- పింఛన్లు, ముఖ్యమైన పథకాలకు
- బడ్జెట్‌లో ఫండ్స్ పెంచేందుకు కసరత్తు
- ఆదాయం పెంపుపైనా సర్కారు ప్రణాళిక
- కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులపైనా దృష్టి
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టేలా బడ్జెట్ రూపకల్పన
- మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలకు సన్నాహాలు
హైదరాబాద్, వెలుగు: ప్రజా సంక్షేమ పథకాలకు నిధుల సర్దుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపెట్టింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ రూపకల్పనలో పింఛన్లు, ఇతర ఆరు గ్యారెంటీలకు భారీగా నిధులు కేటాయించే దిశగా కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్న స్కీమ్స్ అమలు తీరును నిశితంగా పరిశీలిస్తూనే, పెరుగుతున్న లబ్ధిదారుల సంఖ్యకు తగ్గట్టుగా బడ్జెట్ అంచనాలను అధికారులు రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం నెరవేర్చడమే లక్ష్యంగా, సంక్షేమ రంగానికి పెద్దపీట వేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. నిధుల కొరత అనే మాట రాకుండా ఉండేందుకు, ముందస్తుగానే ఆదాయ వనరులను పక్కాగా అంచనా వేసుకుంటూ, స్కీమ్‌లకు ఎక్కడా బ్రేకులు పడకుండా ప్లాన్ చేస్తున్నారు. ఇక బడ్జెట్ రూపకల్పన ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసింది. మున్సిపల్ ఎన్నికల హడావుడి ముగిసిన వెంటనే.. ఈ నెల 16 నుంచి డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో శాఖలవారీగా బడ్జెట్ ప్రతిపాదనలపై సమగ్ర రివ్యూ నిర్వహించనున్నారు. ప్రతి శాఖకు సంబంధించిన అవసరాలు, నిరుడి ఖర్చుల వివరాలను కూలంకషంగా చర్చించి, కొత్త కేటాయింపులను అక్కడికక్కడే ఖరారు చేయనున్నారు. ఈ కసరత్తు అంతా పూర్తయిన తర్వాత, మార్చి మొదటి వారంలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.
ఆరు గ్యారెంటీలకు సరిపడా ఫండ్స్..
ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరంలో పెన్షన్ల కోసం రూ.14,861 కోట్లు కేటాయించగా.. ఇప్పుడిస్తున్న రూ.2 వేల పెన్షన్‌కు అదనంగా మరో రూ.500 కలిపి ప్రతినెలా ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. దీంతో మరో రూ.3 వేల కోట్లు అదనంగా అవసరం అవుతాయని అంచనా. అలాగే, ఇందిరమ్మ ఇండ్లకు గత బడ్జెట్‌లో రూ.12,571 కోట్లు కేటాయించగా.. దీన్ని 30 శాతానికిపైగా పెంచాలని చూస్తున్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణానికి (మహాలక్ష్మి), గృహజ్యోతి పథకానికి, రైతులకు మేలు చేసేలా సన్నవడ్ల బోనస్‌లాంటి వాటికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులను మరింత పెంచేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. పథకాల అమలులో వేగం పెంచడంతోపాటు అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా నిధుల పెంపుపై కసరత్తు ముమ్మరం చేసింది.
సీఎస్ఎస్ కింద 6 వేల కోట్లు
కేంద్ర ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్) ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చేసారి కేంద్రం నుంచి సీఎస్‌ఎస్ కింద అదనంగా రూ.6 వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తుండగా, ఈ సారి ఇప్పటికే వివిధ పథకాలకు రూ.20 వేల కోట్ల దాకా నిధులు సమకూరాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని, అందుకు తగ్గట్టుగా రాష్ట్ర వాటాను ఎప్పటికప్పుడు విడుదల చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఒక్క పైసా కూడా వెనక్కి వెళ్లకుండా, కేంద్ర నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఢిల్లీ నుంచి రావాల్సిన బకాయిలు, గ్రాంట్ల విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ, నిధుల సమీకరణలో దూకుడు పెంచింది.
అంచనాల్లో 90 శాతం మేర పన్ను రాబడి
రాష్ట్ర ఆదాయ వనరులు, కేంద్రం నుంచి వచ్చే నిధులను బేరీజు వేసుకుంటూ, అందుకు తగ్గట్టుగా వచ్చే ఏడాది బడ్జెట్ పరిమాణాన్ని పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం అంచనా వేసిన పన్ను ఆదాయం 90 శాతం మేర సమకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. పన్నుల వాటా రూ.1.75 లక్షల కోట్లు అంచనా వేస్తే, జనవరి ముగిసే నాటికే రూ.1.27 లక్షల కోట్లు వచ్చింది. ఈ రెండు నెలల్లో ఇది ఇంకో 30 వేల కోట్లు వస్తుందని అంచనా. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన రూ.3.04 లక్షల కోట్ల బడ్జెట్‌తో పోలిస్తే, రానున్న బడ్జెట్‌లో సుమారు రూ.18 వేల కోట్ల మేర పెరుగుదల ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పథకాల అమలుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడంతోపాటు నీటిపారుదల, రోడ్లు, భవనాలులాంటి మౌలిక వసతుల కల్పనకు కూడా నిధుల కొరత లేకుండా చూస్తున్నారు. పెరుగుతున్న అవసరాలు, ద్రవ్యోల్బణం, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్ల భారాన్ని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ అంచనాలను సవరిస్తున్నారు. ఈసారి బడ్జెట్ గణాంకాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టేలా అత్యంత వాస్తవికంగా ఉండబోతున్నాయని సమాచారం.
సొంత ఆదాయంపై ఫోకస్
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద వచ్చే నిధులు కూడా రాబోయే ఆర్థిక సంవత్సరంలో భారీగా పెరిగే అవకా శం కనిపిస్తున్నది. ప్రస్తుతంతో పోలిస్తే సుమారు రూ.4 వేల కోట్ల పెరుగుదల ఉంటుందని, తద్వారా 2026–27లో మొత్తం రూ.34 వేల కోట్ల వరకు కేంద్ర పన్నుల వాటా రూపంలో రాష్ట్ర ఖజానాకు చేరనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, కేవలం కేంద్ర నిధులపైనే ఆధారపడకుండా, వివిధ మార్గాల ద్వారా రాష్ట్ర సొంత ఆదాయాన్ని (ఎస్‌వోఆర్) పెంచుకుంటేనే ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయిం చడం సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తున్నది. సంక్షేమంతోపాటు అభివృ ద్ధికి కూడా సమతూకం పాటించాలంటే సొంత ఆదాయ వనరులే కీలకమని ఆర్థిక శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
