- ఎంపీ వంశీకృష్ణకు కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: అంబేద్కర్ ఫొటోను కరెన్సీ నోట్లపై ముద్రించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో సహకరించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జెరిపోతుల పరశురాం కోరారు. గురువారం ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో ఎంపీని పరశురాం కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా పరశురాం మాట్లాడుతూ ఆర్బీఐ ఏర్పాటు, రాజ్యాంగం రచనలో అంబేద్కర్ కృషి, త్యాగాలు, చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతున్నదని ఆయన ఆరోపించారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించినప్పుడే రాజ్యాంగాన్ని గౌరవించినట్లు అని పేర్కొన్నారు. మార్చి 26న తెలంగాణ కళాకారులతో ఢిల్లీ తెలంగాణ భవన్ లో ధూంధాం సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సభకు రావాలని ఆహ్వానం అందించడంతో పాటు, కరెన్సీపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలనే అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని ఎంపీ వంశీకృష్ణకు విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. తమ విజ్ఞప్తిపై ఎంపీ సానుకూలంగా స్పందించారన్నారు. ఈ విషయాన్ని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచుతామని ఎంపీ హామీ ఇచ్చారని తెలిపారు.
