V6 News

వెలుగు ఓపెన్ పేజీ : అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా డంపింగ్ యార్డులు

వెలుగు ఓపెన్ పేజీ : అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా డంపింగ్ యార్డులు

హైదరాబాద్ సహా శివారు ప్రాంతాలలో అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా డంపింగ్ యార్డులు కనిపిస్తున్నాయి. ఫలితంగా పర్యావరణానికి విఘాతం,  ప్రజారోగ్యం దెబ్బతింటోంది. ఇవన్నీ జీవనానికి సవాళ్లుగా  మారుతున్నాయి. ఓ వైపు జనాభా పెరిగిపోతోంది.  పట్టణీకరణ మూలంగా చెత్త నానాటికీ భారీగా పేరుకుపోయి  గుట్టలుగా ఏర్పడుతున్నాయి.  దీని నిర్వహణ అధికారులకు అతి పెద్ద సమస్యగా మారింది.  హైద రాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డు ప్రపంచ గుర్తింపు పొందింది.  ఇక్కడ  రోజుకు సుమారు 7 వేల నుంచి 8 వేల టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇది దాదాపు 450 ఎకరాల విస్తీర్ణంలో చెత్త పెద్ద కొండలా పేరుకుపోయింది. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద కాలుష్య కారక మిథేన్ ఉద్గార కేంద్రంగా గుర్తింపు తెచ్చుకుని ప్రజల ఆరోగ్యం, పర్యావరణం మీద గట్టి సవాలు  విసురుతోంది. ఈ డంపింగ్ యార్డు కారణంగా జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం తదితర ప్రాంతాల్లోని సుమారు 20 లక్షల మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

  జిల్లాల్లో  పరిస్థితి కూడా చెప్పుకోదగ్గ మంచి స్థాయిలో లేదు.  కరీంనగర్,  హన్మకొండ ఇతర పట్టణాల్లో డంపింగ్ యార్డులు కొండల మాదిరిగా కనిపిస్తున్నాయి. స్థానికులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. పచ్చని చెట్లు ఎక్కడా కనిపించడం లేదు. ఇక్కడి డంపింగ్ యార్డును మరో చోటుకు తరలించాలన్న ప్రజల విజ్ఞప్తిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎన్నో ఏళ్లుగా వేడుకుంటున్నా సమస్య పరిష్కారం కావడం లేదు.  కరీంనగర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందినా డంపింగ్ యార్డు ప్రధాన సమస్యగా మారింది. మానేరును  ఆనుకుని డంపింగ్ యార్డు ఉంది. చెత్త పేరుకుపోయింది. దీన్ని తొలగించడానికి 16 కోట్ల రూపాయలతో చేపట్టిన బయో మైనింగ్ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి. పనులు నిలిచి పోయాయి. ఎండ వేడి కారణంగా డంపింగ్ యార్డులో ఉన్నట్టుండి మంటలు వ్యాపిస్తున్నాయి.. సమీప కాలనీ వాసులకు  ఇబ్బందులు తప్పడం లేదు.  ఈ చెత్త కొండల నుంచి విముక్తి పొందాలంటే అందరూ చేతులు కలిపి ముందుకు సాగాలి. పబ్లిక్  ప్రదేశాల్లో చెత్త వేసేవారికి భారీ జరిమానాలు విధించాలి. పారిశ్రామిక వ్యర్థాలను డంపింగ్ యార్డుల్లో కలవకుండా,  కలపకుండా  కఠిన చర్యలు  తీసుకోవాలి. 

- జి.యోగేశ్వర రావు, జర్నలిస్ట్