పూర్వీకుల ఆస్తినీ అటాచ్ చేయొచ్చు.. PMLA చట్టంలో దీనికి మినహాయింపు లేదు: ఢిల్లీ హైకోర్టు

పూర్వీకుల ఆస్తినీ అటాచ్ చేయొచ్చు.. PMLA చట్టంలో దీనికి మినహాయింపు లేదు: ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: మనీలాండరింగ్‌‌‌‌‌‌‌‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌‌‌‌‌‌‌‌ఏ) కింద విచారణల్లో పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులకు మినహాయింపులేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆస్తుల అటాచ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ విషయంలో పూర్వీకుల లేదా వారసత్వ ఆస్తులకు చట్టంలో ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు కల్పించలేదని న్యాయమూర్తులు జస్టిస్‌‌‌‌‌‌‌‌ నవీన్‌‌‌‌‌‌‌‌ చావ్లా, జస్టిస్ రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దుదేజాల బెంచ్‌‌‌‌‌‌‌‌ తీర్పు వెలువరించింది. 

సైనిక్ విహార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న తన ఆస్తిని ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌ (ఈడీ) తాత్కాలికంగా అటాచ్‌‌‌‌‌‌‌‌ చేయడాన్ని పీఎంఎల్‌‌‌‌‌‌‌‌ఏ అప్పీళ్ల ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ సమర్థించడంతో ఆ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో అప్పీల్‌‌‌‌‌‌‌‌ దాఖలు చేశాడు. తన తండ్రి సొంత ఆదాయంతో  1991లో ఆస్తులు కొనుగోలు చేశారని, అది తాను కొనుగోలు చేసినది కాదన్నారు. 

ఈ నేపథ్యంలో తన తండ్రి ఆస్తులను అటాచ్‌‌‌‌‌‌‌‌ చేయలేరని వాదించాడు. కోర్టు స్పందిస్తూ.. అక్రమ నిధులతో కొనుగోలు చేసినట్లు నిరూపణ కాకపోతే పూర్వీకుల ఆస్తిని అటాచ్‌‌‌‌‌‌‌‌ చేయలేరన్న వాదన తప్పుదారి పట్టించేదిగా ఉందని పేర్కొంది. చట్టంలో పూర్వీకుల లేదా వారసత్వ ఆస్తులకు ప్రత్యేక మినహాయింపులు లేవు కాబట్టి, అవి కూడా అటాచ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అవుతాయని తీర్పు వెలువరిస్తూ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను కొట్టేసింది.