- ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహణ
- ఎండల దృష్ట్యా సర్కారు నిర్ణయం
- నేడు ఉత్తర్వులు వచ్చే ఛాన్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి భగభగలకు జనం బెంబేలెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్ల మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాలనూ ఒంటిపూట నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో విద్యాశాఖ ఇప్పటికే స్కూళ్లకు హాఫ్ డేస్ ప్రకటించింది.
ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని సూచించింది. ఇదే పద్ధతిని అంగన్వాడీ సెంటర్లలోనూ అమలు చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వారు కసరత్తు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు సోమవారం వచ్చే అవకాశం ఉంది.
వేసవి సెలవులూ ఇవ్వాలని..
ఎండల తీవ్రత దృష్ట్యా అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూట నిర్వహించడంతోపాటు నెల రోజుల పాటు వేసవి సెలవులు కూడా ఇవ్వాలని అంగన్వాడీ టీచర్స్ యూనియన్ ప్రతినిధులు గతంలో మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందించారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, గతేడాది లాగే ఈసారీ వేసవి సెలవులపై త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. అంగన్వాడీ సెంటర్లు ఒంటిపూట నడిచినప్పటికీ.. చిన్నారుల పోషణ విషయంలో రాజీ పడొద్దని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. టేక్ హోమ్రేషన్ ద్వారా లబ్ధిదారుల నివాసాలకే పౌష్టికాహారం అందజేసేలా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లకు సూచించారు.
