- రూ.2-3 వేలకు అమ్ముతున్నరు
జీడిమెట్ల, వెలుగు: డూప్లికేట్ కీలతో బైక్ దొంగతనాలు చేస్తున్న ఇద్దరితోపాటు వాటిని కొనుగోలు చేస్తున్న మరో ఇద్దరిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి శుక్రవారం వెల్లడించారు. మెదక్ జిల్లా రాజపేటకు చెందిన బి.నవీన్ కొంపల్లిలో నివాసముంటున్నాడు.
మహబూబాబాద్‌కు జిల్లా మద్దూర్‌కు చెందిన టి.శ్రీనివాస్ పేట్బషీరాబాద్లో ఉంటున్నాడు. వీరిద్దరూ ఫ్రెండ్స్ కావడంతో జల్సాల కోసం బైక్దొంగతనాలను ఎంచుకున్నారు. డూబ్లికేట్కీలతో నగరంలో బైకులు దొంగలించి, రూ.2 వేలు, రూ.3 వేలకు మెదక్ జిల్లాలోని రాజపేటకు చెందిన ఎం.రమేశ్, ఎం. శ్రీకాంత్‌కు అమ్మేవారు. వారు ఎక్కువ రేటుకు ఇతరులకు ఇచ్చేవారు.
ఇటీవల దుండిగల్ పరిధిలో జరిగిన ఓ దొంగతనంపై పోలీసులు కేసు నమోదు చేసి, సుమారు 200 సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.12 లక్షల విలువైన 24 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై సైబరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం 24 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

