అంబానీ, కుటుంబ సభ్యులకు Z+ భద్రత : సుప్రీం

అంబానీ,  కుటుంబ సభ్యులకు Z+ భద్రత : సుప్రీం

ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ భద్రతపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముకేశ్‌ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అత్యున్నత Z+ భద్రత కల్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే ఈ సెక్యూరిటీకి సంబంధించిన ఖర్చులన్నీ కూడా అంబానీనే భరించాలని స్పష్టం చేసింది. న్యాయమూర్తులు కృష్ణ మురారి, అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు అంబానీ సెక్యూరిటీపై త్రిపురకు చెందిన ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. అంబానీ కుటుంబానికి భద్రత కేవలం మహారాష్ట్రకై పరిమితమా? లేక దేశ విదేశాల్లోనూ అమలు చేస్తారా? అన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ అహ్సానుద్దీన్ అమానుల్లాలతో కూడిన ధర్మాసనం.. ముకేశ్‌ అంబానీ ఇండియాలో ఉన్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత కల్పిస్తుందని పేర్కొంది. ఇక విదేశాలకు వెళ్లినప్పుడు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రతా ఏర్పాట్లను కల్పించాలని సుప్రీం సూచించింది.