గుడ్ న్యూస్.. టౌన్లలో ఇందిరమ్మ టవర్లు.. జీ ప్లస్ 3, 5 పద్ధతిలో నిర్మాణం

గుడ్ న్యూస్.. టౌన్లలో ఇందిరమ్మ టవర్లు.. జీ ప్లస్ 3, 5 పద్ధతిలో నిర్మాణం

 

  • ఒక్కో టవర్​లో 12 ఇండ్లు.. 
  • ఇప్పటికే 19 స్థలాల గుర్తింపు
  • వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పనులు స్టార్ట్ 
  • అఫర్డబుల్ హౌసింగ్ పాలసీ.. టౌన్ షిప్​ల నిర్మాణం
  • బడ్జెట్ ప్రపోజల్స్ అందజేసిన హౌసింగ్ శాఖల

హైదరాబాద్ ,వెలుగు: రూరల్ ప్రాంతాల్లో శరవేగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం సాగుతున్న నేపథ్యంలో ఇపుడు అర్బన్ ఏరియాల్లో ఇళ్ల నిర్మాణంపై హౌసింగ్ శాఖ ఫోకస్ పెట్టింది. రూరలో నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున మూడున్నర లక్షల ఇళ్లు మంజూరు చేయగా ఇందులో రెండున్నర లక్షల ఇళ్లు స్టార్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా జీహెచ్ ఎంసీ తో పాటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జీ ప్లస్ 3 లేదా 5 ఫ్లోర్లలో ఇందిరమ్మ టవర్లను ప్రభుత్వం నిర్మించనుంది. వీటిని వచ్చే ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి పనులు స్టార్ట్ చేయనున్నారు.  వీటితో పాటు  పేద, మధ్య తరగతి ప్రజలకు  తక్కువ ధరకు ఎంఐజీ, ఎల్ ఐజీ కాలనీలు నిర్మించటం, శాటిలైట్ టౌన్ షిప్ లు నిర్మాణాలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ మూడు నిర్మాణాలకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ఫైనాన్స్ కు హౌసింగ్ అధికారులు ప్రపొజల్స్ పంపించారు. త్వరలో హౌసింగ్ మంత్రి దగ్గర రివ్యూ చేపట్టి, తరువాత డిప్యూటీ సీఎం శాఖల వారీగా రివ్యూలు చేయనున్నారు. 

వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి పనులు స్టార్ట్

అర్బన్ ఏరియాల్లో స్టార్ట్ చేయనున్న ఇందిరమ్మ టవర్లను ముందుగా జీహెచ్ ఎంసీలో స్టార్ట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఏప్రిల్ నుంచి జీహెచ్ ఎంసీలో పనులు స్టార్ట్ చేయనున్నట్లు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. అర్బన్ ఏరియాల్లో అర్హులు ఎక్కువ ఉండి సొంత జాగా లేని వాళ్లకు ఇళ్ల నిర్మాణంకు స్లమ్ ఏరియాలు, ప్రభుత్వ స్ధలాలు గుర్తించి వివరాలు అందచేయాలని జిల్లా కలెక్టర్లను హౌసింగ్ శాఖ ఆదేశించింది. వీటి వివరాలు హౌసింగ్ శాఖకు చేరాయి.  నగర ప్రాంతాల్లో సొంత స్థలం లేని వేలాది మందికి ఈ విధానం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఒకే చోట వందలాది కుటుంబాలు నివసించేలా గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఈ ప్రాజెక్టులు ఉండబోతున్నాయి. ముఖ్యంగా మురికివాడల్లో నివసించే వారికి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ఈ టవర్ల నిర్మాణ ప్రధాన ఉద్దేశ్యం. కొన్ని జిల్లాల్లో   రెవెన్యూ  పురపాలక శాఖ అధికారులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో అనువైన భూములను సర్వే చేస్తున్నారు. ముందుగా జీహెచ్ ఎంసీలో 19 చోట్ల స్లమ్ ఏరియాలను గుర్తించింది. 

ఇక్కడ జీ ప్లస్ 3  లేదా 5 ఫ్లోర్లలో ఇందిరమ్మ టవర్లను నిర్మించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లలో పార్కింగ్ కు స్ధలం వదిలేసి ఒక్కో ఫ్లోర్ లో 2 ఇళ్ల చొప్పున మూడు టవర్లలో 12 ఇళ్ల చొప్పున నిర్మించనున్నారు. ఇంటి నిర్మాణం,  రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించనున్నారు.  మౌళిక వసతులు మొత్తం కలిపి ఒక్కో ఇంటికి రూ. 8 లక్షలు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయంతో పాటు, అవసరమైన చోట అదనపు నిధులను వెచ్చించి ఈ టవర్లను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ. 5 లక్షలు ఖర్చు చేస్తోంది.  ఇందులో రూరల్ లో రూ. 72 వేలు , అర్బన్ లో రూ.1.50 లక్షలు కేంద్రం  ఇస్తోంది. అయితే ప్రభుత్వం ఇచ్చే వ్యయంకు మరో రూ. 3 లక్షలు అదనంగా ఖర్చు కానుంది. వీటిని మెప్మా తో పలు మార్గాల నుంచి సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లను ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల ను ప్రభుత్వం మంజూరు చేసింది. అర్బన్ ఏరియాల్లో కూడా ఇలాగే మంజూరు  చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 

అఫర్డబుల్ హౌసింగ్ పాలసీ ప్రకటన

రాష్ర్టంలో ఇళ్లు లేని ప్రతి పేదవాళ్లకు ఇళ్లు నిర్మించి తక్కువ ధరలకు అందించాలని అఫర్టబుల్ హౌసింగ్ పాలసీని ప్రభుత్వం తీసుకరానుంది. వచ్చే నెల ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో అఫర్టబుల్ హౌసింగ్ పాలసీని ప్రభుత్వం ప్రకటించనుంది.  ఇప్పటికే డ్రాఫ్ట్ పాలసీ రెడీ అయింది. త్వరలో ఈ పాలసీపై బిల్డర్లతో హౌసింగ్ అధికారులు, ఈ  పాలసీ ఖరారుకు ప్రభుత్వం నియమించిన కన్సల్టెన్సీ మీటింగ్ నిర్వహించి సలహాలు సూచనలు తీసుకోనుంది. హైదరాబాద్ తో పాటు రాష్ర్ట వ్యాప్తంగా హౌసింగ్ బోర్డు కు ఉన్న భూముల్లో ఎంఏజీ, ఎల్ ఐ జీ టవర్లను నిర్మించనున్నారు. హౌసింగ్ బోర్డు నోడల్ ఏజెన్సీగా టెండర్లు పిలిచి ప్రైవేట్ బిల్డర్లకు ఈ నిర్మాణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇక ఫ్యాక్టరీలు ఉన్న ప్రాంతాల్లో శాటిలైట్ టౌన్ షిప్ లు నిర్మాణానికి సైతం నిధులు కేటాయించాలని అధికారులు ఫైనాన్స్ కు ప్రపోజల్స్ అందించారు.