- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్‌లో వివిధ కేసులకు సంబంధించిన కీలకమైన ఆధారాలు, పత్రాలు ఉన్న కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తున్నదని.. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్, నయీం కేసు, భూ కుంభకోణాలు, ఓటుకు నోటు, ఇతర రాజకీయ అవినీతి కేసులకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు ఈ విభాగంలోనే ఉన్నాయని సమాచారం ఉందని, కేసుల విచారణ కీలక దశలో ఉన్నప్పుడే ప్రమాదం జరగడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.
ఈ ప్రమాదంలో కీలకమైన ఫైళ్లు, డిజిటల్ డేటాకు నష్టం వాటిల్లలేదని అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గతంలో సచివాలయంలో, ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్‌లో.. ఇలా పదేపదే ప్రభుత్వ రికార్డులే తగలబడటం వెనుక ఉన్న కారణాలేంటని, ప్రభుత్వ ఆఫీసుల్లో రికార్డులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన అవసరం ఉన్నదని సూచించారు.
ఈ ప్రమాదంలో ఏయే కేసులకు సంబంధించిన ఫైళ్లు కాలిపోయాయో పూర్తి వివరాలను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. భద్రతలో విఫలమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో, హైదరాబాద్ పరిసరాల్లో అగ్నిప్రమాదాలు తరచూ సంభవిస్తున్నాయని, వీటి నివారణకు తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని, అగ్ని ప్రమాదాలు జరగక్కుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
