V6 News

వెలుగు ఓపెన్ పేజీ : పేదల జీవితాల్లో ఇందిరమ్మ ఇండ్ల సంబురం

 వెలుగు ఓపెన్ పేజీ :  పేదల జీవితాల్లో ఇందిరమ్మ ఇండ్ల సంబురం

తెలంగాణ గృహ నిర్మాణ శాఖలో  ఏడాదిలోనే  ప్రభుత్వం  సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ​తెలంగాణ సామాజిక ముఖచిత్రంలో 'సొంతింటి కల' అనేది ఒక –భావోద్వేగమైన అంశం.  నిరుపేదల ఆశలకు ఊపిరి పోస్తూ,  చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల  పథకం  ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కొత్త  వెలుగులు నింపుతోంది.   కేవలం  ఒకే  ఏడాదిలో  లక్షన్నర  ఇళ్ల నిర్మాణం పూర్తి కావడం అనేది ప్రభుత్వ చిత్తశుద్ధికి, యంత్రాంగం పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.  ​గత  పాలకుల హయాంలో ఎదుర్కొన్న అడ్డంకులను అధిగమిస్తూ, ప్రస్తుత  ప్రభుత్వం 5 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేదలకు  అందచేయాలని నిర్ణయించింది.  తొలి దశలో  సొంత జాగా ఉన్న పేదవాళ్లకు 100 శాతం సబ్సిడీతో  రూ. 5 లక్షలు  ఆర్థికసాయం చేస్తోంది.  ఇందులో భాగంగా  గత  ఆర్థిక సంవత్సరంలో  నియోజకవర్గానికి 3500  ఇళ్ల చొప్పున  రాష్ర్టవ్యాప్తంగా 3,25,301 ఇళ్లను మంజూరు చేసింది.  

ఏడాది కాలంలోనే  1,50,000  ఇళ్ల  నిర్మాణం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గత ఏడాది ఫిబ్రవరి 21న  నారాయణ పేట జిల్లా అప్పక్కపల్లిలో తొలి ఇందిరమ్మ ఇంటికి శంకుస్థాపన చేశారు.  ఇప్పటివరకు హౌసింగ్ అధికారుల లెక్కల ప్రకారం 2 లక్షల 75 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా 25 వేల ఇందిరమ్మ  ఇళ్లు  గృహ ప్రవేశాలు పూర్తి అయ్యాయి.  మరో లక్షన్నర ఇళ్లు  స్లాబ్ పూర్తి అయి ఓపెనింగ్​కు  రెడీ ఉన్నాయి.   జూన్ 2  నాటికి నిర్మాణంలో ఉన్న మరో లక్ష  ఇళ్లను పూర్తి చేసే దిశగా శరవేగంగా పనులు  జరుగుతున్నాయి.   ఇప్పటివరకు  లబ్ధిదారులకు  రూ. 6 వేల కోట్లను  వివిధ దశల సాయం కింద  ప్రభుత్వం  నేరుగా వారి  బ్యాంక్ ఖాతాలకు  బదిలీ చేసింది.  ఏడాదికాలంలోనే  1,50,000  ఇళ్ల  నిర్మాణం  పూర్తి కావడం సామాన్యమైన  విషయం కాదు.  ఇది ప్రభుత్వ పర్యవేక్షణకు, యంత్రాంగం పనితీరుకు అద్దం పడుతోంది.  ​దళారీల ప్రమేయం లేకుండా  నేరుగా నగదు బదిలీ జరగడం వల్ల పేదలకు  పూర్తిస్థాయి ప్రయోజనం చేకూరింది.  స్థానిక కూలీలకు, నిర్మాణ రంగానికి అనుబంధంగా  ఉండే  వృత్తులవారికి  ఉపాధి లభించింది. లబ్ధిదారుడికి  తన  ఇల్లు  ఎలా  ఉండాలో నిర్ణయించుకునే  స్వేచ్ఛ లభించింది.  400 నుంచి 600  ఎస్​ఎఫ్​టీ  విస్తీర్ణంలో  ఇళ్లు  నిర్మించుకోవాలని  ప్రభుత్వం  రూల్స్  ఖరారు  చేసింది.   నిర్మాణంలో  నాణ్యత  పెరిగింది.  అవినీతికి తావులేకుండా  నిధులు  సద్వినియోగం అవుతున్నాయి.  లక్షన్నర ఇళ్ల  నిర్మాణం  వెనుక భారీ ఆర్థిక చక్రం ఉంది.  6 వేల కోట్ల రూపాయల  వ్యయం గ్రామాల్లో పంపిణీ కావడం వల్ల స్థానిక మేస్త్రీలు, కూలీలు, హార్డ్‌‌‌‌‌‌‌‌వేర్ వ్యాపారులు, రవాణా రంగం వారికి ఉపాధి లభించింది. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఒక 'బూస్టర్ డోస్' లా పనిచేసింది.

