తి'గా  చూసే అవకాశం ఉంటుంది.  అయితే, ఇది ఆమె పార్టీ అజెండా, ఇచ్చే హామీలపై ఆధారపడి ఉంటుంది. లేదా ప్రజలు దీనిని  ‘అధికార దాహం’  లేదా ‘ఆస్తి తగాదా’గా భావిస్తే  సానుభూతి కరువవుతుంది.

చీలేది  బీఆర్ఎస్  ఓట్లేనా?

 కవిత  కొత్త పార్టీ  బీఆర్ఎస్  ఓటు బ్యాంకును  చీల్చే అవకాశాలే ఎక్కువ.  ఇది  పరోక్షంగా  కాంగ్రెస్  లేదా బీజేపీ వంటి ఇతర పార్టీలకు లాభం చేకూరుస్తుందని భావించే  బీఆర్ఎస్  కార్యకర్తలు ఆమెవైపు  మొగ్గు చూపడానికి  వెనుకాడవచ్చు.  కానీ,  ఒక మహిళగా,  తన  సొంత  కుటుంబంలోనే  వివక్షకు గురయ్యారని  లేదా  కష్టకాలంలో (ఉదాహరణకు  లిక్కర్ స్కామ్  కేసు సమయంలో) పార్టీ  తనను  వదిలేసిందని  ప్రజలు  భావిస్తే సానుభూతివచ్చే  అవకాశం  ఉంది.   రాష్ట్రంకోసం  కష్టపడితే,  చివరకు  రాజకీయ వారసత్వం  విషయంలో  తనను  పక్కనపెట్టి అన్న  కేటీఆర్,  బావ  హరీశ్ రావుకు ప్రాధాన్యత  ఇచ్చారు అనే పాయింట్‌‌‌‌‌‌‌‌ను  ఆమె  బలంగా  ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే  సానుభూతి ఓట్లు పడే అవకాశం ఉంది.  అయితే,  కేసీఆర్  ఇమేజ్‌‌‌‌‌‌‌‌ను  తట్టుకుని  నిలబడాలంటే  కేవలం 'సానుభూతి' సరిపోదు.  బలమైన రాజకీయ అజెండా,  క్షేత్రస్థాయిలో  కేడర్,  ఆర్థికబలం  తోడైతేనే  ఆమె  ప్రభావం  చూపగలరు.  లేదంటే  ఇది కేవలం  బీఆర్ఎస్  పార్టీని  బలహీనపరిచే  ఒక  పరిణామంగానే  మిగిలిపోతుంది. 

వారసత్వం వరమా? శాపమా?

కేసీఆర్  కుమార్తెగా  రాజకీయాల్లోకి  రావడం  కవితకు  ఒక పెద్ద  'లాంచ్ ప్యాడ్'ను  ఇచ్చింది.  తండ్రి పేరుతో  సులువుగా పార్టీ  కార్యక్రమాల్లోకి..  అక్కడి నుంచి  ప్రజల్లోకి వెళ్లడం,  తెలంగాణ  జాగృతి  ద్వారా  సాంస్కృతిక ముద్ర వేయడం ఆమెకు  వారసత్వం వల్ల  దక్కిన వరం.  అయితే,  అదే  వారసత్వం  ఆమెను  ఒక 'షాడో' (నీడ)లో  ఉంచేసిందనడంలో   ఎలాంటి  సందేహం లేదు.  ఆమె ఎంత కష్టపడినా అది  కేసీఆర్  ఖాతాలోకివెళ్లిందే తప్ప,  ఆమె వ్యక్తిగత  ప్రతిభగా  గుర్తింపు పొందలేదు.  దీంతో  వారసత్వం  కవితకు  ఒక  రక్షణ కవచంలా ఉంటూనే,  ఆమె  ఎదుగుదలకు  ఒక పరిమితిని  విధించింది.  కుటుంబ పార్టీల్లో  ప్రతి ఒక్కరూ  తనకంటూ  ఒక  ప్రత్యేక  రాజకీయ అస్తిత్వం  ఉండాలని  కోరుకోవడం  సహజం.  అయితే,   కేసీఆర్  అంతర్లీనంగా  కేటీఆర్​ను  వారసుడిగా  ప్రొజెక్ట్  చేయడం వల్ల  పార్టీలో  కవిత  ప్రాధాన్యత  తగ్గిందనే వాదన ఉంది.  ఈ నేపథ్యంలో  కవిత వారసత్వాన్ని వదులుకుని సొంత  అస్తిత్వం కోసం  బయటకురావడం అంటే  కత్తి మీద సాము లాంటిదే.  

కవిత ముందున్న  సవాళ్లు

కవిత  ఎంతవరకు బీఆర్ఎస్​ క్యాడర్‌‌‌‌‌‌‌‌ను  తనవైపు తిప్పుకోగలరు?  ఆమె 'జాగృతి'  నాయకత్వం  ఒక రాజకీయ శక్తిగా  మారుతుందా?   ‘కేసీఆర్  కూతురు’ అనే గుర్తింపును దాటి,   నాయకురాలు ‘కవిత’  అనే  ఒక  రాజకీయ  ప్రత్యామ్నాయంగా  ప్రజలు  ఆమెను  అంగీకరిస్తారా?  ఆమె  వారసత్వాన్ని  వదులుకుంటే 'బలం' తగ్గుతుంది.   కానీ,  అస్తిత్వాన్ని  చాటుకుంటే  'గౌరవం'  పెరుగుతుంది.  ఈ  రెండింటి  మధ్య  సమతుల్యత  సాధించడంపైనే  ఆమె  రాజకీయ  భవిష్యత్తు  ఆధారపడి  ఉంటుంది.  కవిత.. బీఆర్ఎస్  నుంచి  బయటకువచ్చి కొత్త పార్టీ పెట్టడం  కేవలం కుటుంబ  రాజకీయాల్లో  భాగమా?  లేదా  నిజమైన  ప్రత్యామ్నాయమా?  అనే ప్రశ్న  ప్రజల్లో  తలెత్తవచ్చు.  ఇప్పటికే   రాష్ట్రంలో  కాంగ్రెస్  బలంగా ఉండటం,  బీజేపీ నెమ్మదిగా పుంజుకోవడం,  మరోవైపు  బీఆర్ఎస్​కూ   పటిష్టమైన కేడర్  ఉండటంతో..  క్షేత్రస్థాయిలో బలమైన నాయకులను,  కార్యకర్తలను  ఆకర్షించడం  అంత  సులభమేమి కాదు.  ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు  తన పార్టీ ఏవిధంగా భిన్నమైనదో  కవిత  నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. 

- జి. రమేశ్​బాబు
సీనియర్​ జర్నలిస్ట్​

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.