నీళ్ల దోపిడీ నిజమే: మన నీళ్లను తరలించుకుపోయిన ఏపీ

నీళ్ల దోపిడీ నిజమే: మన నీళ్లను తరలించుకుపోయిన ఏపీ

20 టీఎంసీలు తరలించుకుపోయిన ఏపీ

నిర్ధారించిన కేఆర్‌ఎంబీ

ఎక్కువ తరలిస్తూ తక్కువగా లెక్కలు చూపడం ఏమిటి?

మీ తీరు స్నేహపూర్వక వాతావరణాన్ని దెబ్బతీసేలా ఉంది

ఏపీ ఈఎన్సీకి కృష్ణా బోర్డు చైర్మన్‌ గుప్తా హెచ్చరిక

జాయింట్​ అబ్జర్వేషన్​కు తెలంగాణ ఇంజనీర్లను అనుమతించాలని ఆదేశం
రాష్ట్ర ఈఎన్సీ లేఖకు స్పందన

 

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి శ్రీశైలం నీళ్లను ఆంధప్రదేశ్​ దొడ్డిదారిన తరలించుకుపోయింది వాస్తవమేనని తేలింది. ఈ విషయాన్ని కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు(కేఆర్‌ఎంబీ) నిర్ధారించింది. ఏపీ ఎక్కువగా నీళ్లను తీసుకుపోతూ తక్కువ లెక్కలు చూపుతోందని బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. కృష్ణా నీళ్ల తరలింపును పరిశీలించేందుకు తెలంగాణ ఇంజనీర్లను అనుమతించి తీరాలని ఆదేశించింది. ఈ మేరకు ఏపీ ఈఎన్సీకి కేఆర్‌ఎంబీ చైర్మన్‌ డాక్టర్‌ ఆర్‌.కె. గుప్తా  ఈ నెల 19న లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి వారం రోజుల్లోనే 20 టీఎంసీల నీటిని తరలించుకుపోయారని పేర్కొంటూ తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ ఈ నెల 14న బోర్డు చైర్మన్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన బోర్డు చైర్మన్‌..  నీటి తరలింపు తీరును తప్పుబడుతూ ఏపీకి లేఖ రాశారు. ఈ నెల 8న పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ల తరలింపు రీడింగ్‌ తీసేందుకు వెళ్లిన జాయింట్‌ టీమ్‌ను ఏపీ ఇంజనీర్లు అడ్డుకున్నారని కృష్ణా బోర్డు చైర్మన్​కు ఈ నెల 14న రాసిన లేఖలో తెలంగాణ ఈఎన్సీపేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఈ నెల 9న జరిగిన కేఆర్‌ఎంబీ మీటింగ్‌లో ప్రస్తావించడంతో పదో తేదీ నుంచి 12 వరకు అనుమతించారని అందులో ప్రస్తావించారు. ఆ మూడు రోజుల్లో పోతిరెడ్డిపాడు నుంచి 28 వేల క్యూసెక్కుల డిశ్చార్జి ఉన్నట్టు ప్రాజెక్టు ఇంజనీర్లు, ఏపీ ఇంజనీర్లు పేర్కొనగా.. జాయింట్‌ సర్వేలో 10న 33,266 క్యూసెక్కులు, 11న 34,888 క్యూసెక్కులు, 12న 38,851 క్యూసెక్కులు విడుదలైనట్టు తేలిందని, ఇంతే మొత్తాలు టెలిమెట్రోలోనూ నమోదయ్యాయని బోర్డు దృష్టికి తెలంగాణ ఈఎన్సీ తీసుకువచ్చారు. 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఏపీ 20 టీఎంసీల నీటిని తరలించుకుపోయిందని లేఖలో తెలిపారు. తెలంగాణ ఈఎన్సీ లేఖను ప్రస్తావిస్తూ ‘వెలుగు’ ఈనెల 17న ‘ఆగని నీళ్ల దొపిడీ’ పేరిట కథనం ప్రచురించింది.

20 టీఎంసీలు తరలించుకుపోయిన ఏపీ.. నిర్ధారించిన కేఆర్‌ఎంబీ

ఏపీ ఈఎన్సీకి కేఆర్​ఎంబీ చైర్మన్ఆదేశాలివీ..

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి తరలించుకుపోయిన నీటి రికార్డులు సరిచేయండి.

ఇకపై ఎంత నీటిని తరలించుకుపోతే అంతే మొత్తాలను రికార్డుల్లో చూపించండి.

కృష్ణా నీటి తరలింపుపై తెలంగాణ ఇరిగేషన్‌, ఏపీ వాటర్‌ రిసోర్సెస్‌ సంయుక్త బృందం జాయింట్‌ అబ్జర్వేషన్‌ను కొనసాగించండి.

ఇరు రాష్ట్రాల ఇంజనీర్ల అభ్యర్థన మేరకు కేఆర్‌ఎంబీ అధికారులు నీటి తరలింపును పరిశీలించేందుకు వస్తే అనుమతించండి.

ఏపీపై బోర్డు చైర్మన్​ ఆగ్రహం

ఏపీ ఇరిగేషన్‌ శాఖ వ్యవహరిస్తున్న తీరుతో ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల కోసం ఉన్న స్నేహపూర్వక వాతావరణం దెబ్బతింటుందని కేఆర్‌ఎంబీ చైర్మన్‌ ఆర్‌.కె. గుప్తా హెచ్చరించారు. బోర్డు ఆదేశాలను ధిక్కరించి నీటి తరలింపు పరిశీలనకు వెళ్లిన ఇంజనీర్లను అడ్డుకోవడం మంచిది కాదని ఏపీ ఈఎన్సీకి రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఈ నెల 11, 12 తేదీల్లో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి 28 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోయామని లెక్కలు చెప్పారని, ఇరు రాష్ట్రాల ఇంజనీర్ల జాయింట్‌ అబ్జర్వేషన్‌లో 36 వేల క్యూసెక్కుల నుంచి 40 వేల క్యూసెక్కుల వరకు నీటిని తరలించుకుపోయినట్టుగా తేలిందని పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి నీటి తరలింపుపై ఈ నెల 13న బోర్డు సభ్య కార్యదర్శి కర్నూలు చీఫ్‌ ఇంజనీర్‌కు ఫోన్‌ చేసి వివరణ కోరగా కాలువల సామర్థ్యాన్ని పరిశీలించేందుకే ఎక్కువగా నీటిని విడుదల చేసి ట్రయల్‌ రన్‌ చేశారని చెప్పారని తెలిపారు. తరలించే నీటికి సంబంధించిన లెక్కలను తక్కువ చేసి చూపించడం ఏపీపై నమ్మకాన్ని దెబ్బతీసేలా ఉందని గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇరిగేషన్‌ ఇంజనీర్లు, ఏపీ వాటర్‌ రీసోర్సెస్‌ ఇంజనీర్ల జాయింట్‌ అబ్జర్వేషన్‌ను అడ్డుకోవడం అంటే ఇరు రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వకంగా జరిగే నీటి పంపిణీకి ఆటంకం కలిగించడమేనని అభిప్రాయపడ్డారు. ఆగస్టు 10న తరలించిన నీటి విషయంలోనూ పది శాతం తక్కువ చేసి చూపించారని తెలిపారు. బోర్డు ఆదేశాలను విస్మరించి ఏకపక్షంగా వ్యవహరించొద్దని ఏపీ జలవనరుల శాఖను బోర్డు చైర్మన్‌ ఆదేశించారు.