- శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
- రవీంద్రభారతిలో జరిగిన జయంతి వేడుకల్లో వ్యాఖ్యలు
రవీంద్రభారతి, వెలుగు: జయశంకర్ సార్ కోరుకున్న విధంగా తెలంగాణ రాష్ట్రం సిద్దించలేదని, హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ నేతలు వారి రాజధాని అమరావతిలో స్థిరపడితేనే జయశంకర్ సార్ కోరుకున్న తెలంగాణ సిద్దించినట్లుగా భావిస్తామని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ 92వ జయంతి వేడుకలను గురువారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
కార్యక్రమానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, ఎల్వీ రమణ, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, అంజిరెడ్డి, పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
వారందరూ ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆచార్య జయశంకర్ విశేష కృషి చేశారని, ఉద్యమ స్ఫూర్తిని ప్రజల హృదయాల్లో నాటిన మహనీయుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. ఇతర వక్తలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి జయశంకర్ అందించిన మార్గదర్శకత్వం చిరస్మరణీయమని పేర్కొన్నారు.
