నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : నాగర్ కర్నూల్ మార్కెట్ యార్డ్ లో మొక్కజొన్న రైతులకు వెంటనే గన్ని బ్యాగులు ఇవ్వాలని మార్కెట్ యార్డ్ సెక్రటరీ రవికుమార్ ను ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేశ్ రెడ్డి ఆదేశించారు. నాగర్‌కర్నూల్ మున్సిపల్ పరిధిలోని నెలికొండ చౌరస్తా వద్ద గన్ని బ్యాగుల కొరతను నిరసిస్తూ శుక్రవారం మొక్కజొన్న రైతులు నిర్వహించిన రాస్తారోకోకు స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి హాజరై సమస్యను పరిష్కరించారు.
గత పది రోజులుగా గన్ని బ్యాగులు అందక మార్కెట్ యార్డ్ లోనే పడిగాపులు కాస్తున్నామని, తమను పట్టించుకునే వారే కరువయ్యారని రైతులు ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల గోడును విన్న ఎమ్మెల్యే వెంటనే మార్కెట్ యార్డ్ సెక్రటరీ రవికుమార్‌తో మాట్లాడి, గన్ని బ్యాగుల సమస్యను తక్షణమే పరిష్కరించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. దీంతో శాంతించిన రైతులు తమ ఆందోళనను విరమించారు.

