
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ అగ్రనేతలు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఎలక్షన్ క్యాంపెయిన్‌లో పాల్గొంటారని పార్టీ లీడర్లు ఆదివారం పత్రికా ప్రకటనలో వెల్లడించారు. సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు.
జనగామ, కోరుట్ల నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.35 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్ లో జనగామ వెళ్తారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొని, 2.45 గంటలకు కోరుట్లకు చేరుకుంటారు. 3 నుంచి 3.40 వరకు కోరుట్ల మీటింగ్ లో పాల్గొని మాట్లాడుతారు. సాయంత్రం 4.45 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకొని... రోడ్డు మార్గంలో ఉప్పల్ వెళ్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు ఉప్పల్ లో జరిగే రోడ్ షోలో పాల్గొని మాట్లాడుతారు. తర్వాత బేగంపేటకు చేరుకుని ఢిల్లీ వెళ్లిపోతారు.
త్వరలో ప్రధాని, యూపీ సీఎం
ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఈ నెల 24, 25న ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. మోదీ హైదరాబాద్ లో రోడ్ షోతో పాటు మరో రెండు సభల్లో పాల్గొంటారని పార్టీ లీడర్లు చెబుతున్నారు. మోదీ పాల్గొనే రెండు సభలు ఎక్కడ అనేది ఇంకా ఖరారు కావాల్సి ఉందని తెలిపారు. ఈ నెల 24, 25, 26వ తేదీల్లో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ రాష్ట్రానికి వస్తారు. ఏ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేస్తారనేది కూడా త్వరలో ఫైనల్ అవుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు.
నేడు రాష్ట్రానికి కేంద్ర మంత్రులు
కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వస్తున్నారు. జూబ్లీహిల్స్, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో జరిగే క్యాంపెయిన్‌లో పాల్గొంటారు. నితిన్ గడ్కరీ ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉదయం 11.30 గంటలకు, కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని మాట్లాడుతారు.
అదేవిధంగా, సాయంత్రం నిర్వహించే రోడ్‌షోలో కూడా పాల్గొంటారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముషీరాబాద్ సెగ్మెంట్లో ప్రచారం చేస్తారు. ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్ పురందేశ్వరి మహేశ్వరం నియోజకవర్గం క్యాంపెయిన్‌లో పాల్గొంటారు. ఈ నెల 21న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రెండు సభల్లో, 25, 26న స్మృతి ఇరానీ హుజురాబాద్, మహేశ్వరంలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొని మాట్లాడుతారు.