​సొంతిల్లు సామాజిక హోదా

​సొంత ఇంటి కల అనేది  ఆర్థిక భద్రతతోపాటు సామాజిక హోదాను కూడా ఇస్తుంది.    రాబోయే కాలంలో  అర్హులైన  ప్రతి  ఒక్కరికీ  ఈ ఫలాలు అందేలా  పారదర్శకమైన  విధానాన్ని కొనసాగించడమే  పాలకుల ముందున్న ప్రధాన బాధ్యత.​   తెలంగాణలో  ఇందిరమ్మ ఇళ్ల  నిర్మాణం ఒక యజ్ఞంలా సాగుతోంది.  లక్షన్నర  ఇళ్ల పూర్తి కేవలం ప్రారంభం మాత్రమే.  రాబోయే రోజుల్లో ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు  నిర్మించి  ఇవ్వడమే లక్ష్యంగా  ప్రభుత్వం సాగాలి.  నిధుల విడుదల,  పారదర్శకత,  వేగం.. ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ సాగితే,  తెలంగాణలో ఇల్లు లేని కుటుంబం ఉండదు.   గత 10 ఏళ్లలో  డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, పంపిణీలో అధికార పార్టీ కార్యకర్తలకు, అనర్హులకు ఇళ్ల కేటాయింపు, నాణ్యత లేకుండా  ఇళ్ల  నిర్మాణం,  ఇళ్ల నిర్మాణం  పూర్తి అయిన లబ్ధిదారులకు  పంపిణీ  చేయకుండా ఏళ్లపాటు ఖాళీగా ఉంచటం ఇలా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి.  ఈ సమస్యలను  కాంగ్రెస్​  ప్రభుత్వం ఇపుడు  పరిష్కరిస్తోంది. 

జీ ప్లస్ 3 తరహాలో ఇందిరమ్మ టవర్లు

ఇందిరమ్మ  ఇళ్లకే  పరిమితం  కాకుండా  గత  ప్రభుత్వంలో  పనులు పూర్తికాని  ఇళ్లను  పూర్తిచేస్తూ వారికి ఇళ్లను  కేటాయించనుంది.   పూర్తయిన ఇళ్లలో  నీళ్లు, లిఫ్ట్,  కరెంట్,  స్కూల్, అంబులెన్స్ ఇలా అన్ని మౌలిక వసతులను కల్పిస్తోంది.  ఇందుకు వందల కోట్లు ఖర్చు చేస్తోంది.  వీటితోపాటు  డబుల్  బెడ్ రూమ్ ఇల్లు తీసుకొని  అందులో ఉండని వాళ్లకు నోటీసులు ఇస్తోంది.  ఉండకపోతే రద్దు చేసి ఇళ్లు లేని పేదలకు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది.  కొన్ని వేలమందికి డబుల్ ఇళ్లు అందచేయనుంది.  వీటితోపాటు  గ్రేటర్​లో  స్థలాల కొరత ఉన్నందున  జీ ప్లస్ 3  తరహాలో  ఇందిరమ్మ టవర్లను నిర్మించాలని నిర్ణయించింది.  హైదరాబాద్,  రంగారెడ్డి,  మేడ్చల్  పరిధిలో  సొంత జాగా  ఉన్న  సుమారు  30 వేల మందికి    ఇందిరమ్మ ఇళ్ల  మంజూరు  పత్రాలను  త్వరలో  అందజేయనుంది.  

- జి. శ్రీకాంత్ రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్