V6 News

ఏపీలో ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి.. జొన్నగిరి గోల్డ్ మైన్‌తో దిగుమతులు తగ్గుతాయా..?

ఏపీలో ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి.. జొన్నగిరి గోల్డ్ మైన్‌తో దిగుమతులు తగ్గుతాయా..?

ఏపీ భారత పారిశ్రామిక చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బంగారు గనిగా గుర్తింపు పొందిన జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ మే నెల ప్రారంభంలో తన కార్యకలాపాలను మొదలుపెట్టేందుకు సర్వం సిద్ధం చేసుకుంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల్లో విస్తరించి ఉన్న ఈ గని.. భారత బంగారు దిగుమతుల తలరాతను మార్చే దిశగా తొలి అడుగు వేస్తోంది. జియోమైసోర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సుమారు 400 కోట్ల రూపాయల పెట్టుబడితో దీన్ని అభివృద్ధి చేసింది.

భారత్ ఏటా సుమారు 800 టన్నులకు పైగా బంగారాన్ని దిగుమతి చేసుకుంటూ ఫారెక్స్ రిజర్వ్స్ పై భారీగానే భారాన్ని మోపుతోంది. ప్రస్తుతం దేశీయంగా హట్టి గోల్డ్ మైన్స్ ద్వారా కేవలం 1.5 టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది. 2000 సంవత్సరంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మూతపడిన తర్వాత ఏర్పడిన లోటును ఈ జొన్నగిరి ప్రాజెక్ట్ భర్తీ చేయనుందని నిపుణులు చెబుతున్నారు. సుమారు 598 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గనిలో 13.1 టన్నుల గోల్డ్ రిజర్వ్స్ ఉన్నట్లు గుర్తించారు. ఇది 42.5 టన్నులకు పెరిగే అవకాశం ఉందని అంచనా. రాబోయే 15 ఏళ్లలో ఏడాదికి 1,000 కిలోల స్వచ్ఛమైన బంగారాన్ని ఉత్పత్తి చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

సాంకేతికతకు పట్టుదల తోడైతే భారత్ అద్భుతాలు సాధించగలదని ఈ ప్రాజెక్ట్ నిరూపిస్తోంది. కేవలం 13 నెలల్లోనే ప్రాసెసింగ్ ప్లాంట్‌ను సిద్ధం చేయడం ఒక రికార్డు. వచ్చే దశాబ్ద కాలంలో భారత్ ఏడాదికి 50 నుండి 100 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకోవాలని డెక్కన్ గోల్డ్ ఎండీ హనుమ ప్రసాద్ మోడలి అభిప్రాయపడ్డారు. కేవలం వాణిజ్య పరంగానే కాకుండా.. వ్యూహాత్మకంగా కూడా ఇది దేశానికి ఎంతో కీలకం. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే మరిన్ని ప్రైవేట్ సంస్థలు మైనింగ్ రంగంలోకి వచ్చే అవకాశం ఉంది. కేవలం తవ్వకాలకే పరిమితం కాకుండా.. స్థానిక ప్రాంతాల్లో విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి వంటి సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ఈ సంస్థ చేపడుతోంది.

ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ.. పెట్టుబడిదారుల ఆసక్తి మాత్రం తగ్గడం లేదు. మార్చి నెలలో గోల్డ్ ETFలలోకి భారీగా పెట్టుబడులు రావడం దీనికి నిదర్శనం. అయితే ఏపీలోని ఈ మెగా గని వెంటనే దిగుమతులను పూర్తిగా తగ్గించలేకపోవచ్చు, కానీ దేశీయ వనరులను వినియోగించుకునే దిశగా ఇది ఒక కీలక అడుగని చెప్పుకోవచ్చు. విదేశీ బంగారంపై ఆధారపడటం తగ్గించి, దేశీయంగా దొరికే పసిడితో మెరవాలన్న భారత ఆశయానికి ఆంధ్రప్రదేశ్ వేదికగా నిలుస్తోంది.