పోలీసులే తన కొడుకును కొట్టి చంపారు..ఆమూరి చిరంజీవి తల్లి లక్ష్మి ఆరోపణ

పోలీసులే తన కొడుకును కొట్టి చంపారు..ఆమూరి చిరంజీవి  తల్లి లక్ష్మి ఆరోపణ

పద్మారావునగర్, వెలుగు: పోలీసులే తన కొడుకును కొట్టి చంపారని హైదరాబాద్​లోని తుకారం గేట్ ​పోలీసుల విచారణలో మృతిచెందిన ఆమూరి చిరంజీవి (30) తల్లి లక్ష్మి ఆరోపించారు. ఎల్బీనగర్​లోని భూపేశ్​నగర్​కు చెందిన చిరంజీవిని ఓ కేసు విచారణ నిమిత్తం మంగళవారం సాయంత్రం  పోలీసులు తీసుకెళ్లారు. దగ్గర్లోని స్టేషన్​కే తీసుకెళ్తున్నామని ఫ్యామిలీ మెంబర్స్​కు చెప్పారు. రాత్రయినా చిరంజీవి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన అతని భార్య, తల్లి చిరంజీవికి ఫోన్ ​చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో వారు ఎల్బీనగర్​, మీర్​పేట స్టేషన్​లకు వెళ్లి అడగగా తాము తీసుకురాలేదని చెప్పారు. చివరికి అర్ధరాత్రి 12 గంటల సమయంలో పోలీసులు వారి ఇంటికి వెళ్లి చిరంజీవి చనిపోయాడని చెప్పారు. డెడ్​ బాడీని గాంధీ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచినట్టు తెలిపారు.

గాంధీ మార్చురీ వద్ద ఉద్రిక్తత

బుధవారం ఉదయం గాంధీ మార్చురీ వద్దకు చేరుకున్న చిరంజీవి ప్యామిలీ మెంబర్స్​ ఆందోళనకు దిగారు. ఇంటి నుంచి పోలీసులతో ఆరోగ్యంగా వెళ్లిన చిరంజీవి గంటల వ్యవధిలోనే ఎలా చనిపోయాడని మృతుడి అక్క ప్రశ్నించింది. తన కొడుకును పోలీసులే అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని, తన బిడ్డను కొట్టిచంపడానికి పోలీసులకు అధికారం ఎవరు ఇచ్చారని మృతుడి తల్లి లక్ష్మి విలపిస్తూ  ప్రశ్నించింది. నేరం చేస్తే కోర్టుకు రిమాండ్ చేయాలి తప్ప కొట్టిచంపడం ఏమిటని బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. దాంతో వారు గాంధీ ఆసుపత్రి ఎదురుగా ముషీరాబాద్​ మెయిన్​ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దాదాపు గంట సేపు ఆందోళన చేయడంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్​ జామ్​ అయింది. అనంతరం ఆందోళనకారులు తిరిగి గాంధీ మార్చురీ వద్దకు చేరుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు డెడ్​బాడీకి పోస్టుమార్టం నిర్వహించొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, పోలీసు అధికారులు నష్టపరిహారం ఇవ్వడానికి బేరసారాలకు సిద్ధం కాగా అందుకు వారు ఒప్పుకోలేదు. తమకు డబ్బులు అవసరం లేదని, చిరంజీవిని చంపిన వారికి శిక్ష పడాలని డిమాండ్​ చేశారు. ఈ మేరకు వారు పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి నిర్ణయించారు. దీంతో చిరంజీవి డెడ్​బాడీకి గురువారం పోస్టుమార్టం జరిగే అవకాశం ఉంది. మొత్తంగా బాధిత కుటుంబసభ్యుల ఆందోళనలతో గాంధీ ఆసుపత్రి బుధవారం రోజంతా అట్టుడికింది.