హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని చిన్న కాంట్రాక్టర్లు ఎవరూ అధైర్యపడొద్దని, పెండింగ్ బిల్లుల సమస్యలను పరిష్కరిస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభయమిచ్చారు. గురువారం హైదరాబాద్ వనస్థలిపురంలో ఇటీవల మృతి చెందిన నాగర్‌కర్నూల్ జిల్లా కాంట్రాక్టర్, వైస్ ఎంపీపీ, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘‘ఏవైనా బిల్లులు పెండింగ్‌లో ఉంటే కాంట్రాక్టర్లు నేరుగా సెక్రటేరియెట్‌లో గానీ, నా వద్దకు గానీ వచ్చి తెలపవచ్చు.
లేదా అసోసియేషన్ ద్వారా అయినా నా దృష్టికి తీసుకురావచ్చు. అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి సమస్యలన్నీ పరిష్కరిస్తాం’’ అని భరోసా ఇచ్చారు. ప్రజాప్రతినిధిగా, కాంట్రాక్టర్‌గా సేవలు అందించిన శ్రీనివాస్ రెడ్డి మృతి తీవ్రంగా బాధించిందని భావోద్వేగానికి లోనయ్యారు. మంత్రి వెంట బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు డి.వి.ఎన్. రెడ్డి, ఎస్.ఎన్.రెడ్డి, ఆల్ ఇండియా కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ దేవేందర్ రెడ్డి, అధికారులు ఉన్నారు.
