ఇవాళ్టితో (ఫిబ్రవరి9) మున్సిపల్ ఎన్నికల ప్రచారం బంద్

ఇవాళ్టితో (ఫిబ్రవరి9) మున్సిపల్ ఎన్నికల  ప్రచారం  బంద్
  • సాయంత్రం 5 గంటలతో మున్సిపల్​ ఎలక్షన్​ క్యాంపెయిన్​ క్లోజ్​
  • 48 గంటల సైలెన్స్ పీరియడ్ అమల్లోకి
  • ఇయ్యాల అన్ని పార్టీల ముఖ్యనేతలంతా ప్రచారంలోనే 
  • నాన్​ లోకల్స్​ వెళ్లిపోవాలని ఆఫీసర్ల ఆదేశం
  • మద్యం షాపులు.. కల్లు దుకాణాలు బంద్
  • ఏరులై పారుతున్న మద్యం.. నోట్లు పంచే పనిలో అభ్యర్థులు
  • క్యాండిడేట్ల బంధువుల ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్లు​


హైదరాబాద్, వెలుగు: మున్సిపల్స్ ఎన్నికల ప్రచారానికి సోమవారం ఆఖరి రోజు. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనున్నది. ప్రచారానికి చివరి రోజు కావడంతో కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్, ఇతర నేతలంతా ప్రచారంలో బిజీబిజీగా గడపనున్నారు. కార్నర్​ మీటింగ్​లు, బైక్​ ర్యాలీలు, డోర్​ టు డోర్​ వంటి ప్రచారం కార్యక్రమాలను ఏర్పాటు చేసుకున్నారు. సీఎం రేవంత్​ రెడ్డి ప్రోగ్రాం​ మెదక్ ​ జిల్లాలో ఉండగా సమయం సరిపోదనే కారణంతో పర్యటన రద్దైనట్లు లోకల్​ లీడర్లు ప్రకటించారు. ఎలక్షన్​ కోడ్​ ప్రకారం పోలింగ్  ముగియడానికి 48 గంటల ముందు నుంచి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలో సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం ఆఫీసర్లు ప్రకటించారు. దీంతో సోమవారం సాయంత్రం 5 తర్వాత పోలింగ్ ముగిసే వరకు బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఈ టైమ్​లో బయట నుంచి వచ్చిన వ్యక్తులు, లీడర్లు  పట్టణాలను విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. ఒకవైపు ఆఫీసర్లు పోలింగ్​కు ఏర్పాట్లు చేస్తుండగా మరోవైపు పట్టణాల్లో మద్యం ఏరులై పారుతున్నది. ఓట్ల కోసం నోట్లు పంచే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు. ఆఫీసర్లకు చిక్కకుండా అభ్యర్థులు తమ బంధువుల ద్వారా యూపీఐ చేస్తున్నారు. ‘‘సైలెన్స్ పీరియడ్‌‌‌‌‌‌‌‌లో ప్రచార కార్యక్రమాలపై నిషేధం ఉంటుంది. ఎన్నికలు ముగిసేంత వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. ప్రజలు గుంపులుగా చేరరాదు’’ అన్ని విభాగాల నోడల్ అధికారులను ఎన్నికల కమిషనర్​ రాణి కుముదిని ఆదివారం ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. 

మద్యం షాపులు, కల్లు దుకాణాలు బంద్

మున్సిపల్​ ఎన్నికల సందర్భంగా సోమవారం సాయంత్రం 5 నుంచి ఈ నెల 11న సాయంత్రం 5 వరకు ఎన్నికలు జరిగే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో మద్యం షాపులు, కల్లు దుకాణాలు బంద్​ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఓట్ల లెక్కింపును పురస్కరించుకుని ఈ నెల 13న కూడా మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని, కౌంటింగ్  ముగిసేంత వరకు డ్రైడే అమలులో ఉంటుందని తెలిపింది. ఎక్కడైనా మద్యం పంపిణీ చేసినా, బెల్ట్​ షాపుల్లో మద్యం విక్రయాలు జరిపినా సీజ్​ చేసి, సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని జిల్లా కలెక్టర్లు ఆదేశించారు.    

అన్ని పార్టీల ముఖ్యనేతలంతా ప్రచారంలోనే 

ప్రచారానికి చివరి రోజు కావడంతో  కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్​, బీఆర్​ఎస్​, బీజేపీ ముఖ్యనేతలంతా సోమవారం ప్రచారంలోనే ఉండనున్నారు.  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిరలో, మంత్రులుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడెం కార్పొరేషన్, ఏదులాపురంలో, తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లి, కల్లూరులో, ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల, హుజూర్​నగర్, తిరుమలగిరి, కోదాడలో, సీతక్క ములుగు మున్సిపాలిటీలో ప్రచారం చేయనున్నారు. వెంకట్ రెడ్డి నల్గొండ కార్పొరేషన్​లో బైక్ ర్యాలీలో పాల్గొంటుండగా.. సంగారెడ్డి జిల్లా అందోల్–-జోగిపేట మున్సిపాలిటీలో దామోదర రోడ్ షోలో పాల్గొననున్నారు. పొన్నం ప్రభాకర్​ హుస్నాబాద్​లో ప్రచారం చేయనున్నారు. కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, నిజామాబాద్​ కార్పొరేషన్​లో పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​ ప్రచారం చేయనున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్​ సిరిసిల్ల, వేములవాడ, హుజురాబాద్, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ పరిధిలోని​ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో జరిగే రోడ్​షోలు, కార్నర్​ మీటింగ్​లో పాల్గొననున్నారు. కేటీఆర్​ భూపాలపల్లి, మహబూబాబాద్, హనుమకొండ జిల్లా పరకాలలో, హరీశ్ రావు దుబ్బాకలో ప్రచారం చేయనున్నారు.

రామగుండంలో కిషన్‌ రెడ్డి సభ..

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రామగుండం కార్పొరేషన్​లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. బిజేపీ స్టేట్ చీఫ్ ఎన్.రాంచందర్ రావు నిర్మల్, నిజామాబాద్ లో బహిరంగ సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు.

పీఓ, ఏపీఓలకు శిక్షణ పూర్తి

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్​ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్​ ప్రక్రియలో పాల్గొనే ప్రిసైడింగ్​ ఆఫీసర్లు, అసిస్టెంట్​ ప్రిసైడింగ్​ ఆఫీసర్లు, సిబ్బందికి శిక్షణ పూర్తి చేసినట్లు ఆదివారం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నెల 10న పోలింగ్ మెటీరియల్ పంపిణీ, పోలింగ్  అనంతరం మెటీరియల్ తీసుకోవడానికి చేపట్టాల్సిన విధివిధానాలను వివరించారు. బ్యాలెట్​ పద్ధతిలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో రెండు విడుతలుగా ర్యాండమైజే షన్​ చేసి పీఓ, ఏపీఓలు, సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి పోలింగ్  నిర్వహణకు సన్నద్ధం చేశారు.