సమ్మెలోకి అంగన్‌‌‌‌‌‌‌‌వాడీలు

సమ్మెలోకి అంగన్‌‌‌‌‌‌‌‌వాడీలు
  • రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌‌‌‌‌‌‌‌వాడీకేంద్రాలకు తాళాలు
  • సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు, అధికారులతో తాళాలు పగులగొట్టించిన సర్కార్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ వర్కర్లు సమ్మె ప్రారంభించారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని, కనీసం వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, రిటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, పెన్షన్ అమౌంట్‌‌‌‌‌‌‌‌ను పెంచాలని అంగన్‌‌‌‌‌‌‌‌వాడీలు డిమాండ్ చేస్తున్నారు. సమ్మె నేపథ్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాలకు తాళాలు వేశారు. దీంతో ప్రభుత్వం సర్పంచ్‌‌‌‌‌‌‌‌లు, ఇతర అధికారుల ద్వారా అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ సెంటర్ల తాళాలు పగులగొట్టించింది. 

దీనిపై అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్స్‌‌‌‌‌‌‌‌ అండ్ హెల్పర్స్ జేఏసీ మండిపడింది. ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం సమ్మె గురించి 14 రోజుల ముందే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని, అయినా తమ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం శ్రద్ధ చూపించలేదని జేఏసీ విమర్శించింది. సమస్యలు పరిష్కరించకపోగా అంగన్‌‌‌‌‌‌‌‌వాడీలను బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఇది అత్యంత అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆగస్ట్ 18న మంత్రి సత్యవతి  రాథోడ్‌‌‌‌‌‌‌‌ అంగన్‌‌‌‌‌‌‌‌వాడీలతో సమావేశం నిర్వహించి, ఆ రోజు ఇచ్చిన హామీలను అమలు చేయాలనే తాము కోరుతున్నామన్నారు. 

ఇచ్చిన హామీలకు భిన్నంగా, చాలా తక్కువగా రిటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించారని, ఇతర డిమాండ్లపై అసలు ప్రకటనే చేయలేదని జేఏసీ తెలిపింది. అంగన్‌‌‌‌‌‌‌‌వాడీల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని జేఏసీ లీడర్లు పి.జయలక్ష్మి, ఎన్‌‌‌‌‌‌‌‌.కరుణ కుమారి ఓ ప్రకటనలో తెలిపారు.