
- అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్
- చలో సెక్రటేరియెట్‌తో నిరసన.. పలువురు అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీలు గురువారం చేపట్టిన ‘చలో సెక్రటేరియెట్’ ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్ హెల్పర్స్, సీఐటీయూ ఆధ్వర్యంలో దోమలగూడ ఏవీ కాలేజీ వద్ద నుంచి అంగన్వాడీలు ఇందిరా పార్క్ వద్దకు చేరుకున్నారు.
అక్కడ మెయిన్ రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తర్వాత అక్కడి నుంచి సెక్రటేరియెట్ ముట్టడించేందుకు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకోగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, అంగన్వాడీ, సీఐటీయూల మధ్య తోపులాట జరిగింది. దీంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి స్పృహ తప్పిపడిపోయారు.
పలువురు సీఐటీయూ నేతలు, అంగన్వాడీలను పోలీసులు అదుపులోకి తీసుకుని చిక్కడపల్లి, అంబర్‌పేట, ఖైరతాబాద్, అబిడ్స్, దోమలగూడ, ఉస్మాన్‌గంజ్ తదితర పోలీస్ స్టేషన్స్ కు తరలించారు. కొందరు తప్పించుకుని సెక్రటేరియెట్ గేటు ముందుకు చేరుకుని ధర్నాకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.