V6 News

వెలుగు ఓపెన్ పేజీ : దాదాగిరి గండం దాటితే.. దీదీయే.!

వెలుగు ఓపెన్ పేజీ :  దాదాగిరి గండం దాటితే.. దీదీయే.!

 దేశవ్యాప్తంగా  ఆసక్తిని  రేపుతున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల యుద్ధం సగం ముగిసింది.  మిగిలిన సగానికి మరో నాలుగు రోజుల సమయముంది.  గురువారం ముగిసిన తొలి విడతలో అసాధారణ భారీ పోలింగ్ జరగటంతో  కొత్త కొత్త కథనాలు (న్యారెటివ్స్)  ప్రచారంలోకి  వస్తున్నాయి. ‘భారీ పోలింగ్  పాలక పక్షానికి వ్యతిరేకంగా  ప్రజల ఉత్సాహానికి సంకేతం’ అని ఒకరంటే,  ‘కాదు,  కాదు..  సీఎం  మమతా బెనర్జీపై  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం  తెస్తున్న  ప్రత్యక్ష ఒత్తిడి,  పరోక్ష దాడికి  వ్యతిరేకంగా  ఇది  ప్రజల  నిరసనకు  నిదర్శనం’అని  ప్రత్యర్థుల ప్రచారం.  భారీ పోలింగ్‌‌‌‌‌‌‌‌కు  వేర్వేరు  కారణాలున్నట్టే  బెంగాల్ ఎన్నికల  ఫలితాలను  ప్రభావితం చేస్తున్న అంశాల్లోనూ  ఎంతో  వైవిధ్యం ఉంది.  రాజకీయాల లోతులు తెలియనివారు ‘పై మెరుగులు’ను బట్టి  వ్యాఖ్యలు చేస్తున్నారు.  గత ఎన్నికల చరిత్ర  గణాంకాలదొక  కథ.  ప్రస్తుత వాస్తవాలది ఇంకో కథ !  బెంగాలీలకు  ‘దీదీ’ పట్ల  ఎంత  మక్కువ  ఉందో  ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్  ‘దాదాగిరి’  పట్ల  అంత  వ్యతిరేకత ఉంది.  నిర్మాణాత్మక  ఆధిపత్యం,  సంస్థాగత నూతన అన్వయాలు,  ఓటరు తత్వం అన్నీ కలగలసిన  ఘర్షణ నుంచి  ఫలితం  పుట్టాల్సిందే!   రేపటి  ఫలితాలు.. వచ్చే  ప్రభుత్వాన్నే కాదు,  పశ్చిమ బెంగాల్ రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి.

ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ  నేతృత్వంలోని  టీఎంసీతో  పోరాటాన్ని బీజేపీ  నాయకత్వం  చావో, రేవో  స్థితికి తెచ్చింది.  నువ్వా- నేనా అన్నట్టు సాగిన పోరుకు  తొలివిడత  పోలింగ్ అద్దం పట్టింది. ‘సర్‌‌‌‌‌‌‌‌‘ పుట్టించిన  ఆందోళనో,  ఒకసారి వేయకుంటే  ‘ఓటు పోతుంది’అనే  భయమో  భారీ  పోలింగ్ నమోదైంది.   బెంగాల్  మొత్తంగా  క్షేత్ర పరిస్థితులు పరిశీలిస్తే రాజకీయ  వాతావరణం అధికార  టీఎంసీకి  అనుకూలంగా  ఉన్నట్టు  స్పష్టమవుతోంది.  తొలివిడత  పోలింగ్  జరిగిన 152/294  స్థానాల్లో  బీజేపికి  ఆశలు ఎక్కువ ఉన్నాయి.  ఇందుకు,  కిందటి ఎన్నికల్లో  బీజేపీ  గెలిచిన 77లో 59  ఇక్కడి నుంచే  కావడం ఓ కారణం.   రెండు విడతల్లోనూ  ముస్లిం,  మహిళా ఓట్లు  మమత బలమైతే,  ఆమె -పార్టీ  దాదాగిరి  బలహీనత.  

