V6 News

ఇరాన్ స్పీడ్ బోట్లు చిల్లర నౌకలు: నౌకల సీజ్ పై ట్రంప్ సెటైర్లు

ఇరాన్ స్పీడ్ బోట్లు చిల్లర నౌకలు: నౌకల సీజ్ పై ట్రంప్ సెటైర్లు
  • మా మిత్ర దేశాలకే మినహాయింపు
  • హార్మూజ్ వద్ద ట్రాన్సిట్ ఫీజుపై ఇరాన్ ప్రకటన

టెహ్రాన్: యుద్ధం నేపథ్యంలో  హార్మూజ్ జలమార్గాన్ని ఉపయోగించే తమ శత్రుదేశాల నౌకలపై సుంకాలు విధించాలని  ఇరాన్ యోచిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఎమ్ఎస్సీ ఫ్రాన్సిస్కా, ఎపామినోండాస్ అనే రెండు భారీ సరుకు రవాణా నౌకలను స్వాధీనం చేసుకుంది. ముసుగులు ధరించిన ఇరాన్ కమాండోలు స్పీడ్‌‌బోట్‌‌ల ద్వారా వెళ్లి.. తాడు, నిచ్చెనల సాయంతో నౌకలపైకి ఎక్కిన వీడియోలను ఇరాన్ స్టేట్ టెలివిజన్ విడుదల చేసింది. పర్మిషన్ డాక్యుమెంట్లు లేకుండా జలసంధిని దాటేందుకు ప్రయత్నించడం వల్లే ఈ రెండు నౌకలను సీజ్ చేసినట్లు ఇరాన్ సమర్థించుకుంది. 

అయితే, ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ నౌకలు యుద్ధం చేసే నౌకలు కాదని.. అవి అతితెలివి ప్రదర్శిస్తున్న చిన్న నౌకలని ఎద్దేవా చేశారు. ఇరాన్ నాయకత్వం తీవ్ర గందరగోళంలో ఉందని వ్యాఖ్యానించారు. తాము చర్చలకు సిద్ధమేనని, ఒకవేళ ఇరాన్ మొండిగా వ్యవహరిస్తే సైనిక చర్య ద్వారా వివాదానికి ముగింపు పలుకుతానని ట్రంప్ హెచ్చరించారు.

మరోవైపు హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే తన మిత్ర దేశాల నౌకలకు ట్రాన్సిట్ ఫీజు(రవాణా రుసుము) నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఈ విషయాన్ని రష్యాలోని ఇరాన్ రాయబారి కాజెమ్ జలాలీ ధ్రువీకరించారు. రష్యా వంటి తమ మిత్ర దేశాలకు ట్రాన్సిట్ ఫీజు మినహాయింపులు వర్తింపజేసేలా కసరత్తు జరుగుతున్నదని జలాలీ తెలిపారు. ఇప్పటికే కొన్ని దేశాలకు మినహాయింపులు ఇచ్చామని.. భవిష్యత్తు నిర్ణయాల గురించి ఇప్పుడే చెప్పలేమన్నారు. ఫీజు మినహాయింపులో ఏ దేశాలు చేర్చారో స్పష్టంగా తెలియడం లేదు.