
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కుండపోత వర్షం పడుతోంది. ఈ క్రమంలో మెదక్, కామారెడ్డి జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు పడుతాయని తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్సూన్, ట్రాఫిక్, పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అత్యవసరమైతేనే ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలని సూచించారు.