మైదాన సమతూకం లేదు

తృణమూల్ కాంగ్రెస్ 294 నియోజకవర్గాలకు  పోటీపడుతుండగా  ప్రధాన ప్రతిపక్షం బీజేపీ 200 నియోజకవర్గాల్లోనే  పోటీపడుతోంది.  టీఎంసీ  వంద మార్కులకు  పరీక్ష రాస్తుంటే  బీజేపీ  కేవలం 65 మార్కులకు మాత్రమే పరీక్ష రాస్తున్నట్టు లెక్క. గత  మూడు  ఎన్నికల  ఫలితాలను బట్టి  దాదాపు  90 నియోజకవర్గాల్లో  టీఎంసీని  ఓడించే శక్తి  ఏ రాజకీయ పార్టీకి లేదు.  ఈ  సమీకరణం ప్రకారం బీజేపీ 204 నియోజకవర్గాల్లో  75 శాతం స్ట్రైక్ రేటుతో  గెలుపొందితే  అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది.  బీజేపీకి  గరిష్టంగా  నమోదైంది 2019 లోకసభ ఎన్నికల్లో 121 అసెంబ్లీ  సీట్లలో   ఆధిక్యతే!   మళ్లీ ఆధిక్యత 2021 (77), 2024 (90)కి తగ్గింది.  2021 ఎన్నికలతో  పోలిస్తే  బీజేపీ  వ్యూహాత్మకంగా,  ఎటువంటి  ఆర్భాటాలు లేకుండా  చాపకింద  నీరులా  పనిచేస్తోంది.  బీజేపీ సిద్ధాంత మాతృక అయిన  ఆర్​ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్,   దాని  అనుబంధ  విభాగాలు ఆరు నెలలుగా  క్షేత్రస్థాయిలో  ముమ్మరంగా పనిచేస్తున్నాయి. ఈసారి బీజేపీ  ఆచితూచి  వ్యవహరించి  స్థానిక శక్తుల్ని  బలోపేతం చేసింది.  ఎన్నికల  అనంతరం దాడులు,  కక్ష సాధింపులు  ఉండవచ్చని  గత  చరిత్ర చెబుతోంది.  దీన్ని దృష్టిలో పెట్టుకొని  బీజేపీలో  భరోసా  నింపేందుకు  వ్యూహాత్మకంగా  కేంద్ర  బలగాలను  రంగంలోకి  దింపింది.  

పాతుకుపోవడం ఒక బలం

స్వాతంత్య్రానంతరం  బెంగాల్ రాజకీయాలను  పరిశీలిస్తే  అక్కడ  ప్రజలు..  మొదటి దశలో  కాంగ్రెస్  పార్టీకి  దాదాపు  25 ఏళ్లపాటు  అధికారమిస్తే,  ఆ తర్వాత  కమ్యూనిస్టు పార్టీలకు 35 ఏళ్ల పాటు  అధికారం  కట్టబెట్టారు.  ఆ  ఒరవడిలోనే  టీఎంసీకి  కూడా  నాలుగో  దఫా  అధికారం  కట్టబెట్టే  అవకాశాలున్నాయని  పరిస్థితులు  చెబుతున్నాయి.  దీనికితోడు,  మమతా బెనర్జీకి  సరితూగే  నాయకులు  బీజేపీలోకానీ, ఇతర పక్షాల్లో కానీ   లేకపోవడం  టీఎంసీకి  కలిసి వస్తోంది.  రాష్ట్రంలో ముస్లిం ఓట్లలో  చీలిక  తెచ్చేందుకు  మజ్లిస్ పార్టీతో  సహా  ఇతర  ముస్లిం పార్టీలను బరిలోకి  దింపేందుకు  బీజేపీ  ప్రయత్నించిందని అభియోగాలు. సదరు యత్నం  బెడిసికొట్టడంతో  ముస్లిం ఓట్లపై  టీఎంసీలో  భరోసా  నెలకొంది.  దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు,  కాంగ్రెస్ పార్టీ నాయకులు,  కార్యకర్తలు  బీజేపీపై  
ఒంటికాలిపై  లేస్తుంటే  పశ్చిమబెంగాల్‌‌‌‌‌‌‌‌లో మాత్రం ఈ రెండు పార్టీలు  బీజేపీకి ‘బీ’ టీంలుగా  వ్యవహరిస్తున్నట్లు  జరిగే  ప్రచారం  గమనించాల్సిన అంశం.

అంత కోపం ఉందా?

సర్​ తదితర విషయాలు పక్కన పెడితే రాష్ట్ర  ప్రజలు  మమతా  బెనర్జీకి  మరొక్క అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా?  లేదా?  అన్నది  ప్రశ్న.  క్షేత్ర పరిస్థితుల్ని  పీపుల్స్ పల్స్ బృందం అధ్యయనం చేసినప్పుడు, స్థానిక  టీఎంసీ  నాయకులపై  వ్యతిరేకత ఉన్నా,  మమతా  బెనర్జీపై  ప్రజలకు  అంత  ఆగ్రహం లేదని  తెలుస్తోంది.  దేశంలోని  రెండో  అత్యధిక  ఎస్సీ జనాభా ఉన్న  పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌లో  గత  ఎన్నికల్లో  రిజర్వుడు స్థానాల్లో  బీజేపీ టీఎంసీ  మధ్య  పోటాపోటీ  జరిగింది.  దీన్ని దృష్టిలో  పెట్టుకొని  ఈసారి  టీఎంసీ  ఈ  స్థానాలపై   ప్రత్యేక దృష్టిపెట్టి  ‘తపశీలార్ సంగల్ప’ పేరిట  నెల రోజులపాటు ఆ నియోజకవర్గాల్లో  ప్రత్యేకంగా పర్యటించి,  వారికి  టీఎంసీ ఏం చేసింది,  బీజేపీ  ఎలా  మోసం చేసింది అనే విషయాలపై  ప్రచారం చేయడం టీఎంసీకి  కలిసొస్తుంది.

‘సర్’ మేలెంత?  కీడెంత ?

