ఏఎంవీఐ పరీక్ష పేపర్ లీక్.. పేపర్ మళ్లీ తయారు చేసి, పరీక్ష పెట్టాలి : అభ్యర్థులు

 ఏఎంవీఐ పరీక్ష పేపర్ లీక్.. పేపర్ మళ్లీ తయారు చేసి, పరీక్ష పెట్టాలి :  అభ్యర్థులు

టీఎస్పీఎస్సీ ఈ నెల 23న  అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీకి చెందిన పలు పేపర్లు లీక్ అవడంతో..  మోటార్ వెహికల్ పరీక్ష పేపర్ కూడా లీకైనట్లు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు పరీక్షలు పెడతారా లేదా అని క్లారిటీ కోసం టీఎస్పీఎస్సీ కార్యాలయానికి అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పరీక్ష అభ్యర్థులు చేరుకుని, నిరసన వ్యక్తం చేశారు. 

పరీక్ష ఉందా లేదా అని అధికారులను అడిగినా క్లారిటీ ఇవ్వడం లేదని అభ్యర్థులు ఆందోళన చేశారు. తమ పరిస్థితి ఏంటని నిలదీశారు. దీనికి సంబంధించిన టీఎస్పీఎస్సీకి ఎన్ని కాల్స్ చేసినా, మెయిల్స్ చేసినా రిప్లై లేదంటున్న వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులను TSPSC చుట్టుపక్కల ఉండనివ్వకుండా పోలీసులు వారిని పంపించేస్తున్నారు. ఇప్పుడు పెట్టబోయే పరీక్షకు సంబంధించిన ప్రశ్నా పత్రాన్ని తీసేసి, కొత్త పేపర్ తయారు చేసి పరీక్ష పెట్టాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.