కోరుట్లలో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిండు ! మద్యం మత్తులో నానా రచ్చ

కోరుట్లలో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిండు ! మద్యం మత్తులో నానా రచ్చ

కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో మంగళవారం ఆర్టీసీ బస్సు చోరీకి గురవగా, పోలీసులు చేజ్​ చేసి పట్టుకున్నారు. ఆర్టీసీ అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల ఆర్టీసీ డిపోకు చెందిన టీఎస్ 08 జడ్ 0103 నంబర్  బస్సు కల్లూరు మోడల్  స్కూల్ కు చెందిన విద్యార్థులను తీసుకువచ్చేందుకు డ్రైవర్​ ప్రవీణ్  9వ నంబర్​ ప్లాట్​ఫామ్ పై నిలిపి ఉంచాడు. కండక్టర్  కంట్రోలర్  వద్ద వివరాలు నమోదు చేసేందుకు వెళ్లగా, డ్రైవర్ టీ తాగేందుకు హోటల్​కు వెళ్లాడు.

బస్సులో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన ధర్మపురి మండలం నాగారంకు చెందిన సందుల సాంబయ్య మద్యం మత్తులో బస్సును స్టార్ట్  చేసి వేగంగా వెళ్లిపోయాడు. డ్రైవర్ వచ్చి చూడగా బస్సు కనిపించకపోవడంతో డిపో అధికారులకు సమాచారం అందించాడు.

జీపీఎస్ ట్రాకర్  ఆధారంగా బస్సును గుర్తించి కోరుట్ల, మెట్​పల్లి పోలీసులు, ఆర్టీసీ సెక్యూరిటీ సిబ్బంది వెంబడించారు. చివరకు హైవే పక్కన ఉన్న గుంతలోకి బస్సు దూసుకెళ్లి నిలిచిపోయింది. పారిపోయేందుకు యత్నించిన సాంబయ్యను అదుపులోకి తీసుకొని స్టేషన్​కు తరలించారు. 20 కిలోమీటర్లు బస్సు తీసుకెళ్లగా, మెట్​పల్లి శివారులో పలు వాహనాలను ఢీకొట్టాడు.