ఓటర్  జాబితాల  ప్రత్యేక సవరణ (సర్) పేరిట  ఓట్ల  తొలగింపు... కారణంగా  టీఎంసీ  నష్టపోతుందని  రాజకీయ  పరిశీలకులు  భావిస్తున్నారు.   ‘సర్’  కారణంగా  టీఎంసీ  కొంత  నష్టపోతుందనే వాదనలో  సందేహం లేకపోవచ్చు.  అయితే  అధికారం కోల్పోయేలా  నష్టపోతుందా అనేదే  ప్రశ్న.  2021 ఎన్నికల్లో  రాష్ట్రవ్యాప్తంగా  టీఎంసీకి 2.89 కోట్ల ఓట్లు  పడితే  ప్రత్యర్థి  బీజేపీకి  2.29 కోట్ల  ఓట్లు పడ్డాయి.   తేడా 60 లక్షల ఓట్లు కాగా,  ‘సర్’తో  దాదాపు  90 లక్షల  ఓట్లు  తొలగిపోయాయి.  సర్  ప్రక్రియ  టీఎంసీకి  మేలు చేయొచ్చనే  భావనా ఉంది.  బిహార్ ఎన్నికలు ముగిసిన తర్వాత శాస్త్రీయంగా అధ్యయనం చేసినప్పుడు  ‘సర్’  కారణంగా,  ఓట్ల తొలగింపు అధికంగా ఉన్న  నియోజకవర్గాల్లో  బీజేపీనే  ఎక్కువ  నష్టపోయినట్టు  వెల్లడైంది.  భారీ  మెజార్టీతో  ఎన్డీఏ  బిహార్‌‌‌‌‌‌‌‌లో అధికారంలోకి  వచ్చినా  ఓట్లు తొలగింపు,  సర్  కారణంగా  ఎందుకు  సదరు  నియోజకవర్గాల్లో ఓటమి చెందిందని మరింత  లోతుగా  అధ్యయనం  చేయాల్సిన  అవసరం ఉంది. 

మార్పు తెచ్చే మార్పేంటి ?

టీఎంసీ  అధినేత్రి  మమతా బెనర్జీ  ప్రస్తుత  ఎన్నికల్లో  సిట్టింగ్  ఎమ్మెల్యేలతోపాటు,  2021  ఎన్నికల్లో  పోటీచేసి ఓడిపోయిన అభ్యర్థులతో  కలిపి  మొత్తం 159 చోట్ల  అభ్యర్థులను మార్చారు. దాని ప్రభావమెంత? రాష్ట్రంలో 35 శాతంపైగా  ముస్లిం జనాభా ఉన్న అసెంబ్లీ సీట్లు 89 కాగా,  25 శాతంపైగా  ముస్లింలున్న   స్థానాలను  కలుపుకుంటే మొత్తం 112 చోట్ల ముస్లింలు కీలకం. తొలి విడతలో  ముస్లిం ఓటర్లు పెద్దసంఖ్యలో  పోలింగ్​లో  పాల్గొన్నారు. ‘ఓటు వేశాం,  మేం  భారతీయులమే  తప్ప బంగ్లాదేశ్ వాళ్ళంకాము’ అంటూ  వేలిపై  సిరాచుక్కతో  ఫొటోలు  వాట్సాప్​లలో  సర్క్యులేట్  చేశారు.  ‘గరెబెటా’ స్థానంలోని  238  పోలింగ్ కేంద్రంలో 536  ఓట్లుంటే, ముగ్గురు తప్ప 533 మంది (ఇందులో 415 మంది ముస్లింలు) ఓటు వేశారు.  ఏమైనా అధికారంలోకి రావాలనే  ఏకైక లక్ష్యంతో  బీజేపీ కేంద్ర నాయకత్వం పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌‌‌పై  ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని అస్త్రాలను ప్రయోగిస్తోంది.  రాజకీయ జీవన్మరణ సమస్యలా మమతా బెనర్జీ  పోరాడారు.  ఫైర్ బ్రాండ్​గా  పేరున్న మమతది  నిజానికి  ‘వీధి పోరాటాల’కు వెరవని తత్వం.  బీజేపీ అగ్రనేతలైన ప్రధాని మోదీ,  హోంమంత్రి అమిత్ షాలకు ఏమాత్రం  తీసిపోకుండా,  పోరాటాన్ని కడవరకు కొనసాగించే పట్టుదల మనిషి!  సర్ ప్రక్రియ, ఐ ప్యాక్ సంస్థ వ్యక్తులపై ఈడీ దాడులు వంటివి జరిగినా చివరికి ఎన్నికల్లో గెలుపే కీలకం. అందుకే,  గెలిచినోళ్లు మొనగాళ్లు (జో  జీతా వహీ సికందర్ ) అంటారు.  మిగతా  సగం పోరు పూర్తయ్యాకగాని  యుద్ధం ముగియదు,  విజేత  తేలరు. అప్పటివరకు రాజకీయ కథ‌‌‌‌‌‌‌‌నాలు, క్షేత్రస్థాయి వాస్తవాలకు నడుమ సంఘర్షణ జరగాల్సిందే! 

- దిలీప్ రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్,
 పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ డైరెక్టర్